WATER BOTTLE SCAMS IN BUS STANDS
ఆ బస్‌స్టాండ్‌లో వాటర్ బాటిల్ కొంటున్నారా? - విచిత్రమైన బ్రాండ్లు, నచ్చిన రేట్లు.
రోజురోజుకు పెరిగిపోతున్న నకిలీ వాటర్ బాటిళ్ల విక్రయాలు - బస్టాండ్లలో రెచ్చిపోతున్న వ్యాపారులు - పేర్లు మార్చి, ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కవగా విక్రయాలు.
Fake Water Bottled Sales Increased in Bus Stands : రాష్ట్రంలోనే రెండో పెద్ద బస్టాండ్‌గా కరీంనగర్‌కు పేరుంది. ఇక్కడ ప్రయాణికుల అవసరాలను వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. అసలే ఎండాకాలం ఎక్కువగా దాహం వేస్తుంటుంది. దీంతో చాలా మంది వాటర్ బాటిళ్లను కొనుగోలు చేస్తుంటారు. దీన్నే ఆసరాగా చేసుకుంటున్న వ్యాపారులు నకిలీ నీళ్ల సీసాల దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. ఎక్కడా లభించని బ్రాండ్లు కరీంనగర్ బస్టాండ్‌లో ఉన్న స్టాళ్లలో దర్శనమిస్తున్నాయి. అందులో ఏవి నకిలీవో? ఏవీ స్వచ్ఛమైనవో తెలియని పరిస్థితి నెలకొంది. కొందరు వ్యాపారులు ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తూ ప్రయాణికుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఖాళీ బాటిళ్లలో నీటిని నింపి పలు రకాల బ్రాండ్ల పేరుతో విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ఎమ్మార్పి కంటే ఎక్కువ ధరకు అమ్మకాలు :
కరీంనగర్ బస్టాండ్‌లో 45 ప్లాట్‌ఫాంలు ఉన్నాయి. నిత్యం 1500కు పైగా సర్వీసులు నడుస్తుంటాయి. వీటి ద్వారా సుమారు 80 వేలకు పైగా మంది రాకపోకలు సాగిస్తుంటారు.
ఎండలు మండిపోతుండటంతో దాహాన్ని తీర్చుకోవడానికి చాలా మంది వాటర్ బాటిళ్లను కొనుగోలు చేస్తుంటారు. ఇక్కడే కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయించి వసూలు చేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు.
మామూలుగా నీళ్ల సీసా బయట కొంటే రూ.20 ఉంటుంది. ఇక్కడ మాత్రం రూ.30 తీసుకుంటున్నారు. అదేమిటని ప్రశ్నిస్తే కూలింగ్ చేసినందుకు అని చెబుతున్నారని పేర్కొన్నారు. కొన్ని కంపెనీల సీసాలపై రూ.30 అని ఉండటం విశేషం. ఎమ్మార్పీ అంతే ఉందని అదే ధర తీసుకుంటున్నామని కొందరు వ్యాపారులు చెబుతున్నారు.
ఇటీవల ఓ ప్రయాణికురాలు బస్టాండ్‌లోని ఓ షాపునకు వెళ్లి నీళ్ల బాటిల్ కొంటే వాడకం లేని కంపెనీది ఇచ్చారు. అది వద్దని ప్రముఖ కంపెనీది కావాలని అడిగితే ఆ స్టాల్ నిర్వాహకుడు ఓ అక్షరం తేడాతో ఉన్న సీసా ఇచ్చాడు. ఇదేమిటని ప్రశ్నిస్తే అదే ఉందని సమాధానం ఇచ్చాడు. ఒకటి అడిగితే మరోటి ఇవ్వడంతో ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక వీడియో రూపంలో సోషల్ మీడియాలో పంచుకోగా అది వైరల్ అయింది.
అధికారుల పర్యవేక్షణ లోపం :
చాలా మంది దుకాణాల నిర్వాహకులు టెండరు సమయంలో ఒప్పందం చేసుకున్న వాటిని కాకుండా ఇతరత్రా వాటిని కూడా అమ్ముతున్నారు. అలాగే నాసిరకం తినుబండారాలు, వస్తువులు విక్రయిస్తున్నట్లు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నీళ్లసీసాల్లో వేర్వేరు ధరలు ముద్రించి ఉంటున్నాయి. అధికారులు తనిఖీ చేసినా తాము ఎమ్మార్పీ ధరకే విక్రయిస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు. ఐఎస్‌ఐ, ఎమ్మార్పీని మాత్రమే విక్రయించాలని, కొనుగోలు చేయాలని అధికారులు చూస్తున్నారు. అవి నాణ్యమైనవా?, నాసిరకమా చూడటంలేదు. అది తమ పరిధి కాదని చెబుతున్నారు. ఆహార విభాగం తనిఖీ వారు ఇటు వైపు చూసి తనిఖీలు చేసిన దాఖలాలు లేవు.
సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి :
నీళ్ల సీసాలు, వస్తువులు, ఏదైనా ప్యాకింగ్‌పై ఉన్న ఎమ్మార్పీ కంటే ఎక్కువ డబ్బులు తీసుకోవద్దని కరీంనగర్ రీజియన్ రీజినల్ మేనేజర్ రాజు తెలిపారు. ఎక్కువ ధర తీసుకుంటే ప్రయాణికులు నిర్భయంగా ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇతర కంపెనీల సీసాల అంశం తమ పరిధిలో ఉండదని, నీరు, ఆహార పదార్ధాల నాణ్యత విషయంలో అనుమానాలు ఉంటే ప్రయాణికులు సంబంధిత విభాగాల అధికారులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. వారి దృష్టికి తీసుకొచ్చినా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
COMMENTS