Bookcases at bus stops
బస్టాప్‌ల్లో పుస్తకాల గూళ్లు
సహజంగా బస్‌స్టాప్‌ల్లో బస్సు వచ్చే వరకూ ఖాళీగా కూర్చుంటాం. లేదా ఫోన్ చూస్తూ, పాప్‌కానో, సమోసనో కొనుక్కుని తింటూ బస్సు వచ్చే వరకూ ఎదురుచూస్తాం. దాంతో సమయం వృధా అవుతూ ఉంటుంది. మనకు తెలియకుండానే మన రోజూ వారి పనులు ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి. అనుకున్న సమయానికి జరగవు. బస్సులు త్వరగా రాలేదని అసహనం ఉంటుంది. ఇటువంటి అభిప్రాయం కలగకూడదని, సమయం వృధా కాకూడదని కర్ణాటక పంచాయతీ అధికారులు ఓ వినూత్న ప్రయత్నం చేశారు. అదేంటంటే బస్టాప్‌ల్లో లైబ్రరీ ఏర్పాటు.
పంచాయితీ ముఖ్య కార్యనిర్వహణాధికారి అయిన డాక్టర్ కుమార్‌కు సంవత్సరం క్రితం ఈ ఆలోచన వచ్చింది. తడువుగా 17 గ్రామ బస్టాపుల్లో పుస్తకాల గూళ్లు ఏర్పాటు చేశారు. అందులో అందరూ చదువుకునే వీలుగా నవలలు, నీతి కథల పుస్తకాలు, అంబేద్కర్ వంటి మహనీయుల జీవిత చరిత్రలు, సంస్కృతి, సమాజం, ప్రభుత్వ పథకాలు, బుక్‌లెట్లు... రకరకాల పుస్తకాలు ఉంచారు. పిల్లలకు అవసరమైన సైన్సు, ఇంగ్లీషు, కర్ణాటక సాహిత్య పుస్తకాలు అందుబాటులో ఉంచారు. సామాన్య ప్రజలను విద్య వైపుగా, అందరిచేత పుస్తకాలను చదివించాలన్న ఉద్దేశంతో ఈ సౌకర్యం కల్పించారు.
కుమార్ చదువుకుంటున్న రోజుల్లో పుస్తకాల కోసం వేలమైళ్లు నడిచి లైబ్రరీకి చేరుకునేవాడు. అక్కడ జనరల్ నాలెడ్జీ, సైన్సు, సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు ముందు వేసుకుని గంటల కొద్దీ చదివేవాడు. అతన్ని 'పుస్తకాల పురుగు' అని స్నేహితులు పిలిచేవారు. మొదటి నుంచి ఆయనకు పుస్తకాలంటే చాలా ఇష్టం.
'నేను ఈ స్థాయిలో ఉండటానికి, ఇంత విజ్ఞానం సంపాదించడానికి కారణం ఈ పుస్తకాలే' అంటాడు కుమార్. అందుకే అటువంటి జ్ఞాన సంపదను అందరికీ పంచాలనుకున్నారు. సామాన్యులకు, పేదపిల్లలకు అందుబాటులో ఉండేలా కొన్ని పుస్తకాలను బస్టాప్ గూళ్లలో ఉంచారు. ఈ ప్రాజెక్టు చేపట్టాడని తెలిసి కొంతమంది గ్రంథాలయ కర్తలు పుస్తకాలను ఉచితంగా అందజేశారు. మరి కొంతమంది దాతులు విరాళంగా పుస్తకాలు కొని ఇచ్చారు. మరికొంతమంది బస్టాప్ దగ్గర పత్రికలు వేయిస్తున్నారు.
తాళాలు లేకుండా ...
ఈ పుస్తకాల గూళ్లకు అద్దాల తలుపులు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరికీ ఒక పుస్తకం చేరువ కావాలన్న సంకల్పంతో కుమార్ వీటికి తాళాలు ఏర్పాటుచేయలేదు. బస్టాప్‌కు వచ్చిన ప్రయాణీకులు చాలా ఆసక్తిగా పుస్తకాలను తీసుకుని చదువుకుంటున్నారు. చదవడం పూర్తి అయిన తర్వాత అక్కడ ఉంచుతున్నారు. చదవడం పూర్తికాని వారు ఇళ్లకు తీసుకెళ్లి చదువుకుని, తిరిగి తీసుకొచ్చి పెడుతున్నారు. ఈ పుస్తకాల గూళ్లు ఆలోచన చాలా బాగుందని ప్రయాణీకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అధికారులు కూడా ఈ ప్రాజెక్టు ఫీడ్‌బ్యాక్ బాగుందని తెలపడంతో పలు జిల్లాల్లో అమలు చేస్తున్నారు. ఇప్పుుడు 267 బస్టాపుల్లో ఈ పుస్తకాల గూళ్లను ఏర్పాటుచేశారు. ఇందులో సుమారు 45 వేల పుస్తకాలు ఉంచారు. స్థానిక యువజన సంఘాలు వీటి సంరక్షణ బాధ్యత చూస్తున్నాయి.
కొంతమంది పుస్తకాలు తీసుకెళ్లి తిరిగి తీసుకురావడం లేదు. కొన్ని చోట్ల దొంగతనాలు జరుగు తున్నాయి. అయినా దాని గురించి అధికారులు విచారించడం లేదు. తాము అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని సంతోష పడుతున్నారు. ఆ పుస్తకాల ప్లేస్‌లో అధికారులు మరో కొత్త పుస్తకం తీసుకొచ్చి గూళ్లలో పెడుతున్నారు.
COMMENTS