CONSUMPTION OF COOKING OIL
ఒక కుటుంబం నెలకు ఎంత నూనె వాడాలో తెలుసా? - బీపీ, హార్ట్ అటాక్ అందుకేనట!
ఈ మధ్య విచ్చలవిడిగా పెరుగుతున్నవంట నూనె వినియోగం - మోతాదుకు మించి నూనెను తీసుకుంటే అధిక రక్తపోటు, గుండెజబ్బులు - వంటలో నూనె ఎంతవాడాలి? ఎలా వాడాలి? అనే వివరాలు మీకోసం
Excessive Oil Consumption Is Dangerous To Health : మన వంటకాల్లో నూనె వాడకం ఎక్కువగానే ఉంటోంది. అతిగా నూనె వినియోగం ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదని పలువురు వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అసలు నిబంధనల ప్రకారం వంటనూనెను నెలకు, ఏడాది కాలానికి ఎంత మోతాదులో వాడాలి? ఎలా వాడాలి? అనే వివరాలు మీకోసం ఈటీవీ భారత్ అందిస్తోంది.
అధిక రక్తపోటు, గుండెజబ్బులు :
వంటల్లో నూనె ఎక్కువగా వాడితే మొదటగా రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే అవకాశం ఉంటుంది. దీంతో అధిక రక్తపోటు, గుండెజబ్బులకు దారితీస్తుంది. అందుకే నూనెను ఆచితూచి లెక్క కట్టి వాడాలి. వంటల్లో నూనె వాడకపోవటం ఈ కాలంలో సాధ్యం కాని విషయం. చేపలు, కొవ్వులో కరిగే ఏ, డీ, ఈ కే వంటి విటమిన్లను శరీరం గ్రహించుకోవటానికి నూనె చాలా అవసరం. శారీరక శ్రమకు కావాల్సిన శక్తిని నూనె అందిస్తుంది.
రిఫైన్ చేసేటప్పుడు :
గింజలను ఒత్తిడికి గురిచేసి తీసే కోల్డ్ ప్రెస్డ్ నూనెలో ఎలాంటి రసాయనాలు కలిసే అవకాశం ఉండదు. సహజ రుచి కూడా అలాగే ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లూ ఇందులో ఉంటాయి. ఆయిల్ రిఫైన్ చేసేటప్పుడు ప్రమాదకర రసాయనాలు తొలగిపోతాయి. ఉదాహరణకు ఫంగస్‌తో కలుషితమైన వేరుశనగ గింజల్లో అఫ్లటాక్సిన్ అనే విషపూరితమైన పదార్థం ఉండొచ్చు. ఇలా రకరకాల రసాయనాలు తొలగిపోతాయి.
3 నుంచి 5 చెంచాలే :
ఒక దాంట్లో మరో రకం నూనె కలిపి వాడటం మంచిదేనట. కొంత ప్రెస్డ్ నూనెకు నువ్వులు, వేరుశనగ, తవుడు, ఆవ నూనె వంటివి కలిపి వాడుకోవచ్చు. ఒక వ్యక్తి రోజుకు 3 నుంచి 5 చెంచాల మోతాదు కన్నా ఎక్కువ నూనెను తీసుకోకూడదు. సరిగ్గా చెప్పాలంటే నెలకు అరలీటరు మాత్రమే. ఇక కుటుంబం విషయానికొస్తే అందులో నలుగురు సభ్యులుంటే నెలకు 2 లీటర్ల కన్నా ఎక్కువ నూనె వినియోగించకుండా చూసుకోవడం ఉత్తమం. ఈ ప్రకారం ఒక నలుగురు సభ్యులున్న కుటుంబం ఏడాదికి 24 లీటర్ల నూనె మాత్రమే వాడాలి. అంతకుమించి వాడితే కొలెస్ట్రాల్ సంబంధింత రోగాలు రావడం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
COMMENTS