TGSRTC CONDUCTOR NOTIFICATION 2025
ఆర్టీసీలో కండక్టర్, డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - ఈసారి ఔట్సోర్సింగ్ విధానంలో.
కండక్టర్ పోస్టులను ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన ఆర్టీసీ - వరంగల్, కరీంనగర్, ఖమ్మం రీజియన్లలో కండక్టర్లు, డ్రైవర్ల పోస్టులకు ప్రకటన.
TGSRTC Conductor Notification 2025 : ఆర్టీసీ యాజమాన్యం తొలిసారిగా కండక్టర్ పోస్టులను ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీచేసింది. డ్రైవర్, కండక్టర్ పోస్టులకు అవసరమైన అర్హతలను కూడా నోటిఫికేషన్లో తెలియజేసింది. వరంగల్, కరీంనగర్, ఖమ్మం రీజియన్లలోని అన్ని డిపోల్లో ఔట్ సోర్సింగ్ పద్దతిలో కండక్టర్లు, డ్రైవర్ పోస్టుల కోసం ఆర్టీసీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులను మెస్సర్స్ అక్షయ ఎంటర్ ప్రైజస్ సంస్థకు ఔట్ సోర్సింగ్‌కు ఇచ్చినట్లు ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. ఔత్సాహకులు 8142463831, 9885339228 నంబర్లకు సంప్రదించాలని కోరింది.
కండక్టర్ ఉద్యోగాలకు అర్హతలు ఇవే :
కండక్టర్ ఉద్యోగం కోసం ధరఖాస్తు చేయాలనుకునేవారు కచ్చితంగా ఎస్సెస్సీ(పదో తరగతి) పాస్ అయి ఉండాలి. దరఖాస్తు సమయంలో ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్, ఎస్సెస్సీ మెమోను జతచేయాల్సి ఉంటుంది. కండక్టర్ పోస్టులకు రూ.18,000ల జీతం చెల్లించనున్నట్లుగా యాజమాన్యం వెల్లడించింది. డ్రైవర్ కోసం హెవీ లైసెన్స్ తో పాటు ట్రాన్స్ పోర్ట్ బ్యాడ్జ్ నంబర్‌తో పాటు కనీసం 18 నెలల అనుభవం ఉండాలని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునేవారు ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్, ఎస్సెస్సీ మెమో, డ్రైవర్ కోసం హెవీ లైసెన్స్‌తో పాటు ట్రాన్స్పోర్ట్ బ్యాడ్జ్ నంబర్, అనుభవం తదితర వాటిని, ఆర్టీఏ క్లియరెన్స్ లెటర్స్‌ను జతచేయాల్సి ఉంటుంది. డ్రైవర్ల కోసం రూ.22,500లతో పాటు ప్రతి రోజూ రూ.100 బత్త కూడా అందజేయనున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది.
తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆర్టీసీ కార్మిక సంఘాలు :
మరోపక్క ఔట్ సోర్సింగ్ విధానంలో కండక్టర్, డ్రైవర్ పోస్టులను నోటిఫికేషన్ వేయాడాన్ని ఆర్టీసీ కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. టీఎంయూ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి, ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డిలు ఔట్ సోర్సింగ్ విధానాన్ని వ్యతికేకిస్తున్నామన్నారు. ఆర్టీసీ యాజమాన్యం మరోసారి ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు.
COMMENTS