Are you hiding gold in a bank locker? But the RBI rules are the same
బ్యాంక్ లాకర్‌లో బంగారం దాచిపెడుతున్నారా? అయితే ఆర్బీఐ రూల్స్ ఇవే.
బ్యాంక్లో దాచిపెట్టిన బంగారం, డబ్బులు పోతే ఏం చేయాలి? బ్యాంక్లు తిరిగి మన సొమ్ము మనకు ఇస్తాయా? ఆర్బీఐ రూల్స్ తెలుసుకోండి.
Bank Locker Rules And Regulations : ఏదైనా బ్యాంకులో దొంగతనం, అగ్నిప్రమాదం జరిగి ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారం, అలాగే లాకర్‌లో దాచి పెట్టుకున్న బంగారం, నగదును నష్టపోతుంటారు. మరి బ్యాంకులు వేటికి బాధ్యత వహిస్తాయి? లాకర్‌లో ఉన్న వస్తువులు పోతే పరిహారం అందిస్తాయా? ఈ విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆర్‌బీఐ నిబంధనలు ప్రకారం : ఏదైనా బ్యాంకులో దొంగతనం, అగ్నిప్రమాదం జరిగి ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారానికి నష్టం జరిగితే బ్యాంకు ఇచ్చే పత్రాల ద్వారా (అప్రైజర్ విలువ కట్టిన పత్రాలు) వంద శాతం బీమా సౌకర్యం అందుతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ధర ప్రకారం వాటికి బ్యాంక్లు పరిహారాన్ని చెల్లిస్తాయి.
ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక బ్యాంక్లో 40 గ్రాముల బంగారంపై రూ.2 లక్షల అప్పు తీసుకున్నారు. సదరు బ్యాంకులో దొంగతనం జరిగి ఆ వ్యక్తి పెట్టిన 40 గ్రాములు దొంగతనానికి గురైందనుకుంటే అతడి వద్ద ఉన్న పత్రాల ఆధారంగా 40 గ్రాముల బంగారానికి సంబంధించిన మొత్తం బ్యాంకు ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం చెల్లిస్తుంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రతి శాఖకు సంవత్సరానికోసారి బీమా సౌకర్యం చేయిస్తారు. అది బ్యాంకు ఆ సంవత్సరంలో జరిపిన రుణ లావాదేవీలతో పాటు నగదుపై ఆధారపడి ఉంటుంది. ఈ నిబంధనల ప్రకారం ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారానికి ఎలాంటి ఢోకా ఉండదని బ్యాంకర్లు చెబుతున్నారు.
వ్యక్తిగత లాకర్లలోని సొమ్ముకు ఖాతాదారులదే బాధ్యత : వ్యక్తిగత లాకర్లలో పెట్టే విలువైన నగలు, పత్రాలు, నగదు విషయంలో ప్రమాదాన్ని మాత్రం ఖాతాదారులే భరించాలి. లాకర్లలో ఖాతాదారులు ఏం పెడుతున్నారనేది బ్యాంకు అధికారులు చూడరు. ఏదైనా ప్రమాదం జరిగి లాకర్లలో ఉన్న విలువైన నగదు, నగలు నష్టపోతే దానికి బ్యాంకు బాధ్యత వహించదు. వ్యక్తిగత లాకర్లలో పెద్ద మొత్తంలో నగదు, నగలు పెట్టకపోవడమే మంచిది. ఏదైనా ప్రమాదం జరిగితే మనం బాధ్యత వహించాలి తప్పితే బ్యాంకులకు సంబంధం ఉండదని ఎస్‌బీఐ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
ఎస్‌బీఐ బ్యాంకులో చోరీ : ఇటీవలే వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని ఎస్‌బీఐ బ్యాంకులో సోమవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. నలుగైదుగురు దొంగలు అర్ధరాత్రి వచ్చి బ్యాంకు లాకరును పగులగొట్టి జులాయి సినిమా స్ట్రైల్లో 19 కిలోల బంగారాన్ని దోచుకెళ్లారు. ఈ విషయం తెలిసి బాధితులు ఆందోళన చెందారు. మీ సొమ్ము ఎక్కడికి పోదని తాము భరోసా అని బ్యాంకర్లు చెబుతున్నా వారికి నమ్మకం కుదరడం లేదు. బ్యాంకు చుట్టూ తిరుగుతూ అధికారులను వేడుకుంటున్నారు.
రాయపర్తి ఎస్‌బీఐలో బ్యాంకులో మూడు సెఫ్టీ లాకర్లు ఉన్నాయి. దీనిలోని ఒక లాకర్‌లో 500 మందికి సంబంధించిన కుదువ పెట్టిన బంగారాన్ని బ్యాంక్లో ఉంచారు. దుండగులు అందులో నుంచి 497 మందికి చెందిన 19 కిలోల బంగారాన్ని దొంగిలించారు. దీని విలువ రూ.15 కోట్లు ఉంటుంది. నలుగురు వ్యక్తులు దొంగతనం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కారులో వచ్చిన వీరు బ్యాంకు లోపలికి ప్రవేశించి అందులో రెండు గంటలపాటు ఉన్నారని అనుమానిస్తున్నారు.
చోరీకి పాల్పడిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని, అందుకు ప్రత్యేక బృందం నిర్విరామంగా కృషి చేస్తోందని సీపీ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. బుధవారం ఆయన బ్యాంకును పరిశీలించారు. సీపీ వెంట డీసీపీలు రాజమహేంద్రనాయక్, షేక్ సలీమా, ఎస్సైలు, సీఐలు ఉన్నారు.
COMMENTS