If you do this, the bones will break into pieces! It's hard to stick!!
ఇలా చేస్తే ఎముకలు ముక్కలుగా విరిగిపోతాయట! అతుక్కోవడం కష్టమేనట!! మరి బోన్స్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఏం చేయాలి?
What is Good for Healthy Bones: మన శరీరం శక్తిమంతంగా ఉండి.. పనులు సరిగ్గా చేసుకోవాలంటే ఎముకలు ఆరోగ్యంగా ఉండాలి. ఇవి ఆరోగ్యంగా లేకపోతే జీవితమే ఆగిపోయినట్లుగా ఉంటుంది. అయితే, వయసు పెరిగిన కొద్ది.. ఎముకలు బలహీన పడి పలు రకాల అనారోగ్యాలు వస్తుంటాయి. అనారోగ్యకరమైన ఆహారం, అలవాట్లు చిన్న వయసు వారీలో కూడా ఎముకల సమస్యను తెచ్చిపెడతాయి. ఈ నేపథ్యంలోనే ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే ఉప్పును మితంగా తీసుకోవాలని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కే. సాకేత్ అంటున్నారు. ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల శరీరం నుంచి కాల్షియం బయటకు పోతుందని.. ఇది ఎముకలకు మంచిది కాదని వివరించారు. ఉప్పును పూర్తిగా తగ్గించాల్సిన అవసరం లేదని.. కానీ రోజుకు 2300 మి. గ్రా సోడియంకు మించి తీసుకోకూడదని పేర్కొన్నారు. ఇంకా ఎక్కువ సేపు కదలకుండా కూర్చోవడం వల్ల కూడా ఎముకలకు హానీ కలుగుతుందని చెబుతున్నారు. ఎముకలు బలంగా ఉండాలంటే మంచి ఆరోగ్యంతో పాటు వ్యాయామం చాలా అవసరమని అంటున్నారు. ఎముకల పరిమాణం, సాంద్రతను తగ్గించే ఆస్టియో పోరోసిస్ వ్యాధులు ఉన్నవాళ్లు తప్పనిసరిగా వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. ఎక్కువ సేపు కూర్చుని ఉద్యోగం చేసేవారికి వ్యాయామం మరింత ముఖ్యమని అంటున్నారు. నడక, రన్నింగ్ ఎముకలకు మరింత మేలు చేస్తాయని వివరించారు.
క్యాల్షియం అధికంగా ఉండే పదార్థాలు:
- విటమిన్ డీ
- పాలు
- గుడ్లు
- చేపలు
- ఎండు ద్రాక్షలు
- సోయా బీన్
"ప్రతి రోజు సుమారు గంటపాటు వ్యాయామాలు చేయాలి. యోగా, ఎయిరోబిక్స్, స్విమ్మింగ్, జాగింగ్, రన్నింగ్, స్కిప్పింగ్, బ్రిస్క్ వాకింగ్ లాంటి వ్యాయమాలు క్రమం తప్పకుండా చేయాలి. ఇలా చేయడం వల్ల ఎముకలు బలంగా మారతాయి. కాల్షియం, విటమిన్ డీ లోపం వల్ల మణికట్టు, తుంటి పై భాగం, వెన్నుపూసలో ఎముకలు కుంగిపోయి ఎలాంటి దెబ్బ తగలకుండానే ఎముకలు విరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా కొందరిలో చిన్న దెబ్బలకే ఎముకలు పూర్తిగా విరిగిపోతాయి. కాబట్టి కాల్షియం, విటమిన్ డీ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. వైద్యుల సలహా మేరకు కాల్షియం, విటమిన్ డీ సప్లిమెంట్ తీసుకోవాలి."
-డాక్టర్ సాకేత్, ఆర్థోపెడిక్ సర్జన్.
ఎముకలు బలంగా ఉండాలంటే శరీరానికి ఎండ తగలాలని నిపుణులు అంటున్నారు. ఎక్కువ సమయం నీడలో ఉండేవారికి ఎముకల బలహీనత ఏర్పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. రోజుకు 15 నిమిషాల పాటు ఎండలో ఉండాలని సూచిస్తున్నారు. ఎముకలు బలంగా ఉండాలంటే మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలని సలహా ఇస్తున్నారు. వీటిని ఎక్కువగా తీసుకుంటే ఎముకలు కాల్షియంను శోషించుకోలేక.. త్వరగా బలహీన పడతాయని అంటున్నారు. ఫలితంగా ఎముకలు విరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వివరించారు. ఒకవేళ ఎముక విరిగితే అవి అతుక్కోవడం కూడా కష్టంగా ఉంటుందని తెలిపారు. సిగరెట్ మానేయడం వల్ల ఎముకలకు జరిగే నష్టం తగ్గుతుందని వివరించారు. ఇంకా దీర్ఘకాలం పాటు వాడే కొన్ని రకాల మందులు సైతం ఎముకలకు హానీ చేస్తాయని అంటున్నారు. కొన్ని రకాల శీతల పానీయాలు, కాఫీ, టీ సైతం ఎముకలను బలహీన పరుస్తాయని వివరించారు.
బరువు తక్కువగా ఉన్నవారు.. తమకు కాల్షియం లోపం ఉన్న విషయాన్ని వైద్యుల ద్వారా నిర్ధరించుకోవాలని అంటున్నారు. పెద్ద వయసులో విరిగిన ఎముకలు అతుక్కోవడం చాలా కష్టమని.. ఎముకల బలహీనంగా ఉంటే ఇది మరింత కష్టం అవుతుందని చెబుతున్నారు. కాబట్టి వయసు మళ్లిన వారు ఎముకల ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
COMMENTS