Oilseeds : రబీలో నూనె పంటల సాగు లాభదాయకమేనా?..
Oilseeds : నూనె గింజలకు మార్కెట్లో ఇటీవలి కాలంలో బాగా డిమాండ్ పెరిగింది. దీంతో చాలా మంది రైతులు నూనె గింజల సాగు దిశగా అడుగులు వేస్తున్నారు. నూనె గింజల సాగుకు రబీ అనుకూలంగా ఉంటుంది. అక్టోబరు నుంచి రబీ పంటల సాగు మొదలవుతుంది. సరైన ప్రణాళిక ద్వారా నూనె గింజల సాగు చేపడితే రైతులు మంచి దిగుబడిని ఆదాయాన్ని పొందే వీలుంటుంది. వేరుశనగ, కుసుమ, నువ్వులు, ఆముదం, పొద్దుతిరుగుడు పంటలను నూనె గింజల పంటలుగా సాగు చేయవచ్చు.
నూనె గింజల పంటల్లో ముఖ్యమైనది వేరుశనగ. వేరుశనగలో సాధారణంగా కదిరి-6 రకం రైతుల్లో బాగా ప్రాచుర్యం పొందింది. ఇటీవల విడుదలైన కదిరి లేపాక్షి రకం బెట్టను తట్టుకుని అధిక దిగుబడినిస్తుంది. రసంపీల్చే దోమ, తామర పురుగులను తట్టుకుంటుంది. కూలీల కొరతను అధిగమించేందుకు కలుపు నివారణకు సరైన విధానాలు అవలంభించి మంచి దిగుబడిని సొంతం చేసుకోవచ్చు.
కుసుమ పంటను రబీలో నల్లరేగడి నేలల్లో నిల్వ ఉన్న తేమతో సాగు చేసుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న కుసుమ పువ్వు రేకులను గ్రీన్ టీగా వాడితే మంచి ప్రయోజనాలుంటాయి. ఈ దిశలో మార్కెటింగ్‌పై దృష్టిసారిస్తే మంచి ఆదాయాన్ని పొందవచ్చు. రబీలో సాగుకు మంజీర, టి.ఎస్.ఎఫ్-1 రకాలు అనువైనవి. మంజీర రకం 115 నుంచి 120 రోజుల్లో పంటకొచ్చి ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ఇది పసుపు, నారింజ రంగు పూలున్న తెల్లగింజ రకం. గింజల్లో 27 నుంచి 30 శాతం నూనె ఉంటుంది. టి.ఎస్.ఎఫ్-1 రకం 125 నుంచి 130 రోజుల్లో పంటకొచ్చి ఎకరాకు 6 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది.
ఆముదం పంటను సాధారణంగా వర్షాధారంగా సాగు చేస్తున్నారు. ఆముదంను నీటి వసతి కలిగిన భూముల్లో డ్రిప్ ద్వారా పండిస్తే అధిక దిగుబడులను పొందవచ్చు. ఆముదంలో హరిత, ప్రగతి, డి.ఎస్.సి-107 సూటి రకాలు, పి.సి.హెచ్-111, 222, ఇతర హైబ్రిడ్ రకాలను సాగుకు ఎంచుకోవచ్చు. భారత నూనెగింజల పరిశోధన సంస్థ నుంచి విడుదలైన డి.సి.ఎస్-107, డి.సి.హెచ్-117, 519, ఐ.సి.హెచ్-66 రకాలను సాగు చేసుకోవచ్చు. నువ్వులను వేసవి పంటగా జనవరి రెండో పక్షం నుంచి ఫిబ్రవరి మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు.
ప్రస్తుతం మార్కెట్లో వంట నూనెల ధరలు మండిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం మనదేశంలో నూనెగింజల సాగు తక్కువగా ఉండటమే..ప్రతి ఏటా రూ.70 వేల కోట్లు చెల్లించి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. నూనె గింజల పంటలకు రోజురోజుకూ గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ పంటలు పండిస్తే రైతులకు అదాయంతోపాటు, స్ధానిక అవసరాలు తీరే అవకాశం ఉంటుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించడానికి వీటిని మించిన పంటలు లేవు. సంకరజాతి విత్తనాలను వాడితే అధిక దిగుబడి సాధించవచ్చు
COMMENTS