REVENUE ACCOUNT FOR VILLAGE
ఇకపై ప్రతి గ్రామానికీ ఓ 'విలేజ్ అకౌంట్' - అన్ని భూముల వివరాలు ఒకేచోట పదిలం
కొత్త చట్టం భూభారతిలో కొత్త నిబంధన - గ్రామానికో రెవెన్యూ ఖాతా - నిబంధన తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
Revenue Account for Village : ప్రతి రైతుకు ఒక భూమి ఖాతా ఉన్నట్లే, ప్రతి వ్యక్తికి ఒక ఆధార్ ఉన్నట్లే, ఇకపై ప్రతి గ్రామానికో రెవెన్యూ ఖాతా (విలేజ్ అకౌంట్) నిర్వహించేలా ప్రభుత్వం కొత్త చట్టం భూ భారతిలో నిబంధన తీసుకొచ్చింది. ధరణికి ముందు 32 కాలమ్‌లతో పహాణీ నిర్వహణ ఉండేది. ఆ తర్వాత ఆర్వోఆర్-2020తో అది కాస్త రద్దయ్యింది. రద్దు చేసిన తర్వాత ఒకే కాలమ్‌తో పహాణీ ఏర్పాటు చేశారు. చేతిరాతతో రాసే దస్త్రాలకు బదులు అన్నీ ఆన్లైన్ చేసేశారు. దీంతో ముద్రణ ప్రతులు అందుబాటులో లేవు. తాజాగా ప్రతి గ్రామానికి ఒక ఖాతా ఉండేలా ఆర్వోఆర్-2025 చట్టం వీలు కల్పిస్తోంది.
ఈ చట్టం వల్ల గ్రామంలోని అన్ని రకాల భూముల వివరాలు ఒకేచోట పదిలం కానున్నాయి. గ్రామ ఖాతాను నిర్వహించేందుకు వచ్చే నెలలో గ్రామ పరిపాలన అధికారులను రాష్ట్ర ప్రభుత్వం నియమించనుంది. 2014కు పూర్వం గ్రామాల్లో రెవెన్యూ శాఖ ఏటా జమాబందీ నిర్వహించేది. రెవెన్యూ, నీటి పారుదల, వ్యవసాయ శాఖల సిబ్బంది ఏడాదికోమారు గ్రామంలోని వ్యవసాయ భూముల వివరాలను అందులో నమోదు చేస్తారు. అలాగే ఆ ఏడాది చోటు చేసుకున్న అన్ని రకాల మార్పులు, చేర్పులను కూడా ఇందులో నమోదు చేసేవారు. వీఆర్వో, వీఆర్ఏలు నమోదు చేసిన మార్పులను పహాణీల్లోని సమాచారంతో పోల్చి తహసీల్దార్ కార్యాలయానికి నివేదించేవారు. ఆ సమాచారాన్ని రెవెన్యూ మాతృ రికార్డు-1బిలో నమోదు చేసేవారు. కానీ 2014 తర్వాత జమాబందీ, పహాణీ నమోదు తదితర ప్రక్రియలు నిలిచిపోయాయి.
రెండింట వివరాలు నమోదు :
కొత్త చట్టంలోని సెక్షన్ 13(12) ద్వారా గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణకు వీలు కల్పించింది. దీని ప్రకారం గ్రామ పహాణీ, ప్రభుత్వ భూముల రిజిస్టర్, మార్పుల రిజిస్టర్, నీటి వనరుల రిజిస్టర్లను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. అలాగే ఆర్‌వోఆర్‌లోని వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయనున్నారు. సాగు భూముల రిజిస్ట్రేషన్‌తో పాటు మ్యుటేషన్ జరిగిన ప్రతిసారి ఆన్లైన్ గ్రామ రికార్డుల్లోనూ మార్పులు జరుగుతాయి. ఈ వివరాలన్నింటినీ ఏటా డిసెంబరు 31న ముద్రిస్తారు. ఆన్లైన్లోనే కాకుండా ముద్రిత దస్త్రాలు కూడా అందుబాటులో ఉండనున్నాయి.
చెరువులు మాయం కాకుండా ఉండేందుకు రిజిస్టర్ :
రాష్ట్రంలో చెరువులు, కుంటలకు చెందిన భూములు ఎలాంటి కబ్జాకు గురికాకుండా ఉండేందుకు ఏటా ఒక రిజిస్టర్‌ను నిర్వహిస్తారు. అందులో విస్తీర్ణం, ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ ప్రాంతాలు, ఆయకట్టు, సాగునీటి కాలువలు, చెరువులు లేదా కుంటలోకి నీటిని తెచ్చే పాటు కాలువల వివరాలనూ నమోదు చేస్తారు. ఆన్‌లైన్‌లోనూ ఈ వివరాలు అందుబాటులో ఉంటాయి. దీనివల్ల కబ్జా జరిగితే పాత రికార్డుల ఆధారంగా చర్యలు తీసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
COMMENTS