CONSUMER COMMISSION
మార్కెట్‌లో వస్తువు కొని మోసపోయారా? - ఇలా చేస్తే మీ డబ్బులు మీకు వాపస్!
మార్కెట్‌లో ఏదైనా వస్తువు కొని మోసపోతే ఏం చేయలేక పోతున్న వినియోగదారులు - వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించి న్యాయం పొందవచ్చంటున్న నిపుణులు - అది ఎలాగో తెలుసుకోండి.
Consumer Commission Issues : ప్రస్తుతం మార్కెట్‌లో ఒక వస్తువు వందల రకాల్లో, వేల క్వాలిటీల్లో లభిస్తోంది. ఏది నాణ్యమైనదో, ఏది నకిలీదో తెలుసుకోవడం కొనుగోలుదారులకు కష్టంగానే మారింది. వినియోగదారులు క్వాలిటీ వస్తువులు, సేవలు పొందలేకపోతున్నారు. నాణ్యత లేనివి పసిగట్టలేని స్థితి ఈ రోజుల్లో దాపురించింది. ఒకవేళ వస్తువులను కొనుగోలు చేసి మోసపోతే న్యాయం పొందే హక్కు వినియోగదారులకు ఉంది. ఈ విషయం తెలియక చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. దీనిపై అవగాహన పెంచుకుంటే సులభంగా న్యాయం పొందవచ్చు.
కమిషన్‌లో :
కొనుగోలు చేసిన వస్తువులో నాణ్యత లోపిస్తే వెంటనే దాన్ని విక్రయించిన వ్యాపారికి తెలియజేయాలి. అక్కడ సమస్యకు పరిష్కారం దొరక్కపోతే తదుపరిగా డీలర్ దృష్టికి దానిని తీసుకెళ్లాలి. అక్కడా ఫలితం లేకపోతే ఆ తర్వాత జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించవచ్చు. ఫిర్యాదు మాత్రం చాలా స్పష్టంగా ఉండాలి. వస్తువు, ఆర్థిక సేవలు ఏవైనా అన్ని పేపర్లు, బిల్లులు ఇతర సర్టిఫికెట్లను జతపర్చాలి. దానికి ఎలాంటి పరిష్కారం మీరు కోరుకుంటున్నారనే విషయాన్ని కూడా పేర్కొనాలి. వస్తువును కొన్న రెండేళ్లలోపు మాత్రమే ఫిర్యాదు చేయాలి. సొంతంగా, లేదంటే న్యాయవాదిని నియమించుకునైనా కేసును వినియోగదారుల కమిషన్‌లో వాదించుకోవచ్చు.
విలువను బట్టి :
జిల్లా స్థాయిలో ఫిర్యాదుల కోసం వస్తుసేవల విలువను బట్టి ఉచితం నుంచి రూ.500 వరకు ఫీజును చెల్లించాలి. రూ.కోటి నుంచి రూ.10 కోట్ల మధ్యలో సమస్య ఉంటే రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేయాలి. దీనికి రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. రూ.10 కోట్లకు పైగా సమస్య తీవ్రత ఉంటే జాతీయ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలి. రూ.5 వేలు ఫీజు చెల్లించాలి.
బిల్లు తప్పనిసరి :
ఏ వస్తువునైనా కొనుగోలు చేసి ఇంటికెళ్లి చూశాక అది నకిలీదని తెలిస్తే అలానే ఉండటం సరికాదు. ఎలాంటి లోపం ఉన్నా న్యాయం పొందే హక్కు వినియోగదారుడికి ఉంటుంది. లోపాన్ని ఎత్తిచూపేందుకు మన వద్ద ప్రధానంగా కొనుగోలు చేసిన బిల్లు ఆధారం తప్పనిసరిగా ఉండాలి. దీనిపై ప్రజల్లో అవగాహన మరింతగా పెంచాల్సిన అవసరం ఉంది.
COMMENTS