CAA: CAA comes into force.. Another sensational decision of Modi Sarkar
CAA: అమల్లోకి సీఏఏ.. మోదీ సర్కార్ మరో సంచలన నిర్ణయం.
Citizenship Law: నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బీజేపీ కోర్ మేనిఫేస్టోలో ఒకటైన పౌరసత్వ సవరణ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. అయితే గత లోక్‌సభ ఎన్నికల ముందే ఈ చట్టానికి పార్లమెంట్ ఆమోదం కల్పించగా.. తీవ్ర నిరసనలతో ఈ చట్టం అమలును కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఇక ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల ముందు సీఏఏను ఎట్టకేలకు అమలు చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది.
Citizenship Law: దేశంలో మరికొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న వేళ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలోనే పార్లమెంటు ఆమోదం పొందినా.. ఇంకా అమల్లోకి రాని పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించి తాజాగా కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. నేటి నుంచే భారత దేశంలో పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి వస్తుందని కేంద్రం ఈ సందర్భంగా వెల్లడించింది.
2019 డిసెంబర్ 11 వ తేదీన ఈ పౌరసత్వ సవరణ చట్టం పార్లమెంట్ ఆమోదం పొందింది. దీనికి సంబంధించి అప్పటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా సంతకం చేశారు. అయితే ఈ పౌరసత్వ సవరణ చట్టంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో నిబంధనలు, విధివిధానాలు మాత్రం ఇప్పటివరకు కేంద్రం రూపొందించలేదు. తాజాగా ఈ సీఏఏను అమల్లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటన చేయడం సంచలనంగా మారింది.
2014 కు ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి భారత్‌కు వచ్చిన ముస్లిమేతర పౌరులకు భారత పౌరసత్వం కల్పించడం కోసమే ఈ పౌరసత్వ సవరణ చట్టం ప్రధాన ఉద్దేశం. ఎవరైతే హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనుల, బౌద్దులు, పార్శీలు.. 2014 కంటే ముందు భారత్‌కు వలస వచ్చిన వారికి మన దేశ పౌరసత్వం కల్పించనున్నారు.
అయితే 1955 లో వచ్చిన పౌరసత్వ చట్టానికి సవరణలు చేస్తూ 2019 లో ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని కేంద్రం తీసుకువచ్చింది. 1955 చట్టంలో తీసుకొచ్చిన ఈ కొత్త చట్టంలో విదేశాల నుంచి వలస వచ్చిన ముస్లింలను మినహాయించడం తీవ్ర వివాదానికి కారణం అయింది. దీంతో 2019 లో తీసుకువచ్చిన ఈ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. ప్రధానంగా ఈశాన్య రాష్ర్టాల్లో పెద్దఎత్తున ఆందోళనలు, హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో దేశంలోని కొన్ని బీజేపీయేతర రాష్ట్రాలు.. సీఏఏను వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో తమ రాష్ట్రాల్లో ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయమని తేల్చి చెప్పాయి.
పాక్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిమేతర పౌరులకు ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా లేక వాటి గడువు ముగిసినా వారు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని ఈ చట్టం చెబుతోంది. వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే భారత పౌరసత్వం అందిస్తారు. ఈ సీఏఏ బిల్లును ముందుగా 2016 లోనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. దీంతో అప్పుడు ఎన్డీఏలో ఉన్న బీజేపీ మిత్రపక్షమైన అసోం గణపరిషత్ పార్టీ సహా వివిధ పార్టీలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి.
2014 డిసెంబర్ 31 వ తేదీ లోపు భారత్‌కు వలస వచ్చిన మతపరమైన మైనారిటీలకు ఆరేళ్లలోపు పౌరసత్వం కల్పిస్తారు. అయితే వలసదారులు భారత్‌లో కనీసం 11 ఏళ్లు నివసించాలన్న నిబంధనను కాస్త సడలించి.. దాన్ని ఐదేళ్లకు తగ్గించారు. అయితే విదేశాల నుంచి వలస వచ్చిన వారికి పౌరసత్వం ఇచ్చేందుకు ఇలా మతాన్ని ప్రాతిపదికగా తీసుకోనుండటం మన దేశంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక ఈ సీఏఏ పరిధిలో ముస్లింలను చేర్చకపోవడమే అత్యంత వివాదాస్పదంగా మారింది.
COMMENTS