WOMEN EMPLOYEES IN SINGARENI
సింగరేణిలో పెరుగుతున్న మహిళా ఉద్యోగులు - వారికి ఆ రెండు గనుల్లో విధులు
సింగరేణిలో పెరుగుతున్న మహిళా ఉద్యోగుల సంఖ్య - 2 గనుల్లో కనీసం ఒక షిఫ్టును మహిళా ఉద్యోగునులతో నడిపించాలని సూచనలు - నిబంధనల సడలింపుతో ఎంతో మార్పు.
Women Employees Increasing in Singareni : సింగరేణిలో మహిళా ఉద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వారికి ఒక ఉపరితల (ఓసీ), మరో భూగర్భగనిలో ప్రత్యేకంగా విధులు కేటాయించాలని సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాం ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. 2 గనుల్లో కనీసం ఒక షిఫ్టును మహిళా ఉద్యోగునులతో నడిపించాలని సూచనలు చేశారు. తగిన గనులను ఎంపిక చేసే ప్రక్రియను చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా మహిళలు అధికంగా పని చేసే ప్రాంతాల్లోని ఓసీని, మరో భూగర్భగనిని ఎంపిక చేసే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు.
1,984 మంది మహిళా ఉద్యోగులు :
ఒకప్పుడు సింగరేణిలో ఉద్యోగం అంటే పురుషులే గుర్తుకొచ్చేవారు. కాలక్రమేణా ఓసీలు విస్తరిస్తుండగా, మరోవైపు యువతులు జాబ్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో మహిళల నియామకాలకు అవరోధంగా నిలిచిన నిబంధనల్ని సడలించడంతో మార్పు ప్రారంభమవుతుంది. గనుల చట్టం - 1952 ప్రకారం మహిళలు బొగ్గు గనుల్లో విధులు చేపట్టేందుకు అనర్హులని పేర్కొన్నారు.
దీంతో నేరుగా కాకుండా, కారుణ్య నియామకాల్లోనే (భర్తల్ని కోల్పోయిన మహిళలకు) అవకాశం కల్పిస్తూ వస్తున్నారు. పాత చట్టాన్ని 2017 సంవత్సరంలో సవరించారు. దీంతో సింగరేణి గనుల్లోనూ మహిళల నియామకాలకు మార్గం సులభం అయింది. గత రెండు సంవత్సరాల్లో విడుదల అయిన నోటిఫికేషన్లకు అనూహ్య స్పందన లభించింది. దీంతో ఉద్యోగుల మహిళా సంఖ్య పెరిగింది. ప్రస్తుతం మొత్తం సింగరేణివ్యాప్తంగా 1,984 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. గనులు, డిపార్ట్‌మెంట్లలో పలు రకాల విధులు నిర్వర్తిస్తున్నారు. మూణ్నెల్ల క్రితం భర్తీ చేసిన మైనింగ్ ఎలక్ట్రికల్, ఇంజినీర్, మెకానికల్ ఉద్యోగాల్లో అధికారిణులుగా బాధ్యతలు చేపట్టారు.
"ప్రస్తుతం రెస్క్యూ విభాగంలో ఆసక్తి గల మహిళా ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా 2 గనుల్లో ఒక షిఫ్టును కేటాయించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఉద్యోగినుల సంఖ్య ఇంకొంచెం పెరగాల్సి ఉంది. వీరికి నూతనంగా విధులు కేటాయించేందుకు కొత్తగూడెం ఏరియాలోని పీవీకే-5 భూగర్భగని అనుకూలంగా ఉంటుంది. ఈ దిశగా అవకాశాలను పరిశీలిస్తున్నాం." - కె.వెంకటేశ్వర్లు, డైరెక్టర్ (ప్రాజెక్టు అండ్ ప్లానింగ్, పా)
COMMENTS