IMPORTANCE OF LIFE SKILLS
సెలవుల్లో పిల్లలకు ఈ జీవన నైపుణ్యాలు నేర్పించండి! - అన్నింట్లోనూ వారే ముందుంటారు.
పిల్లలను బావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలంటే జీవననైపుణ్యాలు అత్యావశ్యకం - చిన్నారులకు లైఫ్ స్కిల్స్ నేర్పించడంలో తల్లిదండ్రులదే ముఖ్యపాత్ర
Importance Of Life Skills in Daily Life : బంగారు తల్లీ కొన్ని మంచి నీళ్లు తీసుకురామ్మా అని అన్నం తింటున్న తల్లి మూడుసార్లు పిలిచినప్పటికీ పదో తరగతి పూర్తి చేసిన ఆ కుమార్తె పలకలేదు. దీంతో బాధపడిన తల్లి చివరకు గట్టిగా మందలించడంతో ఏంటమ్మా సెలవుల్లోనైనా నన్ను ప్రశాంతంగా ఉండనీయవు అంటూ చేతిలోని సెల్‌ఫోన్ పక్కన పడేసి వెళ్లిపోయింది. కానీ తల్లికి నీళ్లుమాత్రం ఇవ్వలేదు.
ఇంట్లో మొక్కలకు నీరు పోయమని ఇంటర్మీడియట్ చదువుతున్న కొడుకును తండ్రి చెప్పారు. ఆ మాట చెవిన పెట్టని కుమారుడిపై తండ్రి గట్టిగా అరవడంతో ఫోన్‌లో లీనమైన అతడు ఇంట్లో ఉంటే ఇలాగే ఏదో ఒక పని చెప్తారంటూ చిరాకుపడుతూ విసుగ్గా ద్విచక్రవాహనంపై ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు.
సెలవులు జీవన నైపుణ్యాలకు నెలవులు :
ఇదీ పది, ఇంటర్ ఎగ్జామ్స్ రాసి సెలవుల్లో ఉన్న కొంతమంది పిల్లల వ్యవహార శైలి. పిల్లల ప్రవర్తనతో తల్లిదండ్రుల హృదయం ఆవేదన చెందుతోంది. చదువుతున్నారని ఇన్నాళ్లు వారికి ఏ పని చెప్పకుండా వదిలేస్తే మొదటికే మోసం వచ్చిందని వాపోతున్నారు. పుట్టినప్పటి నుంచీ మాటలు నేర్వడంతోపాటు నడక, ప్రవర్తన తల్లిదండ్రుల నుంచి అలవడినట్లే జీవన నైపుణ్యాలు(లైఫ్ స్కిల్స్‌ను) కూడా అలవాటు చేసుకోవాలి.
ఇంటికి దూరంగా :
పదో తరగతి, ఇంటర్ పూర్తయిందంటే పై చదువుల కోసం ఇంటికి దూరంగా వెళ్లాల్సి వస్తోంది. ఇంట్లో మాదిరిగా అక్కడ కూర్చున్న చోటుకే అన్నీ తెచ్చిపెట్టే అమ్మా నాన్నలు ఉండరు. ఏ అవసరమైనా ఏదైనా వారే చూసుకోవాల్సి ఉంటుంది. కనీస పనులు చేయలేక బద్దకించేటువంటి విద్యార్థులు కొందరు హాస్టళ్లలో ఉండి చదవలేక మారాం చేస్తుంటారు. బలవంతంగా చదివించినట్లయితే అనవసర ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటుతో ఇతర సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది.
పుస్తకంలో చేర్చినవే :
ఈ కృత్యాలను 3-5వ క్లాస్‌ల విద్యార్థులకు నిర్ధేశించిన పని పాఠ్య పుస్తకాల్లో చేర్చినవే. ఎక్కడా వాటిని బోధించినటువంటి సందర్భం కనిపించదు. ఇళ్లల్లోనూ పాటించినటువంటి దాఖలాలు లేవనే చెప్పాలి. ఐదో తరగతి స్థాయిలో నేర్చుకోవాల్సిన జీవన నైపుణ్యాలు(లైఫ్ స్కిల్స్) డిగ్రీ వచ్చినప్పటికీ అలవడటం లేదు.
ఇవి అలవడుతాయి
లైఫ్ స్కిల్స్‌తో బాధ్యత, సాయపడే గుణం, ఆత్మవిశ్వాసం, సంఘటిత శక్తి విలువ, విచక్షణా జ్ఞానం(కామన్ సెన్స్) వంటివి అలవడతాయి.
సహజసిద్ధంగా, అనుకరణలో నేర్చుకోవాల్సిన స్కిల్స్
కిచెన్ రూం : కూరగాయలు శుభ్రపరచడం, కట్ చేయడం, వండటం, వంటింటి గట్టు తుడవడం, పాత్రలను శుభ్రపర్చడం, భోజనం వడ్డించడం లాంటివి.
నిద్రించే గది : నిద్ర మేల్కోగానే బెడ్‌షీట్లు మడతపెట్టడం, బెడ్ సర్దడంతో పాటు అల్మారాలో దుస్తులు ఓ క్రమపద్ధతిలో అమర్చడం, లైట్లు, ఫ్యాన్లను తుడవడం లాంటి పనులు.
హాలు : టీవీ, ఇతర అలంకరణ సామగ్రిని క్లీన్‌గా తుడవడం, బుక్స్‌ను ఓ క్రమపద్ధతిలో పెట్టడం, సోఫా కవర్లు, కుర్చీలను సర్దడం లాంటి పనులు.
బాత్‌రూమ్ : టూత్ బ్రష్‌లు, సబ్బులు, పేస్ట్ లాంటివి సరైన స్థలంలో పెట్టడం, బాత్‌రూమ్‌లు, శౌచాలయం కడగటం.
పరిసరాల శుభ్రంగా ఉంచడం : బూజు దులపడం, మొక్కలకు నీరు పోయడం, దోమలు ఇతర కీటకాలు ఆశ్రయం పొందకుండా చెత్త, మురుగు నీటిని తొలగించడం.
మార్కెట్ : ఇంటికి కావాల్సినటువంటి సరకులు, కూరగాయలను తీసుకురావడం, ధరలు, నాణ్యత విషయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు.
సంస్కారం : ఇంటికి వచ్చినటువంటి వారిని ఆదరించడం, వారిని పలకరించడం లాంటి పనులు.
COMMENTS