JOB OPPORTUNITIES AFTER ITI
టెన్త్ తర్వాత ఉజ్వల భవిష్యత్‌కు 'ఐటీఐ' కోర్సు - ఉద్యోగ, ఉపాధి అవకాశాలివే!
ఐటీఐ విద్యతో మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు - రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలో పారిశ్రామిక శిక్షణనందిస్తున్న 320 ఐటీఐలు.
Job Opportunities After ITI : నేర్చుకోవాలనే ఆసక్తి, తపన ఉంటే చాలు ఐటీఐ శిక్షణతోనూ అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చు. విదేశాల్లోనూ మంచి కొలువుల్లో రాణించవచ్చు. ఎందరికో ఉపాధి కల్పించే స్థాయిని కూడా అందుకోవచ్చు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని పలు గవర్నమెంట్ ఐటీఐలు అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ల (ఏటీసీ)గా విస్తరిస్తున్నాయి. వీటిలో శిక్షణ పొందినవిద్యార్థులు క్యాంపస్ రిక్రూట్మెంట్లలో మెరుస్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ 800కు పైగా విద్యా సంస్థలు సుమారు 50 ట్రేడుల్లో తర్ఫీదు అందిస్తున్నాయి.
తక్కువ వ్యవధిలోనే ఏదైనా అంశంలో స్కిల్స్‌ను పెంపొందించుకుని, వెంటనే అందులో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందడానికి ఐటీఐ దారిచూపుతుంది. ఈ కోర్సులు పూర్తిచేసుకున్నవారికి ఉపాధి విషయంలో ఎలాంటి ఢోకా లేదు. భారత్‌లో తయారీ (మేక్ ఇన్ ఇండియా)కి ప్రోత్సాహం, స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏర్పాటుతో ఐటీఐ ట్రేడుల్లో పట్టున్నవారికి గిరాకీ క్రమంగా పెరిగింది.
కోర్సు వివరాలు : ఐటీఐ కోర్సులో పదోతరగతి అర్హతతో ఏడాది, 2 ఏళ్ల వ్యవధితో పలు ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ ట్రేడుల్లో కోర్సులను అందిస్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ సుమారు 50 స్పెషలైజేషన్లలో ఐటీఐలు పలు కోర్సులను అందిస్తున్నాయి. ఆధునిక అవసరాలకు అనుగుణంగా డ్రోన్ టెక్నీషియన్ లాంటి కోర్సుల్లోనూ కొన్ని చోట్ల ట్రైనింగ్‌ను అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 519, తెలంగాణలో 320 ఏటీసీ/ఐటీఐలు ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. వీటిలో విడిగా గర్ల్స్‌కు, బాలురు, మైనారిటీల కోసమూ కొన్ని ఉన్నాయి.
ఐటీఐలో చేరేందుకు ఎలాంటి పరీక్షా రాయనవసరం లేదు. పదో తరగతిలో సాధించిన గ్రేడ్ పాయింట్లు/మార్కులతో సీట్లు కేటాయిస్తారు. గవర్నమెంట్ ఐటీఐల్లో దాదాపు ఉచితంగానే చదువుకోవచ్చు. ప్రైవేటు ఐటీఐల్లో ట్రేడు బట్టి రూ.12,000 నుంచి రూ.17,000 వరకు ఫీజు చెల్లించాలి
ఏఏ ట్రేడుల్లో :
రెండేళ్ల కోర్సు వ్యవధితో : డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్/ మెకానికల్), అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్ ప్లాంట్), ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనన్స్, ఇన్స్ట్ర్టుమెంట్ మెకానిక్ (కెమికల్ ప్లాంట్), ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్, మెషినిస్ట్ (గ్రైండర్), మెరైన్ ఫిట్టర్, మెకానిక్ (మోటార్ వెహికల్/ రెఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్), మెకానిక్ మెషీన్ టూల్ మెయింటెనన్స్, టర్నర్, పెయింటర్ జనరల్, వెసెల్ నేవిగేటర్, వైర్‌మెన్.
ఏడాది వ్యవధితో: కార్పెంటర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, డ్రెస్ మేకింగ్, ఫౌండ్రీమెన్, మాసన్ (బిల్డింగ్ కన్స్ట్రక్టర్), ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్, ప్లంబర్, వెల్డర్, సెక్రటేరియల్ ప్రాక్టీస్ (ఇంగ్లిష్), సూయింగ్ టెక్నాలజీ, షీట్ మెటల్ వర్కర్, స్టెనోగ్రాఫర్ అండ్ సెక్రటేరియల్ అసిస్టెంట్ (ఇంగ్లిష్), మెకానిక్ (డీజిల్/ఆటో బాడీ పెయింటింగ్/ ఆటో బాడీ రిపేర్) ఇలా పలు ట్రేడులు వివిధ ఐటీఐల్లో అందుబాటులో ఉన్నాయి.
ఉన్నత విద్యలో అవకాశాలు :
ఐటీఐ తర్వాత డిప్లొమాలో చేరొచ్చు.
డిప్లొమో అనంతరం ఈసెట్‌తో నేరుగా బీటెక్ రెండో ఏడాదిలో చేరొచ్చు.
ఐటీఐ పూర్తి చేశాక ఎన్ఎస్టీఐలో ట్రైనింగ్ పొంది ఇన్స్ట్రక్టర్లుగా రాణించవచ్చు.
స్వల్పకాలిక విధానంలో అడ్వాన్స్డ్ ఒకేషనల్ ట్రైనింగ్ కోర్సులూ ఉన్నాయి.
ఐటీఐతో ఉద్యోగ అవకాశాలు :
స్టీల్ ప్లాంట్లు, నేవల్ డాక్‌యార్డులు, నౌకాయాన సంస్థలు, పోర్టులు, షిప్పులు, ప్రజా రవాణా సంస్థలు(ఆర్టీసీ), రైల్వేశాఖలో అసిస్టెంట్ లోకోపైలట్ ఉద్యోగం సాధించవచ్చు. భద్రతా బలగాల్లో కూడా అవకాశాలను పొందవచ్చు. యంత్రాలతో నడిచే అన్ని రకాల పరిశ్రమల్లోనూ ఐటీఐ చదివినవారికి ఉద్యోగాలున్నాయి. మహారత్న, నవరత్న, మినీరత్న, పబ్లిక్ సెక్టార్ కంపెనీల్లో(పీఎస్‌యూలు) పలు కొలువులకు వీరే అర్హులు. సాంకేతిక (టెక్నికల్) పోస్టుల్లో సింహభాగం సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ చదువుకున్న వారితోనే భర్తీ చేస్తున్నారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్), ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఏపీ లిమిటెడ్ (ఓమ్‌క్యాప్), స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లు విదేశీ కొలువులకు దారి చూపుతున్నాయి. ఇవి ట్రైనింగ్‌ను అందించి, ధ్రువపత్రాలను కూడా ప్రదానం చేస్తున్నాయి.
COMMENTS