LIVER DAMAGE SYMPTOMS
"లివర్" డేంజర్లో ఉన్నట్లు చెప్పడానికి ట్రై చేస్తుందని మీకు తెలుసా? - ఈ లక్షణాలన్నీ అందులో భాగమే!
మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? - లివర్ డేంజర్లో ఉందంటున్న నిపుణులు.
Symptoms of Liver Damage : కాలేయం (Liver) శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. ఇది విష పదార్థాలను శుభ్రపరచడం, శరీరంలో రక్తాన్ని నియంత్రిxచడంతో పాటు జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి దోహదపడుతుంది. కానీ, చాలా మంది గుండె, కిడ్నీలు ఆరోగ్య ఉండాలని అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ, కాలేయం గురించి పెద్దగా పట్టించుకోరు. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కాలేయం ఆరోగ్యం క్షీణించినప్పుడు సూచించే సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్, ప్రాసెస్ చేసిన చక్కెర పదార్థాలు, ఆల్కహాల్, కొన్ని రకాల మందులను అధికంగా తీసుకోవడం వల్ల కాలేయం ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. కాలేయ వ్యాధితో బాధపడుతున్నా వారిలో తరచుగా కడుపు నొప్పి, కాళ్ళ వాపు, సులభంగా గాయాలు, మలం, మూత్రం రంగులో మార్పులు, కామెర్లు లేదా చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారడం లాంటివి ఉంటాయని, కొన్నిసార్లు మాత్రం ఎలాంటి లక్షణాలు కనిపించవని medlineplus పేర్కొంది.
కామెర్లు : కాలేయం ఆరోగ్యం క్షీణించినప్పుడు చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారుతాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఎర్ర రక్త కణాల నుంచి ఉత్పత్తి అయ్యే పసుపు వర్ణద్రవ్యమైన బిలిరుబిన్ను సమర్థవంతంగా ప్రాసెస్ చేయడంలో లేదా దానిని పిత్తంలోకి పంపడంలో కాలేయం విఫలమవుతుందని వివరించారు. ఈ అధిక బిలిరుబిన్ రక్తప్రవాహం నుంచి చర్మం, కళ్లు, శ్లేష్మ పొరలలో పేరుకుపోయి అవి పసుపు రంగులోకి మారుతాయని తెలిపారు.
ముదురు రంగు మూత్రం : కాలేయం దెబ్బతిన్నప్పుడు మూత్రం ముదురు రంగులో వస్తుందని mayoclinic పేర్కొంది. బిలిరుబిన్ అనేది కాలేయం ద్వారా సరిగ్గా ప్రాసెస్ చేయకపోవడం వల్ల ఇది రక్తంలో అలాగే పేరుకుపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా పేరుకుపోయిన బిలిరుబిన్ను మూత్రపిండాలు వడపోసి మూత్రం ద్వారా బయటకు పంపుతాయని దీని వల్ల మూత్రం ముదురు పసుపు రంగులో కనిపిస్తుందని వివరిస్తున్నారు.
అలసట : అనారోగ్య కాలేయం అనేది రక్త ప్రవాహం నుంచి విష పదార్థాలను ఫిల్డర్ చేయడంలో బలహీనంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల సమతుల్య ఆహార పదార్థాలు తీసుకున్నా కూడా ఎక్కువగా అలసిపోయిన అనుభూతి కలుగుతుందని పేర్కొన్నారు. ఇందుకు ప్రధాన కారణం రక్తంలో బిలిరుబిన్ అధిక స్థాయిలో ఉండటం వల్ల ఎలాంటి పనులు చేయకపోయిన అలసిపోయినట్లు అనిపిస్తుందని తెలిపారు. అంతే కాకుండా పాదాలు, చీలమండలలో వాపుకు రావొచ్చనని వివరించారు.
కడుపు నొప్పి : పొత్తి కడుపులో కుడివైపు పైభాగం తరచుగా నొప్పిగా ఉంటే, అది దెబ్బతిన్న కాలేయం వల్ల కావొచ్చనని నిపుణులు చెబుతున్నారు. కాలేయం దెబ్బ తినడం వల్ల పొత్తి కడుపులో మంట, వ్యర్థ పదార్థాలు పేరుకుపోవడం వల్లనే కదిలేటప్పుడు, శ్వాసించేటప్పుడు పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి వస్తుందని పేర్కొన్నారు.
రక్తస్రావం : ఏదైనా చిన్న చిన్న దెబ్బతిన్నప్పుడు రక్తం గడ్డకట్టకుండా ఉంటే అది కాలేయ అనారోగ్యానికి సంకేతమని నిపుణులు చెబుతున్నారు. ఎందుకుంటే అనారోగ్య కాలేయం అనేది రక్తం గడ్డకట్టడానికి లేదా రక్తస్రావం ఆపడానికి అవసరమైన కారకాలను ఉత్పత్తి చేయదని పేర్కొన్నారు. ఫలితంగా శరీర గాయాల నుంచి రక్తస్రావం వేగంగా జరుగుతుందని తెలిపారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సంబంధిత డాక్టర్లు సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరికొన్ని లక్షణాలు : అతిగా మద్యం తాగడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోయి, చివరికి కాలేయం గట్టిపడటానికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్య నెమ్మదిగా కొనసాగుతూ రావడం వల్ల చాలామందిలో గుర్తించడం కష్టంగా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే కొంత మందికి మద్యం అలవాటు లేకపోయినా కాలేయంలో కొవ్వు పేరుకుపోవచ్చు దీన్నే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. ఇలాంటి వారిలో కాలేయం దెబ్బతియడం మొదలెట్టినప్పుడు బరువు తగ్గటం, అలసట, బలహీనత, చర్మం దురద, చర్మం కింది రక్తనాళాలు బలహీనమై ఉబ్బటం వంటి లక్షణాలు కనిపిస్తాయని Cleveland clinic పేర్కొంది.
NOTE : కాలేయం ఆరోగ్యానికి సంబంధించి ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
COMMENTS