HOW TO BECOME RICH
మీరు త్వరగా ధనవంతులు కావాలనుకుంటున్నారా? ఈ బెస్ట్ టిప్స్ మీ కోసమే!
ధనవంతులు కావడం ఎలా? జీవితపు కీలక దశల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలను ఏమిటి?How To Become Rich : సంపన్నులు కావాలని ఎవరికి మాత్రం ఉండదు. అందుకే అందరూ సూపర్ రిచ్ కావాలని తపిస్తుంటారు. అందుకోసం జీవితాంతం చెమట చిందించి శ్రమిస్తుంటారు. మన భారతదేశం ఆత్మనిర్భర్‌గా మారుతున్న వేళ, వ్యక్తులుగా మనం మాత్రం ఎందుకు వెనుకబడి ఉండాలి? జీవితంలోని అన్ని దశల్లోనూ మనం ఆత్మనిర్భర్‌గా, ధనవంతులుగా ఎలా కాగలమో ఈ కథనంలో తెలుసుకుందాం.
1. జీవితపు తొలి దశలో
ఆర్థిక శాస్త్రం బేసిక్స్ తెలుసుకోండి : పర్సనల్ ఫైనాన్స్ గురించి పాఠశాల స్థాయిలోనే పిల్లలకు బోధిస్తే బాగుంటుంది. మీరు చదువుకునే విభాగం, పనిచేసే రంగం ఏదైనా సరే కాంపౌండింగ్ ప్రాముఖ్యత గురించి తప్పక తెలుసుకోండి. డబ్బుకు ఉండే టైం వ్యాల్యూను అర్థం చేసుకోండి. ఇప్పటికే ఇవన్నీ తెలిసిన వారు, తమ పిల్లలకు ఈ అంశాల గురించి నేర్పించే ప్రయత్నం చేయాలి. తద్వారా వారికి వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలపై మంచి అవగాహన వస్తుంది. జీవితంలోని ప్రతీదశలోనూ సరైన ఆర్థిక ప్రణాళికలను సిద్ధం చేసుకోగలుగుతారు. అప్రమత్తత, ముందుచూపు, విచక్షణలతో కూడిన ఆర్థిక నిర్ణయాలను తీసుకుంటారు.
పార్ట్ టైమ్ ఉద్యోగం చేయండి : చాలా గ్రాడ్యుయేట్ కాలేజీల్లో ఉదయం టైంలోనే తరగతులు జరుగుతాయి. ఆ తర్వాత చాలా టైం మిగులుతుంది. ఈ సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. పార్ట్ టైం జాబ్స్ చేయొచ్చు. తద్వారా ఆత్మనిర్భరత దిశగా మీ తొలి పయనం మొదలవుతుంది. ఉద్యోగ బాధ్యతల నిర్వహణలోని సాదకబాధకాలు తెలుస్తాయి. బాధ్యతాయుత ప్రవర్తన, జవాబుదారీతనం అలవడుతాయి. ఇవన్నీ మీ కెరీర్లో చాలా ఉపయోగపడతాయి. పార్ట్ టైమ్ జాబ్ వల్ల కొంత డబ్బునూ సంపాదించుకుంటారు.
2. సంపాదించే రోజుల్లో
త్వరగా పొదుపు చేస్తే కాంపౌండింగ్ ప్రయోజనం : ప్రపంచంలో ఎనిమిదో అద్భుతం ఏదైనా ఉందంటే- అది చక్రవడ్డీ. "చక్రవడ్డీ విలువను అర్థం చేసుకునే వారు డబ్బులను త్వరగా పెంచుకోగలరు. చక్రవడ్డీ విలువను అర్థం చేసుకోని వాళ్లు జీవితాంతం దాన్ని చెల్లించడానికే పరిమితం అవుతారు" అని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ చెప్పారని అంటారు. అందుకే కెరీర్ తొలినాళ్ల నుంచే డబ్బును పొదుపు చేయడం మొదలుపెట్టాలి. వేతనంలో కొంత భాగాన్ని పొదుపు చేసి, ఇంకొంత భాగాన్ని పెట్టుబడి పెట్టాలి. చక్రవడ్డీ ప్రభావంతో కొన్నేళ్ల తర్వాత ఈ పొదుపు, పెట్టుబడి కలిసి మనకు మంచి సంపదను అందిస్తాయి. పొదుపు, పెట్టుబడులను ఏళ్ల తరబడి కొనసాగించడం వల్ల చక్రవడ్డీ కాంపౌండింగ్ అనేది జరుగుతుంది.
బంపర్ ప్రయోజనం : ఉదాహరణకు ఒక వ్యక్తి 20ఏళ్ల వయస్సులో ఉద్యోగంలో చేరాడు. అతడు తన శాలరీ నుంచి ప్రతినెలా రూ.5వేలు పెట్టుబడి పెట్టడం ప్రారంభించాడు. దానిపై అతడికి 12 శాతం వార్షిక రాబడి లభిస్తుంది. సదరు వ్యక్తికి 60ఏళ్లు వచ్చే నాటికి రూ.5.88 కోట్లు అందుతాయి. ఎవరైనా 30ఏళ్ల వయసులో పెట్టుబడి పెట్టడం ప్రారంభించి, 60ఏళ్ల నాటికి రూ.5.88 కోట్లు పొందాలనుకుంటే, ప్రతినెలా రూ.16,800 కేటాయించాల్సి ఉంటుంది. ఎవరైనా 40ఏళ్ల వయసులో పెట్టుబడి పెట్టడం ప్రారంభించి, 60ఏళ్ల నాటికి రూ.5.88 కోట్లు పొందాలనుకుంటే, ప్రతినెలా రూ. 59,500 కేటాయించాలి. అందుకే వీలైనంత చిన్న వయసులోనే పొదుపు, పెట్టుబడులను మొదలుపెట్టాలి.
సరైన బీమా పాలసీలను కొనండి : మనపై కుటుంబ సభ్యులు ఆధారపడి ఉంటారు. జీవితపు క్లిష్ట పరిస్థితుల్లోనూ వారికి ఆర్థిక స్వాతంత్య్రం లభించాలంటే మనం జీవిత బీమా పాలసీ తీసుకోవాలి. అయితే మన వ్యక్తిగత ఆర్థిక స్వాతంత్య్రం కోసం అదనంగా ఇంకొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. క్యాన్సర్, కిడ్నీఫెయిల్యూర్, గుండె జబ్బులు వంటి తీవ్ర అనారోగ్యాలు చుట్టుముట్టినా ఆర్థికంగా స్వాతంత్య్రంతో జీవించడానికి క్రిటికల్ ఇల్నెస్ బీమా పాలసీ తీసుకోవాలి. జీవిత బీమా, ఆరోగ్య బీమాలు మీకు తగినంత సాయం చేయలేనప్పుడు క్రిటికల్ ఇల్నెస్ బీమా శ్రీరామరక్షగా నిలుస్తుంది. కష్టకాలంలో మీ ఆర్థిక వనరులు ఆవిరి కాకుండా చూసుకుంటుంది. వైద్య చికిత్సకు అయ్యే భారీ ఖర్చులను తీర్చడానికి ఒక ఆరోగ్య బీమా పాలసీని సైతం తీసుకోవాలి. ఆదాయం అంతంత మాత్రంగానే ఉన్న సమయాల్లో ఈ పాలసీ కొండంత ధైర్యాన్ని అందిస్తుంది. అప్పులు చేయాల్సిన అవసరాన్ని తప్పిస్తుంది.
హోం లోన్ తీసుకొనైనా ఇల్లు కొనండి : మీరు సంపాదన దశలో ఉన్నప్పుడే ఇంటిని కొనాలి. ఇందుకోసం అవసరమైతే హోం లోన్ తీసుకోండి. దీనివల్ల మీ ఆదాయంపై పన్ను భారం తగ్గిపోతుంది. పదవీ విరమణ తర్వాత మీపై అంతగా ఆర్థిక భారం ఉండదు. మీ నెలవారీ ఇంటి వ్యయాలు తగ్గుతాయి. ఫలితంగా ఆర్థిక స్వాతంత్య్రం లభిస్తుంది. అతి తక్కువ ఆర్థిక వనరులతో జీవనాన్ని గడిపే వీలుంటుంది.
పీఎఫ్, ఎన్పీఎస్ డబ్బులను విత్‌డ్రా చేయొద్దు : ఉద్యోగాలు చేస్తున్న వారు ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) లేదా నేషనల్ పెన్షన్స్ సిస్టమ్ (ఎన్పీఎస్) డబ్బులను అస్సలు విత్‌డ్రా చేయకూడదు. జీవన్మరణ పరిస్థితులు వస్తే తప్ప ఆ డబ్బులను అస్సలు ముట్టుకోవద్దు. ఆ డబ్బులన్నీ వాడేస్తే, పదవీ విరమణ సమయానికి మీకు జీవన్మరణ పరిస్థితి వస్తుంది. మీ పిల్లల ఉన్నత విద్య కోసం కూడా పీఎఫ్, ఎన్పీఎస్ డబ్బులను తీయొద్దు. అవసరమైతే విద్యా రుణం తీసుకోండి.
3. పదవీ విరమణ దశ
వారసత్వ ప్రణాళిక: చాలా మందికి ఆస్తిపాస్తులు ఉంటాయి. ఆస్తిపరులు బతికి ఉండగానే వారసత్వ ప్రణాళికను తయారు చేస్తుంటారు. తాము చనిపోయిన తర్వాత పంపకాలు ఎలా జరిగాలి? వాటిని ఎవరెవరికి ఇవ్వాలి? అనేది నిర్ణయిస్తారు. ఈక్రమంలో ఆస్తుల పంపకాలు చట్టపరంగా కాకుండా, మన కోరిక మేరకే జరిగేలా నిబంధనలను వారసత్వ ప్రణాళికలో పొందుపర్చాలి. దీనివల్ల జీవించినన్ని రోజులు మనకు ఆత్మనిర్భరత, ఆర్థిక స్వతంత్రత లభిస్తాయి. మరణం తర్వాతే వారసత్వ ప్రణాళిక అమల్లోకి వస్తుంది.
రివర్స్ మార్టిగేజ్‌ను వాడుకోండి : మనం ఎంత నిజాయితీగా ప్రయత్నించినా, కొన్ని కారణాల వల్ల పదవీ విరమణ సమయానికి తగినన్ని ఆర్థిక వనరులు అందుబాటులో ఉండకపోవచ్చు. ఇలాంటప్పుడు బెంగ పడాల్సిన అవసరం లేదు. మీ ఇంటిని ఏదైనా మంచి బ్యాంకులో రివర్స్ మార్టిగేజ్ చేయించండి. రివర్స్ మార్టిగేజ్ చేయిస్తే మీరు 20 ఏళ్లపాటు ప్రతినెలా రూ.50వేలు చొప్పున పొందొచ్చు. ఈ వ్యవధిలో అదే ఇంట్లో ఉండొచ్చు. పైగా బ్యాంకు నుంచి పొందిన డబ్బును తిరిగి చెల్లించాలనే ఆందోళన మీకు అక్కర్లేదు.
సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోండి : ఇది డిజిటల్ యుగం. ఇప్పుడు స్మార్ట్ ఫోన్‌తో ప్రతీ ఆర్థిక వ్యవహారాన్ని కూర్చున్న చోటు నుంచే చక్కబెట్టొచ్చు. యుటిలిటీ బిల్స్ పేమెంట్, కిరాణా సామగ్రి కొనుగోలు, పండ్లు కూరగాయలకు ఆర్డర్స్ ఇవ్వడం వంటివి చేయొచ్చు. వృద్ధాప్యం కారణంగా మీరు ఇంటికే పరిమితం అయినప్పుడు ఈ టెక్నాలజీని వాడుకోండి. దీనివల్ల మీకు ఆత్మనిర్భరత లభిస్తుంది.
వ్యాయామం చేయండి : క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. మంచి పౌష్టికాహారాన్ని తీసుకోండి. ఫిట్‌గా ఉండండి. దీనివల్ల మీరు రోజువారీ పనుల కోసం ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం రాదు.
నోట్ : ఈ ఆర్టికల్‌లో తెలిపిన అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. కీలక ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.
COMMENTS