SELF HELP GROUPS WITH GIRLS
ఇక బాలికలకూ డ్వాక్రా సంఘాలు! - వీటిలో చేరడం వల్ల ప్రయోజనాలివే.
15-18 ఏళ్ల బాలికలతో స్వయం సహాయక సంఘాల ఏర్పాటుకు కసరత్తు - ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాగానే కార్యాచరణ.
Self Help Groups With Girls : పొదుపు చేస్తే భవిష్యత్తుకు ఎంతో మేలు. ప్రస్తుతం మహిళా స్వయం సహాయక సంఘాలు(ఎస్‌హెచ్‌జీలు) సర్కారు అందించే చేయూత ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాయి. అలాగే బాలికలకూ పొదుపు సంఘాలుంటే బాగుంటుందని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కొత్తగా పలు జిల్లాల్లోనూ ఏర్పాటు కానున్నాయి. ఐకేపీలో మహిళా స్వయం సహాయక సంఘాలు కొనసాగుతున్నాయి. ఈ గ్రూపుల్లో 18- 60 ఏళ్ల వయసుగల వారు సభ్యులుగా ఉంటున్నారు. అలాగే 60 ఏళ్లు దాటిన వారితో వృద్ధ సంఘాలనూ ఏర్పాటు చేస్తున్నారు.
సర్కారు నిర్ణయంతో 15-18 సంవత్సరాల వయసున్నటువంటి కిషోర బాలికలతోనూ సంఘాలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లాల్లో ఎన్ని సంఘాలు ఏర్పాటు చేస్తారు అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
అధికారుల భాగస్వామ్యంతో :
జిల్లాల్లో మహిళా స్వయం సహాయక సంఘాలు(ఎస్‌హెచ్‌జీ) ప్రభుత్వం అందించే చేయూతతో ఆర్ధికంగా బలపడుతున్నాయి. లోన్లు తీసుకున్న వారు వివిధ రకాల వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. వాటి ద్వారా వచ్చిన లాభంతో ముందడుగు వేస్తున్నారు. వారి పిల్లలను కూడా చక్కగా చదివిస్తున్నారు. మరిక కొంతమంది విదేశాలకు పంపుతున్నారు. కిషోర బాలికల సంఘాలను జిల్లా గ్రామీణాభివృద్ధి, జిల్లా సంక్షేమ శాఖలకు సంబంధించిన అధికారుల భాగస్వామ్యంతో చేపట్టనున్నారు. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాగానే కార్యాచరణను రూపొందించనున్నారు. మహిళల స్వయం సంఘాల మాదిరిగానే కిషోర బాలికలూ పొదుపుతో భవితను తీర్చిదిద్దుకోనున్నారు.
పొదుపుపై కిషోర బాలికలకు అవగాహన కల్పిస్తారు :
కిషోర బాలికలకు ఆయా వయసులో వచ్చేటువంటి వివిధ సమస్యల గురించి అవగాహన కల్పిస్తారు. వారికి వచ్చేటువంటి సందేహాలను నివృత్తి చేస్తారు. పొదుపు పట్ల కిషోర బాలికలకు అవగాహన పెంచుతారు. భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా సూచనలిస్తారు. ముఖ్యంగా బాలికల రక్షణ విషయంలో తీసుకోవాల్సినటువంటి అన్ని అంశాలపై చైతన్యం తెస్తారు. ఉన్నత చదువులు, కెరీర్‌లో ఎదగటం లాంటి విషయాలపై అవగాహన పెంచుతారు. 15 ఏళ్లు దాటిన బాలికలు అప్పుడే కాలేజీ స్థాయికి వెళుతుంటారు. పాఠశాల స్థాయి దాటి బయటకు వచ్చే స్థాయిలోనే ఇలాంటి కిశోర బాలికల సంఘాలను ఏర్పాటు చేసి వారికి వివిధ అంశాలపై అవగాహన పెంచడం ఎంతో మేలు చేస్తుంది. ఏది మంచో ఏదో చెడో అనే విషయం తెలుస్తుంది. సర్కారు నుంచి మార్గదర్శకాలు రాగానే కిషోర బాలికల సంఘాల ఏర్పాటు ప్రారంభిస్తామని డీఆర్డీవో శ్రీనివాస్‌రావు తెలిపారు.
COMMENTS