AGRICULTURAL ELECTRICITY CONNECTION
రైతులకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆన్లైన్లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు.
వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లలో వేగం పెంచిన విద్యుత్ శాఖ - ఎన్‌పీడీసీఎల్ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచన - యాప్‌లో దరఖాస్తు స్థితిగతులు చూసుకోవచ్చు.
Speed in Agricultural Electricity Connection With TGNPDCL App : విద్యుత్తు శాఖ కొత్త సాంకేతికతను జోడిస్తూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తోంది. తాజాగా వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లలో వేగం పెంచింది. దళారులు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా తన దరఖాస్తు స్థితిగతులను దరఖాస్తుదారుడే స్వయంగా తెలుసుకునేలా ఆన్‌లైన్ విధానాన్ని తీసుకువచ్చింది. ఇందుకోసం ఎన్‌పీడీసీఎల్ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచనలు చేస్తోంది. ప్రస్తుతం విద్యుత్ శాఖ నూతన సాంకేతికతతో అన్నదాతలకు వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లను త్వరగా మంజూరు చేస్తోంది.
1912 నంబరుకు ఫిర్యాదు చేయండి :
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం రైతు మీ-సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి. వెంటనే దరఖాస్తుదారుడి సెల్‌ఫోన్‌కు సమాచారం అందుతుంది. దీని తరువాత టీజీఎన్‌పీడీసీఎల్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి. దానిని ఓపెన్ చేసి అందులో ఎల్‌టీ న్యూ సర్వీస్ కనెక్షన్ విభాగంలో అగ్రికల్చర్ అనే ఐచ్ఛికాన్ని ఎంచుకోవాలి. మీ-సేవ ద్వారా సెల్‌ఫోన్‌కు వచ్చిన నంబరును యాప్‌లో నమోదు చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా కనెక్షన్ వివరాలు ఫోన్లో కనిపిస్తాయి.
కనెక్షన్ మంజూరు అయితే ఆ సమాచారం ఫోన్లోని యాప్‌లో కనిపిస్తుంది. అందులో మన కనెక్షన్‌కు అవసరమైన విద్యుత్తు స్తంభాలు, నియంత్రిక, ఇతర సామగ్రి వివరాలను పేర్కొంటారు. ప్రభుత్వం అన్నదాతకు ఒక కనెక్షన్‌కు రూ.75,000 రాయితీ ఇస్తుంది. దానికంటే ఎక్కవగా డబ్బులు ఖర్చు అయినట్లయితే ఆ డబ్బులను దరఖాస్తుదారుడే భరించాలి. ఆ డబ్బులను ముప్పై రోజుల్లో చెల్లించాలి. దాని తరువాత వ్యవసాయ క్షేత్రానికి అవసరం అయిన సామగ్రి పంపిస్తారు. యాప్‌లో పేర్కొన్న సామగ్రి వచ్చిందో రాలేదో దరఖాస్తుదారుడు సరిచూసుకునే అవకాశం ఉంది. తక్కువ సామగ్రి వచ్చినట్లయితే ప్రశ్నించవచ్చు. సకాలంలో కనెక్షన్ మంజూరు చేయకుంటే 1912 నంబరుకు ఫిర్యాదు చేయవచ్చు.
దరఖాస్తు స్థితిగతులు తెలుస్తున్నాయి :
వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్ల మంజూరు కోసం అన్నదాతలు సంవత్సరాలుగా నిరీక్షించేవారు. గడిచిన రెండు సంవత్సరాల నుంచి వేగం పెంచారు. వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేశారు. మొన్నటి వరకు అధికారులు సాంకేతికత ఉపయోగించుకునేవారు. ఈ-స్టోర్ విధానం ద్వారా స్టోర్‌లోని మెటీరియల్‌ను విత్‌డ్రా చేసేవారు. ప్రస్తుతం దరఖాస్తుదారుడికి కూడా తన దరఖాస్తు స్థితిగతులు తెలుస్తున్నాయి. అధికారులు ఎలాంటి సామగ్రిని ఎంచుకున్నారు. అదే సామగ్రి క్షేత్రస్థాయికి వచ్చిందా లేదా అనే విషయాలు కూడా తెలుస్తాయి. దీంతో పని పారదర్శకంగా పూర్తి అవుతుంది.
COMMENTS