HYDERABAD HOSTEL INFORMATION
హాస్టళ్లు ఎక్కడున్నాయో తెలియట్లేదా? - ఒకే ఒక్క క్లిక్‌తో పూర్తి లిస్ట్ మీ చేతుల్లో
సేఫ్ స్టే ప్రాజెక్టులో భాగంగా వెబ్సైట్ సిద్ధం చేస్తున్న సైబరాబాద్ పోలీసులు - ఇక నుంచి ఒక క్లిక్‌తో హాస్టళ్ల సమాచారం మీ చేతుల్లో
Hyderabad Hostels : ఆ యువతిది అప్పుడే చదువు పూర్తి అయింది. క్యాంపస్‌లో మంచి ప్యాకేజీతో హైదరాబాద్‌లో ఉన్నత ఉద్యోగం వచ్చింది. కనీసం ఆ యువతికి నగరం పరిచయం లేదు. ఎక్కడ ఉండాలో తెలియక ఆందోళనకు గురైంది. హాస్టల్లో ఉంటే ఎలా ఉంటాయి? అసలు ఎక్కడ ఉంటాయి? ఎవరైనా తెలిసిన వాళ్లు లేరే? అని ఆలోచనలో పడింది. ఈ ఆలోచన నగరానికి అప్పుడే ఉద్యోగానికి వచ్చినా, జీవనభృతి కోసం వచ్చినా ఉంటుంది.
అయితే ఈ సమస్యలు అన్నింటికీ పరిష్కారంగా సైబరాబాద్ పోలీసులు వినూత్న వేదికను సిద్ధం చేస్తున్నారు. అదే ఒక్క క్లిక్‌తో హాస్టల్ వివరాలు అన్ని తెలిసేలా సేఫ్ స్టే ప్రాజెక్టులో భాగంగా వెబ్‌సైట్‌ను సిద్ధం చేస్తున్నారు. ఏ ప్రాంతాల్లో హాస్టళ్లు ఉన్నాయి, గదులు ఎన్ని, ధర, కల్పిస్తున్న సదుపాయాలు ఇలా సమాచారం అంతా ఇందులో ఉంచుతారు. భద్రతను దృష్టిలో ఉంచుకొని దీన్ని రూపొందిస్తున్నారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎస్సీఎస్సీ) భాగస్వామ్యంతో వెబ్‌సైట్‌ను త్వరలో ప్రారంభించనున్నారు.
వెబ్సైట్ వివరాలు ఇలా :
ఎస్సీఎస్సీ ఇటీవల హాస్టళ్ల పరిస్థితులపై ఒక సర్వేను నిర్వహించింది. అందులో అనేక లోపాలు బయటపడ్డాయి. దాదాపు 75 శాతం వసతి గృహాలు అగ్నిమాపక నిబంధనలు పాటించడం లేదని తెలిసింది. అసలు చాలా వాటికి రికార్డులు సరిగా నిర్వహించడం లేదు. అనూహ్య ఘటన, ప్రమాదం జరిగినప్పుడు వివరాలు సేకరించడం సవాలుగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి లోపాలను సరిదిద్దడానికి యాప్‌ను రూపొందిస్తున్నారు.
ఈ వెబ్సైట్ ఎలా పని చేస్తుందంటే :
విద్యార్థి, ఉద్యోగి ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని, దానికి సమీపంలో హాస్టళ్లు ఎక్కడున్నాయో తెలుసుకోవచ్చు.
ఎన్ని గదులు అందుబాటులో ఉన్నాయి?
అక్కడ సదుపాయాలు ఎలా ఉన్నాయి?
ధర?
రివ్యూలు చూసి ఎంపిక చేసుకోవచ్చు
వెబ్సైట్లో చూసుకోవాలి.
యజమానులు, స్థానిక పోలీసులతో ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి తరచూ పర్యవేక్షిస్తూ సమన్వయం చేస్తారు.
భద్రతపై ప్రత్యేక దృష్టి :
వసతి గృహాల్లో తరచూ ఆత్మహత్యలు, నేరగాళ్లు తలదాచుకోవడం, ఇతర ఘటనలు జరుగుతున్న దృష్ట్యా వచ్చీపోయే వారి వివరాలు నమోదు చేసుకునేలా రికార్డులు నిర్వహించాలి.
వసతి గృహాల్లో ఉండే వ్యక్తుల తాజా ఫొటో, ఆధార్‌కార్డు, ఎక్కడ పని చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించేందుకు వారి సంరక్షకులు, కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు యజమానులు తీసుకోవాలి.
సెక్టార్ ఎస్సైలు తమ పరిధిలోని హాస్టళ్లను మూడు నెలలకోసారి పరిశీలించి భద్రత, ఇతర ఏర్పాట్లను గమనిస్తారు.
COMMENTS