NO PANCHAYAT ELECTIONS IN VILLAGE
ఆ గ్రామంలో 1947 నుంచి నో ఓటింగ్- ఎప్పుడూ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమే- ఎక్కడో తెలుసా?
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఆ గ్రామంలో ఓటింగ్ జరగలేదు- ఎందుకంటే?
No Panchayat Elections In Village : సర్పంచ్ ఎన్నికలు అంటే గ్రామాల్లో హడావుడి ఆషామాషీగా ఉండదు. అన్నపై తమ్ముడు, తమ్ముడిపై అన్న పోటీకి దిగుతుండడం చూస్తుంటాం. సొంతం కుటుంబంలోని ఇద్దరు సర్పంచ్ పదవి కోసం పోటీపడి ఘర్షణ పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే గుజరాత్‌లోని ఓ గ్రామంలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు పంచాయతీ ఎన్నికలు జరగలేదు. ఎప్పుడూ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమే. మరెందుకు ఆలస్యం ఆ గ్రామం ఎక్కడుంది? 78 ఏళ్లుగా ఎన్నికలు ఎందుకు జరగడం లేదు? వంటి విషయాలు తెలుసుకుందాం.
సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమే!
గుజరాత్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఇటీవలే ఎన్నికల కమిషన్ నగారా మోగించింది. ఈ క్రమంలో జునాగఢ్ జిల్లాలోని 250కి పైగా పంచాయతీల్లో మరికొద్ది రోజుల్లో ఓటింగ్ జరగనుంది. అయితే వంథలి తాలూకాలోని సెల్రా గ్రామంలో మాత్రం ఓటింగ్ జరగదు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు అక్కడ పంచాయితీ ఎన్నికలు జరగలేదు. ఈసారి కూడా గ్రామస్థులందరూ కలిసి ఏకగ్రీవంగా సర్పంచ్‌ను ఎన్నుకునేందుకు సిద్ధమవుతున్నారు.
అభివృద్ధిలోనూ దూసుకెళ్తున్న గ్రామం
500 జనాభా ఉన్న సెల్రా గ్రామంలో ఊరు జనమంతా ఏకమై మంచి వ్యక్తిని సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. అందుకే అక్కడ 1947 నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగట్లేదు. ఏకగ్రీవంగా సర్పంచ్‌ను ఎన్నుకున్నా సెల్రా గ్రామం అభివృద్ధిలో దూసుకెళ్తోంది. 1-5వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాల ఉంది. అలాగే మంచి సిమెంట్ రోడ్లు, ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించే స్వతంత్ర వ్యవస్థ, రోజుకు రెండుసార్లు గ్రామాన్ని శుభ్రం చేయడం, రోడ్లపై సీసీటీవీ కెమెరాలు సహా పలు సౌకర్యాలు గ్రామస్థులకు అందుబాటులో ఉన్నాయి.
గ్రామం అభివృద్ధి పథంలో నడుస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం సెల్రా గ్రామానికి ఏటా అదనంగా రూ. 8.5లక్షల గ్రాంట్‌ను కూడా కేటాయిస్తోంది. అయితే రోడ్లు, తాగునీరు విషయంలో గ్రామస్థులు కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలను పరిష్కరించేందుకు గ్రామ సర్పంచ్ సైతం కష్టపడుతున్నారు.
రెండు గంటల్లో ఇంటి పన్ను కట్టేస్తారు!
500 జనాభా ఉన్న సెల్రా గ్రామం పన్ను చెల్లించడంలో జునాగఢ్ జిల్లాలోని ఇతర గ్రామాల కంటే ముందుంది. ఏటా జనవరి 14న గ్రామస్థులందరూ కేవలం రెండు గంటల్లోనే గ్రామ పన్ను చెల్లించేస్తారు. పన్నులు చెల్లించడంలో కూడా గ్రామ ప్రజలు తేదీ, సమయాన్ని చాలా కచ్చితంగా పాటిస్తారు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో మహిళను సర్పంచ్‌గా చేయాలని గ్రామస్థులు భావిస్తున్నారు. ఇప్పటివరకు సెల్రా గ్రామ చరిత్రలో ఒక మహిళ మాత్రమే సర్పంచ్‌గా పనిచేశారు.
COMMENTS