BE CAREFUL FROM YOUR CELL PHONE
ఎండకు పేలిపోతున్న మొబైల్ - ఎలా జాగ్రత్త పడాలంటే?
వేసవికాలంలో మొబైల్ నుంచి మంటలు - ఎండ నుంచి మీ స్మార్ట్‌ఫోన్‌ను ఎలా సురక్షితంగా ఉంచుకోవాలంటే?
How to Keep Your Smartphone Safe from Summer Heat : హైదరాబాద్ నగరానికి చెందిన ఓ ఉద్యోగి రోజూ ఎండలోనూ డెలివరీలు ఇస్తుంటాడు. అతడి బైక్ హ్యాండిల్‌కు సెల్ ఫోన్‌ని పెట్టి అందులో లొకేషన్ చూసుకుంటూ ప్రయాణం చేస్తుండేవాడు. తరచూ బ్యాటరీ డ్రెయిన్ అవుతుండడంతో ద్విచక్రవాహనం నుంచే ఛార్జింగ్ సౌకర్యం సైతం ఏర్పాటు చేసుకున్నాడు. ఒకరోజు ఉన్నట్టుండి ఒక్కసారిగా మొబైల్ నుంచి మంటలు వచ్చాయి. వేసవికాలంలో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతుంటాయి. సెల్‌ఫోన్ ఉపయోగించడంలో చేసే లోపాలతో తీవ్ర ప్రమాదాలకు ఆస్కారం ఉందని నిపుణులు అంటున్నారు. మరి సెల్ ఫోన్ ప్రమాదాలు జరగకుండఉండాలంటే మనం చేయాలంటే?
నిపుణుల సూచనలు :
మొబైల్‌ను గతంలో కేవలం మాట్లాడటానికి మాత్రమే ఉపయోగించేవారు. ప్రస్తుతం ఏ పని కావాలన్నా మొబైల్ కావాల్సిందే. సుమారు 95 % మంది మిడ్ రేంజి ఫోన్‌లే వినియోగిస్తున్నారు. ఐఫోన్‌లు, ఇతర హైఎండ్ మొబైల్‌తో పోల్చితే వీటికి త్వరగా వేడెక్కే స్వభావం ఉంటుంది. అందుకే వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచనలు చేస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే సెల్ ఫోన్ పేలిపోకుండా నివారించవచ్చని అంటున్నారు.
ఛార్జర్ ముఖ్యం :
ఇప్పుడు చాలా సెల్ ఫోన్లకు కొన్నప్పుడు ఛార్జర్ రావడం లేదు. దీంతో మనకు దొరికిన ఛార్జర్లు తీసుకుని ఉపయోగిస్తున్నారు. ఇది బ్యాటరీ లైఫ్‌ను దెబ్బతీస్తుంది. మొబైల్‌కు సంబంధించిన కంపెనీ ఛార్జర్లనే వాడడం చాలా ఉత్తమం.
బ్యాటరీ పాడు అయితే తక్కువ ధరకు వచ్చిందని ఇతర బ్యాటరీలను వేయకూడదు. కాస్త ఖర్చు ఎక్కువైనా నాణ్యమైన, కంపెనీ బ్యాటరీలనే వాడాలి.
రాత్రంతా సెల్ ఛార్జింగ్ పెట్టకూడదు. దీనివల్ల బ్యాటరీ లైఫ్ దెబ్బతింటుంది.
ఇప్పుడు సుమారు అన్ని ఫోన్లలో బ్యాటరీ ఫుల్ అవ్వగానే ఛార్జ్ కాకుండా నిరోధించే మెకానిజం ఉంటుంది.
ఛార్జింగ్ పూర్తవగానే స్విచ్ ఆఫ్ చేయకుండా అలాగే వదిలేస్తుంటారు. ఇలా వేలాడే ఛార్జర్‌లను పిల్లలు తెలియక తాకితే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది.
వాటర్ రెసిస్టెంట్
వాటర్ రెసిస్టెంట్ మాత్రమే : ఇప్పుడు ఉన్న అన్ని ఫోన్లూ ఐపీ 68, ఐపీ 69 వాటర్ రెసిస్టెంట్‌తో వస్తున్నాయి. అంటే ప్రమాదవశాత్తూ మొబైల్ నీటిలో పడిపోతే త్వరగా తీస్తే పాడవకుండా ఉంటుంది. మొబైల్ హీట్ అయిందని నీటిలోనో, రిఫ్రిజిరేటర్‌లో పెట్టకూడదు. ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తే సర్వీస్ సెంటర్లు వారంటీ సౌకర్యం కల్పించవని అంటున్నారు.
నేరుగా సెల్ ఫోన్లపై ఎండ పడకుండా :
ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా గూగుల్ మ్యాప్స్‌నే ఆశ్రయిస్తున్నాం. ఎంతోమంది ఫోన్‌ని ద్విచక్రవాహనం పెట్రోల్ ట్యాంక్ కవర్‌లోనో, హ్యాండిల్ స్టాండ్‌కో పెట్టి డ్రైవ్ చేస్తున్నారు.
సూర్య కిరణాలు నేరుగా మొబైల్‌పై పడితే అది త్వరగా వేడెక్కుతుంది. ఇంటర్‌నెట్‌తో పాటు గూగుల్ మ్యాప్స్ వాడటం వల్ల మరింత అధికంగా వేడెక్కుతుంది.
నేరుగా మొబైల్‌పై ఎండ పడకుండా ఏర్పాట్లు చేసుకోవాలి.
పెట్రోల్ ట్యాంక్ కవర్‌లో సెల్ పెడుతుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి.
మొబైల్‌ను దిండు కింద పెట్టుకుంటున్నారా? :
ఎంతోమంది రీల్స్ చూసి అలాగే నిద్రకు పోతుంటారు. మొబైల్‌ను దిండు కింద పెడుతుంటారు. ఇది చాలా ప్రమాదకరం.
మన శరీర బరువు మొబైల్‌పై పడితే బ్యాటరీ ఒత్తిడికి గురవుతుంది. దీంతో పేలిపోయే ప్రమాదం ఉంది.
బిగుతుగా ఉండే జీన్స్ జేబులో సెల్‌ఫోన్లు పెట్టకపోవడం చాలా మంచింది.
అనవసర యాప్‌లు :
మన మొబైల్లో పదుల సంఖ్యలో యాప్స్ ఉంటాయి. అందులో మనం వాడేవి 4, 5 మాత్రమే. అవసరం లేని యాప్‌లు బ్యాటరీని అధికంగా వాడుకుంటాయి. అందుకే మొబైల్ అవసరంలేని యాప్‌లను డిసేబుల్ చేయాలి.
ఫోన్‌లోని సెట్టింగ్స్‌లోకి వెళితే అందులో యాప్ మేనేజ్‌మెంట్ ఉంటుంది. మనకు అవసరం లేని యాప్ క్లిక్ చేసి, అన్‌ఇన్‌స్టాల్ లేదా ఫోర్స్ స్టాప్ చేసుకోవాలి. తద్వారా అనవసర యాప్‌లతో ఛార్జింగ్ త్వరగా అయిపోకుండా నివారించవచ్చు.
ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిది :
మొబైల్ వేడెక్కినప్పుడు వాడకుండా కాసేపు పక్కన పెట్టాలి.
ఎండలో ఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు కేస్‌లను తీసివేయాలి.
బ్రీతబుల్ కేసులు వాడితే ఉత్తమం.
మొబైల్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి.
ఛార్జింగ్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు.
విపరీతంగా వేడిగా ఉంటే కాసేపు స్విచ్ ఆఫ్ చేయాలి.
"మొబైల్ కొన్నప్పుడు కొన్ని ఏళ్ల వరకు సాఫ్ట్‌వేర్ అప్డేట్‌లు వస్తుంటాయి. ఎప్పటికప్పుడు వాటిని అప్‌డేట్ చేసుకోవాలి. దీనివల్ల ఫోన్‌లో ఏమైనా ప్రమాదకర బగ్స్ ఉంటే పోతాయి. మొబైల్ ఓవర్ హీట్ కాకుండా ఉంటుంది. స్క్రీన్ బ్రైట్‌నెస్‌ని 'ఆటో' మోడ్‌లో పెట్టుకోవాలి. పవర్ వాడకాన్ని తగ్గించడానికి బ్యాటరీ సేవర్ మోడ్‌ను వినియోగించుకోవాలి. నేరుగా సూర్యరశ్మి పడే ప్రదేశాల్లో మొబైల్‌కు ఛార్జింగ్ చేయకూడదు. అవసరం లేకుంటే జీపీఎస్, వైఫై, మొబైల్ డేటాను ఆఫ్ చేయాలి." - సాయి సతీశ్, సాంకేతిక నిపుణుడు, సీఈవో, ఇండియన్ సర్వర్స్
COMMENTS