AADHAR CARD DATE OF BIRTH UPDATE
ఆధార్ కార్డులో పుట్టిన తేదీ మార్చాలా? టెన్త్, బర్త్ సర్టిఫికెట్లు లేకున్నా ఇలా ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు!
టెన్త్, బర్త్ సర్టిఫికెట్లు లేకున్నా మార్చుకోవచ్చు- ఆధార్ కార్డులో పుట్టిన తేదీ మార్పు ఇలా
Aadhar Card Date Of Birth Update : ఆధార్ కార్డు ప్రతీ భారతీయుడికి అత్యంత ముఖ్యమైనది. బ్యాంకు పనైనా, ప్రభుత్వ పథకానికి, ఉద్యోగానికి దరఖాస్తు చేయాలన్నా, ఇంకా అనేక విషయాలకు ఆధార్ ప్రామాణిక పత్రం. వ్యక్తిగత వివరాల ధ్రువీకరణ కోసం ఇది చాలాచోట్ల ఉపయోగపడుతుంది. అందుకే ఆధార్ కార్డులో సరైన సమాచారం ఉండేలా జాగ్రత్తపడాలి. ఒకవేళ ఆధార్ కార్డులో ఏదైనా తప్పుడు సమాచారం ఉంటే వెంటనే సరి చేయించుకోవాలి. దీనివల్ల ఎలాంటి సమస్యలూ ఎదురుకాకుండా చూసుకోవచ్చు. ఈ క్రమంలోనే ఆధార్ కార్డులో పుట్టిన తేదీ తప్పుగా ఉంటే ఏం చేయాలి? అనే సందేహం ఎంతోమందికి వస్తుంటుంది. అయితే, ఇలాంటి వారు జనన ధ్రువీకరణ పత్రం, పదోతరగతి మార్కుల షీట్‌లను సమర్పించి పుట్టిన తేదీ వివరాలను ఆధార్ కార్డులో సరిచేయించుకోవచ్చు. కానీ, ఈ రెండు పత్రాలూ లేని వాళ్లు ఏం చేయాలి? అయితే, ఇలాంటి వారు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా వివరాలను సరి చేసుకోవచ్చు అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఆధార్ కార్డులో పుట్టిన తేదీని ఎక్కడ మారుస్తారు?
ఆధార్ కార్డుల నిర్వహణకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ యూనిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI). ఇందులోకి వెళ్లి, సెల్ఫ్ సర్వీస్ అప్‌డేట్ పోర్టల్ ద్వారా మన పుట్టిన తేదీ వివరాలను మార్చుకోవచ్చు. ఈక్రమంలో పుట్టిన తేదీ సమాచారాన్ని అధికారికంగా ధ్రువీకరించే ఒక సర్టిఫికెట్‌ను అప్‌లోడ్ చేయాలి. UIDAI వెబ్‌సైట్‌లో ఇదంతా సొంతంగా చేసుకోవడం గజిబిజిగా అనిపిస్తే సమీపంలోని మీ సేవా కేంద్రానికి లేదా ఆధార్ కేంద్రానికి వెళ్లి పుట్టిన తేదీని మార్చుకోవచ్చు. సమీపంలోని పోస్టాఫీసులోనూ దీనికి సంబంధించిన సేవను మీరు పొందొచ్చు.
పత్రాలు లేకుండా ఆధార్ కార్డులో పుట్టిన తేదీని ఎలా మార్చాలి?
ఆధార్ కార్డులో పుట్టిన తేదీ వివరాలను మార్చడానికి సాధారణంగా జనన ధ్రువీకరణ పత్రం, హైస్కూల్ లేదా ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లను సమర్పించాలి. ఒకవేళ ఈ పత్రాలు లేకుంటే మెడికల్ సర్టిఫికెట్‌ను పొందడం ద్వారా పుట్టిన తేదీని మార్చుకోవచ్చు. చెల్లుబాటు అయ్యే ఇతరత్రా డాక్యుమెంట్స్‌ను కూడా ఇందుకు వాడుకోవచ్చు. ఇందుకోసం ఓటరు గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్, పాన్ కార్డులను కూడా ఉపయోగించొచ్చు. వీటిలో ఏదైనా ఒకటి సమర్పిస్తే సరిపోతుంది. ఈ డాక్యుమెంట్లలో సరైన పుట్టిన తేదీ ఉంటే వాటి ప్రకారం ఆధార్ కార్డులో పుట్టిన తేదీ సమాచారాన్ని సవరిస్తారు.
COMMENTS