Crab Farming : పీతల పెంపకంలో కొత్త విధానం.. మంచి లాభాలు ఆర్జిస్తున్న రైతులు
Crab Farming : పీత కష్టాలు పీతవి అంటారు పెద్దలు . అవును ఇది వాస్తవమే. నిన్నామొన్నటి వరకు పీతల్ని పెంచడానికి నానా కష్టాలు పడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. పీతల సాగుకి మంచిరోజులొచ్చాయి. ప్రత్యేకంగా తయారు చేసిన బాక్సుల్లో… పెంపకం తేలికైంది. పీతల ఎదుగుదలని నిత్యం గమనిస్తూ పెట్టెల్లోనే ఆహారం వేసే అవకాశం ఉన్నందున… చక్కని దిగుబడి వస్తోంది. దీంతో చాలా మంది రోయ్యసాగుచేసే రైతులు పీతల పెంపకంవైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కోవలోనే కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు పెట్టెల్లో పీతల పెంపకం చేపట్టి మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. మరి ఆయన సాగుచేస్తున్న విధానమేంటో మనమూ తెలుసుకుందాం
ఆక్వా రంగంలో చేపలు తర్వాత స్థానం రొయ్యలు, పీతలదే. విదేశాలకు ఎగుమతులు చేసుకునే అవకాశం రొయ్యల తర్వాత పీతలకు మాత్రమే ఉంది. అంతర్జాతీయంగా మంచి ధర కూడా లభిస్తోంది. అంత వరకు బాగానే ఉన్నా, చెరువులో పీతల పెంపకంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా స్వజాతి భక్షణ అంటే బలంగా ఉన్న పీత బలహీనంగా ఉన్న పీతను తినేస్తుంది. దీని వల్ల చెరువుల్లో వేసిన పీత పిల్లల్లో తక్కువ సంఖ్యలో పెరిగి పెద్దవి అవుతున్నాయి. దానివల్ల ఆశించిన స్థాయిలో లాభాలు రాక రైతులు సాగుకు కాస్త వెనుకంజ వేస్తున్నారు. ఇది పీతల మనుగడకే ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. నూతన టెక్సాలజీతో ఇప్పుడు పీతల పెంపకం చాలా సులువైంది.
చెరువులో నీటిపై తేలుతున్న పెట్టెలలో పీతలను పెంచుతున్నారు రైతు సుధీర్ వర్మ. కృష్ణాజిల్లా, నాగాయలంక మండలం, గుల్లలమోద గ్రామానికి చెందిన ఈ రైతు గతంలో వనామి సాగుచేపట్టేవారు. అయితే ప్రకృతి వైపరిత్యాలు, వాతావరణ మార్పుల కారణంగా వైరస్ సోకి తీవ్రంగా నష్టం వాటిల్లేది. అంతే కాదు ధరలలో నిలకడలేకపోవడంతో నష్టాలను చవిచూశారు. ఈ నేపద్యంలో పీతల సాగులో నూతన సాంకేతిక పరిజ్ఞానం రావడంతో వీటి సాగుకు మొగ్గుచూపారు.
రొయ్యలు మాదిరిగానే పీతపిల్లలను కూడా ఎంపిక చేసిన చెరువుల్లో సాగు చేయడం ఆనవాయితీగా వస్తోంది. కొత్త పద్ధతిలో చెరువులో పీవీసీ పైపు గొట్టాలతో ప్రత్యేక నిర్మాణాలు చేపడతారు. ఆ గొట్టాలకు పెట్టెలను అమర్చుతారు. ఒక్కో పెట్టెలో ఒక పీతను వదులుతారు. నీటిలో తేలి ఉండటం వల్ల ఆ బాక్సుల్లో తిరుగుతూ వేసిన ఆహారాన్ని పీతలు తింటాయి. దీని వల్ల ఒక పీత మరో పీతను తినడం అనే సమస్య ఉండదు. అంతే కాదు ప్రతిరోజు పెట్టెలను తెరిచి పీత ఎదుగుదల ఎలా ఉందో పరీక్షించుకుని దానికి అనుగుణంగా సాగులో ముందుకు సాగవచ్చు.
పీతల పెంపకంపై సుధీర్ వర్మ మాట్లాడుతూ..
సాధారణంగా పీతలను రెండు రకాలుగా పెంచుతారు. ఒకటి విత్తనం ద్వారా చేపట్టే కల్చర్. రెండవది గుల్ల విడిచిన పీతలను సేకరించి షెల్ గట్టిపడే వరకు పెంచే పద్ధతి. దీన్ని ఫాటనింగ్ అంటారు. హేచరీల నుంచి పిల్లను 50 నుండి 100 గ్రాముల సైజులో కొనుగోలు చేసి కల్చర్ చేపడితే దాదాపు సంవత్సరం పాటు పీతలను పెంచాల్సి వుంటుంది. అదేవిధంగా గుల్లవిడిచిన పెద్ద సైజు పీతలను జాలరుల నుండి కొనుగోలుచేసి, రెండు మూడు నెలలపాటు చెరువులో పెంచి శరీరంపై పెంకు గట్టి పడిన దశలో మార్కెట్ చేస్తుంటారు.
పీతలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అంతర్జాతీయంగానే కాకుండా దేశవాళీ మార్కెట్లో కూడా పీత ఎంతో ఖరీదైంది. దీన్ని సాంకేతిక పద్ధతుల్లో పెంచితే మంచి లాభాలు గడించవచ్చు. రాష్ట్రంలో సముద్రతీరం పీతల సాగుకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. రాయితీలు ఇచ్చే ప్రోత్సహిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో రైతులు ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు కూడా పంపించారు. అమల్లోకి వస్తే రొయ్యల మాదిరిగా పీతలు కూడా డాలర్లు పంట పండిస్తుంది.
COMMENTS