JAMUN HEALTH BENEFITS
ఈ పండ్లను చిన్న చూపు చూస్తున్నారా? - షుగర్ కంట్రోల్ నుంచి గుండె ఆరోగ్యం వరకు ఎన్నో ప్రయోజనాలట!
నేరేడు పండ్లు తింటే కలిగే లాభాలను వివరిస్తున్న నిపుణులు!
Health Benefits of Jamun: ఊదా, నలుపు రంగుల మిశ్రమంతో మిలమిలా మెరుస్తూ రుచికి కాస్త వగరు, తీపిగా ఉండే నేరేడు పండ్లు అంటే అందరికీ ఇష్టమే. వర్షాకాలంలో విరివిగా దొరికే నేరేడు పండ్లు ఆరోగ్యానికి దివ్యౌషధమని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఎన్నో రోగాలకు సహజ నివారిణిగా పనిచేస్తాయని అంటున్నారు. ఇందులో పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు. మరి నేరేడుపండ్లు తినడం వల్ల కలిగే ఆ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం!
డయాబెటిస్ నియంత్రణ :
నేరేడు పండ్లు మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిదని నిపుణులు అంటున్నారు. దీనిలోని తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది రక్తంలో గ్లూకోజ్ లెవల్‌ను నియంత్రించడానికి దోహదపడుతుందని పేర్కొంటున్నారు. నేరేడు పండ్ల విత్తనాలలో ఉండే జాంబోలిన్, జాంబుసిన్ వంటి పదార్థాలు ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచడంలో దోహదపడతాయని, నేరేడు పండ్లలోని ఆంథోసైనిన్లు, ఎలాజిక్ ఆమ్లం వంటి సమ్మేళనాలు స్టార్చ్‌ను చక్కెరగా మారకుండా నిరోధించే సామర్థ్యం ఉంటుందని, తద్వారా ఇది యాంటీ డయాబెటిక్ లక్షణాన్ని ప్రదర్శిస్తుందని National Library of Medicine పేర్కొంది.
కంటి ఆరోగ్యం : నేరేడు పండ్లలో విటమిన్ ఎ, సి సమృద్ధిగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరిస్తున్నారు. అంతేకాకుండా రెటీనాను ఆక్సీకరణ నష్టం నుంచి కాపాడుతుందని, కళ్లలో రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, వాపును తగ్గించడానికి దోహదం చేస్తుందని వివరిస్తున్నారు.
అభిజ్ఞా పనితీరు : ఈ పండ్లలోని ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు మానసిక స్థితి మెరుగుపరచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి దోహదపడతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇందులో ఉన్న న్యూరోప్రొటెక్టివ్ లక్షణాలు మెదడు పనితీరును దెబ్బతీసే కారకాల నుంచి రక్షిస్తాయని, అంతే కాకుండా అభిజ్ఞా క్షీణత, న్యూరోడిజెనరేటివ్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని సూచిస్తున్నారు.
జీర్ణక్రియ మెరుగుదల: నేరేడు పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్ధకం వంటి సమస్యలను నివారించడానికి దోహదపడుతుందని పేర్కొంటున్నారు. జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించి, పేగుల కదలికలను క్రమబద్ధీకరిస్తుందని సూచిస్తున్నారు. ఇది ఎక్కువగా డయాబెటిస్, హైపర్లిపిడెమియా, హైపర్‌టెన్షన్, ఊబకాయం మొదలైన వివిధ జీవక్రియ సమస్యలకు చికిత్స చేయడానికి ఔషధంగా ఉపయోగించబడుతుందని National Library of Medicine పేర్కొంది.
రోగనిరోధక శక్తి పెంపు: నేరేడు పండ్లలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుందని, ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. జలుబు, దగ్గు వంటి వాటి నుంచి ఉపశమనం కలిగిస్తాయని పేర్కొంటున్నారు.
గుండె ఆరోగ్యం: నేరేడు పండులో పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయంటున్నారు నిపుణులు. ఇవి బీపీని నియంత్రించడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఎఫెక్టివ్‌గా ఉంటాయని వివరిస్తున్నారు. అంతేకాకుండా నేరేడు పండ్లు అనేవి కొలెస్ట్రాల్ స్థాయిలను సమతుల్యంగా ఉంచడంలో కూడా తోడ్పడతాయని తెలుపుతున్నారు.
రక్తహీనత : నేరేడు పండ్లలో ఐరన్, విటమిన్స్ అధికంగా ఉండటం వల్ల ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. రక్తహీనతతో బాధపడుతున్న వారు వీటిని తింటే మంచి జరుగుతుందని సూచిస్తున్నారు.
బరువు తగ్గడం: నేరేడు పండ్లలో తక్కువ కేలరీలు, ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. వీటిని తీసుకున్న తర్వాత ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుందని, ఫలితంగా బరువు అదుపులో ఉంటుందని వివరిస్తున్నారు.
ఎముకల ఆరోగ్యం: వీటిలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే నీరసంగా ఉన్నప్పుడు నేరేడు పండ్లను తింటే తక్షణ శక్తి లభిస్తుందని పేర్కొంటున్నారు.
చర్మం, జుట్టు సంరక్షణ : నేరేడు పండ్లు ఆరోగ్యపరంగానే కాకుండా, సౌందర్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో విటమిన్ ఎ, సి, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయని, ఇవి చర్మాన్ని తాజాగా ఉంచడంతో పాటు మొటిమలు, వృద్ధాప్య లక్షణాలను తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయని పేర్కొంటున్నారు. అంతేకాకుండా జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయని వివరిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
COMMENTS