Termites : చెదపురుగుల నుండి పంటల రక్షణ ఎలాగంటే?..
Termites : పంట మొలక దశ నుండి కోతల వరకు అన్ని దశలలో చెదపురుగుల కారణంగా పంటకు నష్టం వాటిల్లుతుంది. చెదపురుగులు ఆశించిన తరువాత వేర్లకు నష్టం కలిగించి మొక్కలు చనిపోయేలా చేస్తాయి. చెదలు ముఖ్యంగా కొయ్య సామగ్రినేగాక, వివిధ పంటలను పలు చెట్లను ఆశించి చెట్టు లోపలి మెత్తటి భాగాన్ని తినడం వల్ల వడలిపోయి తరువాత ఎండిపోయి చనిపోతాయి. ఈ పురుగు యొక్క బెడద చల్కా ఎర్రమట్టి నేలల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ పురుగులు సామూహికంగా పుట్టల్లో నివసిస్తాయి. ఉష్ణోగ్రత అధికంగా ఉండే సమయంలో చెదపురుగులు మట్టి అడుగు బాగాల వరకు వెళతాయి.
తేనెటీగల లాగానే చెదపురుగుల్లో కూడా నాలుగు రకాలు ఉన్నాయి. రాణి, రాజు, పని చేసే చెదపురుగులు, సైనిక చెదపురుగులు ఉంటాయి. రాణి మరియు రాజు పురుగులు మొదట రెక్కలు కలిగి ఉంటాయి. తొలకరి వర్షాలు పడిన వెంటనే పుట్ట నుండి బయటకు వచ్చి నేల మీద కాని, గాలిలో కాని సంపర్కం జరుపుకుంటాయి. సంపర్కం జరిగిన తరువాత పురుగులు రెక్కలు రాలిపోతాయి. రెక్కలు రాలిన రాణి పురుగు భూమిలోనికి పోతుంది. ఆ తరువాత రాణి పురుగు పరిమాణం చాలా పెద్దదిగా మారి ఒక రోజులో సుమారుగా 30,000 – 80,000 గ్రుడ్లు పెట్టడం ప్రారంభిస్తుంది. ఈ విధంగా 7- 10 సంవత్సరాలు గుడ్లు పెడుతుంది. గుడ్ల నుండి పిల్ల పురుగులు 1 నెల నుండి 3 నెలలు లోపు బయటకి వస్తాయి. పిల్ల పురుగులు పెద్దవిగా మారటానికి సంవత్సర కాలం పని చేసే చెద పురుగులు తెల్లగా లేక గోధుమ వర్ణం కలిగి చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి.
సేవక పురుగులు ఎక్కువ సంఖ్యలో పంట పొలాలను ఆశిస్తాయి. ఇవి కాండంలోనికి పోయి లోపలి పదార్ధాన్ని తినటం వల్ల మొక్కలు మొదట వడిలిపోయి తరువాత ఎండిపోయి చనిపోతాయి. అలా తినడం వల్ల ఏర్పడిన ఖాళీ ప్రదేశాలను మట్టితో నింపుతాయి. చనిపోయిన మొక్కలు పీకితే సునాయాసంగా ఊడి వస్తాయి. పండ్ల మరియు అడవి జాతి మొక్కల బెరడును తింటూ మట్టితో కప్పడం వల్ల చెట్లు గిడసబారి పోతాయి. వీటి ఉధృతి మెట్ట పంటల్లో నీటి ఎద్దడి ఉన్న పండ్ల తోటల్లో ఎక్కువగా ఉంటుంది.
చెదలు ఎక్కవగా తడి వాతావరణం ఉన్న ప్రదేశాల్లో వృద్ధి చెందుతాయి. చెదపురుగుల నివారణకు క్లోరో పైరిఫాస్ 50 శాతం 5 మీ.లీ ఒక లీటరు నీటికి కలిపి చెట్టు చుట్టూ మట్టిని కదిలించి పోయాలి. పండ్ల తోటల నారుమడులను తయారు చేసేటప్పుడు ,లండేను ,మిధైల్ పారాధియాన్ పొడి మందు నారు మడుల్లో కలపాలి. చెట్లు నాటే గుంతల్లో పొడి మందును గుంతకు 100.గ్రా మోతాదులో కలపాలి. క్లోరోపైరిఫాస్ 50 ఇ.సి మందు 5 మీ.లీ ఒక లీటరు నీటికి కలిపి సుమారు 15 – 30 లీటర్ల మందు ద్రావణాన్ని చెద పుట్టల్లో బాగా తడిసేటట్లు పోయాలి. ఇలా చేయటం ద్వారా చెదపురుగులను సాధ్యమైన మేర నివారించుకోవచ్చు. నెమటోడ్స్ తో కూడిన ద్రావణం చెదలను నివారించటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది.
COMMENTS