MIYAZAKI MANGOES GROWN IN JAGTIAL
మామిడి పండ్లు కిలో రూ.3 లక్షలు, ఎక్కడో కాదు మన జగిత్యాలలోనే
తెలంగాణలో మియాజాకి మామిడి తోటలు - జగిత్యాలలో ఖరీదైన మామిడి పెంచుతున్న ఇద్దరు రైతులు - మూడు సంవత్సరాల తర్వాత దిగుబడి.
Miyazaki Mangoes Grown in Jagtial : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మియాజాకి మామిడి జగిత్యాలలో కాతకు వచ్చింది. 1984లో మొట్టమొదట జపాన్‌లోని మియాజాకి ప్రాంతంలో పండించిన మామిడికి జపాన్‌తో పాటు కాలిఫోర్నియాలో మంచి డిమాండ్ ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో కిలో రూ. 2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ధర పలికిన మియాజాకి రకంపై పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఓ రైతు ఐదు సంవత్సరాల క్రితం 30 మొక్కలు నాటి విజయం సాధించగా, జగిత్యాల జిల్లాలోనూ పలువురు రైతులు మియాజాకి రకం మొక్కలు నాటడంతో సత్ఫలితాలు వస్తున్నాయి.
జగిత్యాల గ్రామీణ మండలం చల్‌గల్ నర్సరీలో యజమాని యూసుఫ్, వెల్గటూరు మండలం సంకెనపల్లి గ్రామానికి చెందిన జువ్వాడి సత్యనారాయణ రావు, మల్యాల మండలం రామన్నపేటకు చెందిన బండారి వేణుగోపాల్ రావు ప్రయోగాత్మకంగా మూడేళ్ల కిందట ఇతర ప్రాంతాల నుంచి మియాజాకి మామిడి మొక్కలు తెప్పించుకొని నాటారు. ఈ సంవత్సరం ఒక్కో మొక్కకు 3 నుంచి 4 కాయలు కాశాయి.
మరింత ముందుకు :
జపాన్‌లో మాదిరిగా కాయలు ఎరువు రంగులో నాణ్యతగా ఉండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో కాయ బరువు అరకిలో వరకు ఉండగా మిగతా మామిడికంటే విభిన్న రీతిలో రుచికరంగా ఉండడమే కాకుండా వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, ఏ, సీ, ఈ, కె, విటమిన్లు ఉండడంతో ఆరోగ్యానికి మంచిదని భావిస్తున్నారు. చల్‌గల్‌లో కాసిన మియాజాకి రకం మామిడి కాయలను జిల్లా ఉద్యాన అధికారి శ్యాంప్రసాద్ పరిశీలించారు. ఈ ప్రాంతంలోనూ మియాజాకి మామిడి కాస్తుండడంతో మరికొంత మంది రైతులు మొక్కలు నాటేందుకు ముందుకు వస్తున్నారని అధికారి తెలిపారు.
దిగుమతి చేయించుకుని మరీ :
మియాజాకి మామిడి పండ్లను ఖమ్మం పట్టణ రైతు కూడా పండిస్తున్నాడు. ఆయన కాలిఫోర్నియా నుంచి మధ్యవర్తుల ద్వారా ఈ మొక్కలను రూ.12వేలకు చొప్పున దిగుమతి చేయించుకున్నారు. 2020లో ఈ మొక్కలు నాటగా అవి ప్రస్తుతం ఫలాలను ఇస్తున్నాయి. ఈ మామిడి రకానికి నెల ముందు నుంచే పూత వస్తుంది. తరువాత ఏపీలోని కడియం నర్సరీ నుంచి 2ఏళ్ల కిందట మొక్కకు రూ.3,500 చొప్పున మరో 120 మొక్కలను కొనుగోలు చేశారు.
COMMENTS