Rose Trees : గులాబీ మొక్కలు బాగా పూలు పూయాలంటే?
Rose Trees : గులాబీ పూలంటే చాలా మందికి అమితమైన ఇష్టం..అందుకే గులాబీ మొక్కలను ఇంట్లో పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. నర్సరీలలో నిండుగా పూలు పూస్తున్న గులాబీ మొక్కలను కొనుగోలు చేసి ఇంటికి తీసుకు వచ్చి కుండీలలోనో, ఇంటి ఆవరణలో ఉండే ఖాళీ ప్రదేశంలోనో నాటుతారు. అయితే ఆతరువాత వాటి సంరక్షణ విషయంలో ఏమాత్రం దృష్టి పెట్టకుండా గులబీ చెట్లు పూలు సరిగా పూయటం లేదని బాధపడుతుంటారు.
గులాబీ చెట్లు వేసుకున్నవారు, వేయబోయే వారు కొన్ని రకాల జాగ్రత్తలు తప్పనిసరిగా పాటిస్తే పూలు బాగా పూసేందుకు అవకాశం ఉంటుంది. గులాబీ మొక్కలను పెంచేందుకు పన్నెండు నుండి 18 అంగుళాల కుండీలను ఎంచుకోవాలి. కుండీలలో సారవంతమైన మట్టిని నింపుకోవాలి. పశువుల ఎరువు లేదంటే వర్మికంపోస్ట్, కోకోపీట్, ఒకవంతు చొప్పున మట్టిలో కలుపుకోవాలి. కుండీలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పదిహేను రోజుల కొకసారి పొటాషియం ద్రవరూపంలో అందించాలి.
ప్రతి రోజు కనీసం మూడు గంటలపాటు గులాబీ మొక్కకు ఎండతగిలేలా చూసుకోవాలి. మొగ్గలు వచ్చే దశలో అదనంగా ఎరువులు అందించటం అవసరం. అధికంగా పెరిగే కాండపు చివర్లను కత్తిరించుకోవాలి. కత్తిరించిన చోట బోరాడాక్స్ మిశ్రమాన్ని పూయాలి. గులాబీ పువ్వు బాగా విచ్చుకున్న తరువాత పువ్వు ను కోసి జానెడు వరకు కొమ్మలని కత్తిరించాలి .ఉల్లిపొట్టు, బంగాళదుంప పొట్టు, మిగిలిపోయిన మందులు మొక్క చుట్టూ వేసుకోవాలి .టీ పొడి, కాఫీ పొడి గులాబీ మొక్కలకు మంచి ఎరువుగా ఉపయోగపడి పువ్వులు అధికంగా పూసేందుకు సహాయపడతాయి.
పండిన, ఎండిన ఆకులు కొమ్మలు తుంచేయాలి. మొక్క ఎంత గుబురుగా ఉంటే అంత ఎక్కువగా పూలు పూస్తాయి అని గుర్తు పెట్టుకోండి. గులాబీ మొక్కలు పైన నీళ్ళు స్ప్రే చేయడం వలన అధిక వేడి, దుమ్ము ధూళి నుంచి రక్షణ గా ఉంటుంది. కుండీలలో మట్టి తడి ఆరిపోకుండా, వేడి నుంచి తట్టుకోవడానికి పైన ఒక పొరగా ఎండిన ఆకులు, ఆవుపేడను వేయాలి.
COMMENTS