TELANGANA GOVT JOB PORTAL FOR PWD
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేలా సాయపడే ప్రభుత్వ జాబ్ పోర్టల్ - వారికి మాత్రమే!
దివ్యాంగులు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందేందుకు వీలుగా పోర్టల్ - ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం - పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకుంటే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందే అవకాశం
Govt Job Portal For Persons With Disabilities : చదువుకున్న దివ్యాంగులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేందుకు వివిధ ప్రాంతాలకు వెళ్లడం ఖర్చుతో పాటు శ్రమతో కూడుకున్న పని. దీనివల్ల చాలా సందర్భాల్లో వారు అవకాశాలను అందుకోలేకపోతున్నారు. దీనిని గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి కోసం ప్రత్యేక చర్యలను చేపట్టింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు యూత్ ఫర్ జాబ్స్ అనే ఓ సంస్థతో కలసి ప్రత్యేక జాబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్ర మంత్రి సీతక్క చేతుల మీదుగా కొన్ని నెలల కిందటే దీనిని ప్రారంభించినప్పటికీ, దీనిపై అవగాహన లేకపోవడంతో చాలా మంది ఉపయోగించుకోలేకపోతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులు వారి చదువు, అర్హతల ఆధారంగా వివరాలు నమోదు చేసుకొని ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
ఏ విధంగా నమోదు చేసుకోవాలంటే? :
తమ వివరాలను నమోదు చేసుకునేందుకు దివ్యాంగులు వారి స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్లో గూగుల్ బ్రౌజర్లో www.pwdjobportal.telangana.gov.in ని సందర్శించాలి. వెబ్‌పేజీ ఓపెన్ అవుతుంది. ఎస్ఎస్సీ సర్టిఫికెట్ ప్రకారం పేరు, సెల్‌ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, దివ్యాంగ సదరం సర్టిఫికెట్, ఏవిభాగం అనే విషయంతో పాటు ఎంతశాతం దివ్యాంగత్వం ఉంది తదితర వివరాలను నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అర్హతలను ఆధారంగా అందులో నమోదు చేసుకున్న 300 కంపెనీలు, మీ విద్యార్హతలు, సామర్థ్యాలను పరిగణలోకి తీసుకొని సరిపడా ఉద్యోగాన్ని అందించనున్నారు. దీంతో దివ్యాంగులు ఇంటి వద్ద నుంచే ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పొందవచ్చు.
COMMENTS