NATIONAL HIGHWAY HELPLINE
నేషనల్ హైవేపై యాక్సిడెంట్, ఇంధనం అయిపోయినా డోంట్ వర్రీ! - ఈ టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేస్తే చాలు
జాతీయ రహదారిపై ప్రయాణించినప్పుడు మీ వాహనం ఆగిపోయిందా? - ఏదైనా ప్రమాదం జరిగిందా? - పెట్రోల్ అయిపోయిందా? - ఈ కింది ఇచ్చే టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేస్తే సరిపోతుంది.
National Highway Helpline : మీరు జాతీయ రహదారిపై దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్నారు. అక్కడ మీ వెహికల్‌కి ఏదైనా ప్రమాదం జరిగినా, పెట్రోల్, డీజిల్ అయిపోయినా, అకస్మాత్తుగా హైవేపై వాహనం నిలిచిపోయినా, టైర్ పంక్చర్ అయినా వెంటనే చాలా మంది ప్రయాణికులు ఆందోళనకు గురవుతారు. ఏంటీ ఎవరీలేని ప్రాంతంలో ఇలా జరిగింది.
ఇప్పుడు ఎవరికీ దీని గురించి చెప్పాలి? పోలీసులకు ఫోన్ చేస్తే ఈ ప్రాంతానికి చేరుకోవడానికి సమయం పడుతుందే అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ మీరు ఆందోళన చెందకుండా ఈ 1033 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే తక్షణమే సాయం అందించడానికి మీ దగ్గరకు వస్తారు. ఇక ఎంచక్కా మీ ప్రయాణాన్ని సాఫీగా సాగించవచ్చు.
టోల్ ఫ్రీ నంబరు 1033కి కాల్ చేస్తే :
- రోడ్డు ప్రమాదం జరిగితే ఘటనాస్థలానికి అంబులెన్స్ పంపించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తారు.
- మార్గమధ్యలో వాహనంలో ఇంధనం అయిపోతే పెట్రోలింగ్ వాహన సిబ్బంది పంపించి ఐదు లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్‌ను తెచ్చి ఇస్తారు. అయితే ఇక్కడ ఇంధన ధరను వాహనదారుడే చెల్లించాల్సి ఉంటుందనే విషయం మరిచిపోకూడదు.
- వాహనం టైరు పంక్చర్ అయితే పెట్రోలింగ్ సిబ్బంది వచ్చి టైరు బిగించడానికి సాయం చేస్తారు.
సేవలు పూర్తిగా ఉచితం :
టోల్‌ఫ్రీ నంబరు 1033కి కాల్ చేస్తే దేశంలోని ఏ జాతీయ రహదారిపై ప్రయాణించిన ఈ సేవలన్నీ ఉచితంగానే అందుతాయి. వాహనదారుడు ఫోన్ చేసిన 20-25 నిమిషాల్లోపే ఘటనా స్థలానికి పెట్రోలింగ్, రెస్క్యూ సిబ్బంది చేరుకుంటారు. ఈ టోల్ ఫ్రీ నంబరును దిల్లీలోని ఎన్హెచ్ఏఐ నుంచి పర్యవేస్తిస్తోంది. నేషనల్ హైవేపై ఏదైనా జరిగితే ఫోన్ కాల్ వచ్చిన వెంటనే హైవే నంబరు, లొకేషన్ వారు అడుగుతారు. వారికి కాల్ చేయగానే ముందుగా పెట్రోలింగ్ సిబ్బందికి కాల్ చేసి సమాచారం అందిస్తారు. అక్కడ వారు స్పందించకపోతే ప్రాజెక్టు మేనేజర్‌కి, అతడు కూడా స్పందించకపోతే ప్రాజెక్టు డైరెక్టర్‌కు ఫోన్ చేస్తూనే ఉంటారు.
సమస్య తీరిన తర్వాత వారికి కాల్ చేసి సమాచారం సేకరణ :
ఇలా పెట్రోలింగ్ సిబ్బంది లేదా అక్కడికి వెళ్లిన ప్రాజెక్టు అధికారులు సమస్య పరిష్కారం అయిన తర్వాత కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి తెలుపుతారు. మరల 1033 నంబర్ నుంచి వాహనదారుడికి ఫోన్ చేసి సమస్య పరిష్కారం అయిందా లేదా ఎవరైనా డబ్బులు అడిగారా? మీరు ఇచ్చారా అని ఆరీ తీస్తారు.
ఈ ఉచిత సేవలపై వాహనదారులకు అవగాహన కలిగేలా ప్రతి జాతీయ రహదారిపై ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక బోర్డును ఎన్హెచ్ఏఐ ఏర్పాటు చేసింది. తెలుగు, ఇంగ్లీష్‌లో ఏర్పాటు చేసిన 1033 బోర్డులు డివైడర్ మధ్యలో రోడ్డు పక్కనే ఉంటాయి. దీనిపై వాహనదారుల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కూడా ఇది దోహదం చేస్తుంది.
COMMENTS