HOW TO REDUCE FOOD WASTE
ఫంక్షన్లో ఫుడ్ మిగిలిపోయిందా - ఇలా చేసి వారి కడుపు నింపండి!
పెళ్లిళ్లు, ఇతర వివాహాది శుభకార్యాల్లో భారీగా ఆహార పదార్థాల వృథా - ముందస్తు ప్రణాళికతోనే ఆహార వృథాను అరికట్టవచ్చంటున్న నిపుణులు.
How To Control Food Waste In Functions : పేదింటి నుంచి ధనిక కుటుంబాల వరకు జరిగే పెళ్లిళ్లు, ఇతర వేడుకల్లో నాణ్యమైన, రుచికరమైన భోజనం వడ్డించాలనే తపన ఉంటుంది. విస్తరిలో పదుల రకాల ఆహార పదార్థాలు ఉండాలని చూస్తారు. ఇన్ని రుచికరమైన వంటకాలు వడ్డించే సమయంలో ఎంత ఆహారం వృథా అవుతుందో అనే విషయాన్ని మాత్రం గుర్తించడం లేదు. తీరా ఫంక్షన్ సందడి ముగిశాక ఇంత ఆహారం మిగిలిందా! అని బాధపడుతుంటారు. ముందస్తు ప్రణాళిక ఉంటే వేడుకల్లో ఆహార వృథాను అరికట్టవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
అన్నార్తులకు ఇద్దాం :
ఇటీవల హనుమకొండ నగరంలో ఓ కుటుంబం 200 మందిని విందు భోజనాలకు ఆహ్వానించింది. వడ్డనకు దాదాపు 20 రకాల పదార్థాలను ముందుంచారు. చివరకు 50 మంది తినే ఆహారమే మిగిలింది. ఈ ఆహారాన్ని ఆ ఫ్యామిలీ రైల్వే స్టేషన్ వంటి ప్రాంతాల్లో ఉండే పేదలకు పంపిణీ చేసింది. మనమూ ఇలా చేస్తే అవసరార్థుల ఆకలిని తీర్చిన వారమవుతాం.
డోర్నకల్‌లో ఈ మధ్య జరిగిన ఓ శుభకార్యంలో ఒక పెద్ద పాత్ర అన్నం, మరో పెద్ద పాత్ర సాంబారు మిగిలింది. ఈ మొత్తాన్ని వృథా చేయకుండా అన్నం ఫౌండేషన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థకు సమాచారం అందించగా, వారు ఆ ఆహారాన్ని తీసుకెళ్లి అవసరార్థులకు పంపిణీ చేశారు. మహబూబాబాద్‌లోనూ ఓ స్వచ్ఛంద సంస్థ (ఎన్జీవో) మిగులు ఆహారాన్ని అనాథ ఆశ్రమాలకు అందించింది.
వీరి సాయం తీసుకోండి :
రాందేని శ్రీనివాస్, ధనలక్ష్మి దంపతులు గురుదక్షిణ నిత్యాన్నదాన సొసైటీని ఏర్పాటు చేసి ఐదు సంవత్సరాలుగా వరంగల్, హనుమకొండ, కాజీపేట రైల్వే, బస్టాండ్లు, ఫుట్‌పాత్‌లపై ఉండే అనాథలు, మానసిక ఇబ్బందులతో ఉన్నవారికి అన్నదానాన్ని చేస్తున్నారు. సంప్రదించాల్సిన నంబర్ : 73828 73955
మహబూబాబాద్, ఖమ్మం జిల్లా సరిహద్దులో ఉన్న గ్రామాల వారు ఆహారం మిగిలితే అన్నం ఫౌండేషన్ నంబరు 94910 88522కు సంప్రదించవచ్చని ఫౌండేషన్ వ్యవస్థాపకులు అన్నం శ్రీనివాస్ వివరించారు.
ఆహార వృథా లెక్కలివీ :
కేంద్ర వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం దేశంలో ఏటా వృథాగా పారేస్తున్న ఆహారం విలువ రూ.50 వేల కోట్లు.
ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) సంస్థ గణాంకాల ప్రకారం మన దేశంలో ఆహార ఉత్పత్తుల్లో ఇళ్లల్లో 61, హోటళ్లలో 26, వివాహాది వేడుకల్లో 13 శాతం వృథా అవుతోందని తేలింది.
వరంగల్ నగర పాలక సంస్థ రోజువారీ సేకరిస్తున్న చెత్తలో 35 టన్నులు ఆహార వ్యర్థాలుంటున్నాయి.
ఇలా చేద్దాం : వేడుకలకు బంధుమిత్రులను 1000 మందిని ఆహ్వానిస్తే వంటకు ఉపక్రమించడానికి ముందు వాతావరణ పరిస్థితులు, ఆ రోజుండే వేడుకలు, బంధుమిత్రుల ఇళ్లలో శుభకార్యాలు అంచనా వేసుకొవడం ద్వారా ఆహార తయారీని తగ్గించుకోవచ్చు.
కిలో బియ్యం సుమారు తొమ్మిది మందికి సరిపోతుంది. విస్తరిలో నాలుగైదు మించి కూరలు, స్వీట్లు, బజ్జీలు, గారెలు వంటివి ఉంటే అన్నం తినడం కనీసం 25 శాతం తగ్గుతుందనేది వంట నిపుణుల చెబుతున్న మాట. కూరగాయల కొనుగోలునూ కూడా తగ్గించుకోవచ్చు. అలా వెయ్యి మంది వేడుకలో రూ.50వేలు ఆదా చేయవచ్చని వారు చెబుతున్నారు.
"15 ఏళ్ల క్రితం గురుపౌర్ణమి రోజు అనాథలకు ఆహారం పంపిణీతో నా ఈ అన్నదాన సేవ మొదలైంది. సాయి అమృతహస్తం పేరుతో మిత్రులు పోలా మహేష్, ఎరుకుల్ల నాగేశ్వర్‌రావు, పబ్బ కిషోర్, వేముల శ్రీనివాస్‌తో కలిసి కల్యాణమండపాలు, ఫంక్షన్ హాళ్లు, హోటళ్లు, క్యాటరింగ్ సర్వీసు సెంటర్లలో మిగిలిన ఆహారాన్ని మాకు అందించేలా చేస్తున్నాం. నెలలో 4 సార్లు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో పంపిణీ చేస్తున్నాం.
మమ్మల్ని సంప్రదించాల్సిన నంబరు : 98853 51277" - ఆరుట్ల శ్రీనివాస్, సాయి అమృతహస్తం సంస్థ, వరంగల్
COMMENTS