HOW TO ESCAPE FROM FIRE ACCIDENT
అగ్ని ప్రమాదం జరిగినప్పుడు పొగ ఉంటే బయపడకండి - ఈ టిప్స్ పాటించి సురక్షితంగా బయటపడండి.
17మందిని బలిగొన్న గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం - తప్పించుకోవడం తెలియకనే మృతి - ఈ నేపథ్యంలో ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా తప్పించుకోవాలో అన్నదానిపై ప్రత్యేక కథనం
How to Escape From Fire Accident : ఇటీవల హైదరాబాద్‌లోని గుల్జార్ హౌస్ ప్రాంతంలోని భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోవటం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మంటలు వ్యాపించినప్పుడు ఏం చేయాలో తెలియక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కథనం.
ఇంట్లో అంతా పొగ ఉంటే :
- బట్టలకు మంటలు అంటుకుంటే పరుగెత్తకూడదు. ముఖాన్ని అరచేతులతో కప్పివేసి నేలపై పడుకుని దొర్లాలి. లేదంటే దుప్పటిని చుట్టుకోవాలి.
- నూనె ఉన్న ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే దాన్ని మూతతో కప్పేయాలి. గోధుమ పిండి, వంట సోడాను పైన కుమ్మరించాలి.
- బయటకు వెళ్లే దారి పొగతో ఉంటే, భద్రమైన గదిలోకి వెళ్లి తలుపులు మూసుకోవాలి.
- తలుపు సందు నుంచి పొగ రాకుండా బట్టలను అడ్డు పెట్టాలి.
- బయటకు రావడానికి ముక్కుకు తడి గుడ్డ చుట్టుకుని నేల మీద పాకుతూ వెళ్లాలి.
ప్రమాదంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
ఇరుకైన సందుల్లో, అగ్నిమాపక వాహనాలు వెళ్లలేని విధంగా బిల్డింగులు నిర్మించొద్దు. భవనాల్లో వాడే విద్యుత్తు తీగలను తరచూగా ఎలక్ట్రిషియన్‌తో తనిఖీ చేయిస్తుండాలి. తీగలు దెబ్బతింటే మార్చాలి. అవసరమైన మరమ్మతులు చేపట్టాలి.
అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే గుర్తించి హెచ్చరించే ఫైర్ అలారాన్ని ఏర్పాటు చేసుకోవాలి.
దుకాణాల్లోనే కాదు ఇళ్లలో కూడా అగ్ని మాపక పరికరాలు ఉంచుకోవాలి. అవి పనిచేసే విధానంపై అవాహన పెంచుకోవాలి. ఇందుకోసం అప్పుడప్పుడు వాడి చూడాలి.
ఇంధనం, వస్తువులు, పాత దుస్తులు, పేపర్లు, కలప, ప్లాస్టిక్ వస్తువులు తదితరాలను వీలైనంత వరకు వంట గదిలో ఉంచొద్దు. దూరంగా ఉంచాలి.
బయటకు వెళ్లే మార్గమిలా :
- అగ్నిప్రమాదం జరిగిన వెంటనే గ్రౌండ్ ఫ్లోర్‌కు వెళ్లడం ఉత్తమం.
- మెట్ల మార్గంలో కిందకి వెళ్లడమే సురక్షితం.
- ఇల్లు పొగతో నిండిపోతే నేలకు వీలైనంత దగ్గరగా ఉండి ఊపిరి పీలుస్తూ సమీపంలోని బయటకు వెళ్లే ద్వారం వద్దకు పాకుతూ వెళ్లాలి.
- గోడలకు అనుసరిస్తూ బయటకు వస్తే తప్పిపోకుండా, పడిపోకుండా కాపాడుకోగలుగుతారు.
- బిల్డింగ్ నుంచి బయటకు వెళ్లే మార్గాల మెట్లు, కారిడార్లు, వరండాలు, తలుపుల వద్ద సామగ్రి నిల్వ చేయొద్దు.
- బిల్డింగ్‌లోని టెర్రస్, ఇతర ప్రదేశాల్లోని ఫైర్ డోర్లను లాక్, బ్లాక్ చేయొద్దు.
- బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంటే బాల్కానీ, టెర్రస్ ఏరియాల్లోకి వెళ్లాలి.
COMMENTS