TEACHER RESCUING SNAKES AND BIRDS
పాములు, పక్షులను రక్షిస్తున్న టీచర్- చెట్లు నాటడంతో పాటు అనాథ పిల్లలకు ఆశ్రయం!
ఇప్పటి వరకు వేలాది చెట్లను నాటిన స్నేహా శ్రీ సొరెన్- సుమారు 2,000 పాములను రక్షణ.
Teacher Rescuing Snakes and Birds : ఎండ వేడికి తట్టుకోలేక మరణించిన పక్షులను చూసి చలించారామె. వాటి సంరక్షణ కోసం సొంత ఖర్చులతో ఆశ్రయం ఏర్పాటు చేశారు. జనావాసాల్లో సంచరించే పాములను చంపడం చూసి తట్టుకోలేకపోయారు. అందులో శిక్షణ తీసుకుని మరీ వాటిని సంరక్షిస్తున్నారు. ఇలా కేవలం చెట్లు, పక్షులు మాత్రమే కాకుండా అనాథలుగా మారిన అనేక మంది పిల్లలను దత్తత తీసుకుని వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు ఒడిశా మల్కన్‌గిరికి చెందిన స్నేహా శ్రీ సొరెన్. ఈ క్రమంలోనే ఆమె కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మయూర్‌భంజ్‌లో జన్మించిన స్నేహ శ్రీ సొరెన్‌కు చిన్ననాటి నుంచి చెట్లను నాటడం అంటే చాలా ఇష్టం. వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు కావడం వల్ల ఆమెకు వివిధ ప్రాంతాలకు బదిలీ అవుతుంటారు. ఈ క్రమంలోనే బదిలీ అయ్యే చోట చెట్లను పెంచడంతో పాటు పక్షులకు గూళ్లు నిర్మిస్తున్నారు. ఇదే కాకుండా స్నేహా శ్రీ చిన్ననాటి నుంచి చెట్లను పెంచుతున్నారు. ఇప్పటివరకు వేలాది చెట్లతో పాటు సుమారు 500కు పైగా పండ్ల చెట్లను నాటారు. స్నేహితులు, బంధువులకు చెట్లను కానుకగా ఇస్తుంటారు.
"2023 నవంబర్ 9 నా తల్లి మరణించింది. ఆ తర్వాత నాకు మరో స్కూల్‌కు బదిలీ అయ్యింది. అక్కడ చేరే రోజు నాకు ఎండ వేడికి తట్టుకోలేక మరణించిన ఓ పక్షి కనిపించింది. ఇలా మరే జీవి మరణించకూడదని ఆనాడే నిర్ణయించుకున్నా. వెంటనే పాఠశాలలో పక్షుల కోసం చిన్న గూడును ఏర్పాటు చేశా. ఇలా చేసిన మూడు రోజుల్లోనే ఓ పక్షి అందులోకి వచ్చింది."
--స్నేహా శ్రీ సొరెన్, టీచర్
ముఖ్యంగా చెట్లను కొట్టివేయడం, అడవులు అంతరించిపోవడం వల్ల వన్యప్రాణులు, పక్షులకు గూడు లేకుండా పోతుంది. ఈ క్రమంలోనే వాటిని రక్షించేందుకు స్నేహ శ్రీ తన సొంత ఖర్చుతో ఆశ్రయం కల్పిస్తున్నారు. ఇందుకోసం జిల్లాలోని ముఖ్య ప్రాంతాల్లో వాటి కోసం గూళ్లు నిర్మిస్తున్నారు. దీంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని అనాథ పిల్లలను చేరదీసి ఆశ్రయం కల్పిస్తున్నారు. వారి ఆశ్రమాల్లో చేర్చి, బాగోగులు చూసుకుంటున్నారు. విద్యతో పాటు వివిధ కళాశాలల్లో ప్రవేశం కల్పించి ఆర్థికసాయం కూడా అందిస్తున్నారు. క్రమక్రమంగా దీనికి విద్యార్థులతో పాటు సహోద్యుగుల నుంచి మద్దతు లభించింది.
మనలో చాలా మంది పాములు కనిపించగానే కొట్టి చంపేస్తుంటారు. దీన్ని చూసి చలించిపోయిన స్నేహా వాటిని కాపాడేందుకు నడుం బిగించారు. అందుకోసం పాములను పట్టడంలోనూ శిక్షణ తీసుకున్నారు. "చాలా మంది పాములను కొట్టి చంపేయడం చూసినప్పుడు చాలా బాధపడ్డాను. ప్రకృతి అన్ని జీవులకు సమానంగా జీవించే హక్కును ఇస్తుంది. వాటిని అలానే బతకనివ్వాలి. అందుకే పాములు హాని చేయవని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని అనుకున్నారు. స్నేక్ సొసైటీ ద్వారా శిక్షణ తీసుకుని పాములను రక్షిస్తున్నాను. ఇలా ఇప్పటి వరకు సుమారు 2,000 పాములను రక్షించి అడవుల్లో వదిలాను." అని చెబుతున్నారు.
COMMENTS