POST OFFICE INSURANCE PLAN
అతి తక్కువ ప్రీమియంతో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ - కుటుంబ సభ్యులందరికీ వర్తింపు!
తపాలా శాఖ ఆరోగ్య బీమా పథకాలు - అన్ని వర్గాలకు అందుబాటులో ప్లాన్ - కుటుంబ సభ్యులందరికీ వర్తింపు - వివరాలిలా..
Post Office Health Insurance Plans in Telugu : రహదారి ప్రమాదంలో తీవ్రంగా గాయపడి లేదా అనారోగ్య సమస్యలతో ప్రైవేటు హాస్పిటళ్లకు వెళ్తే జేబులు ఖాళీ అవ్వడం ఖాయం. పలు ప్రైవేటు ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నప్పటికీ ప్రీమియం ఎక్కువగా ఉండటంతో ప్రజాధరణ పొందలేక పోతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా తపాలా శాఖ ఆరోగ్య బీమా పథకాలను ప్రవేశపెడుతోంది. తక్కువ ప్రీమియంతో ఆదిత్యబిర్లా, నివా, తదితర సంస్థల సహకారంతో పథకాలు అందుబాటులో ఉన్నాయి.
దంపతుల్లో ఒక్కరు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్‌కు అర్హులు అయితే :
ఈ పథకంలో చేరేందుకు 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు అర్హులు. రూ.లక్ష నుంచి రూ.50 లక్షల వరకు పొదుపు చేసుకోవడంతో పాటు ప్రమాద బీమా పొందవచ్చు. రూ.20 లక్షలకు పైగా చేస్తే మాత్రం వైద్య పరీక్షల నివేదికలు జత చేయాలి. పాలసీని బట్టి ప్రీమియం ఉంటుంది. ఉదాహరణకు రూ.10 లక్షలు పొదుపు చేసుకునేలా ఈ పథకంలో చేరితే రూ.10 లక్షల ప్రమాద బీమాతో పాటు పట్టణ ప్రాంతాల్లో రూ.52 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.42 వేలు బోనస్ చెల్లిస్తారు. దంపతుల్లో ఒక్కరు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్‌కు అర్హులు అయితే జీవిత భాగస్వామికి సైతం పథకం వర్తిస్తుంది.
ఎన్నో ఉపయోగాలు :
ఆదిత్య బిర్లా సహకారంతో గ్రూప్, పర్సనల్ విభాగాల్లో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ 18 నుంచి 65 సంవత్సరాల వారికి వర్తిస్తోంది. ఈ పథకంలో రూ.549 ప్రీమియంతో రూ.10 లక్షలు, రూ.749తో రూ.15 లక్షల పాలసీ తీసుకోవచ్చు. ఏదైనా ప్రమాదంలో చనిపోయిన, శాశ్వత వైకల్యం, అంగవైకల్యానికి పూర్తి ఇన్సూరెన్స్ చెల్లిస్తారు. వైద్య ఖర్చులకు రూ.30 వేల నుంచి రూ.60 వేల వరకు, విరిగిన ఎముకల చికిత్సకు రూ.లక్ష వరకు ఇస్తారు. పాలసీదారుడు ప్రమాదవశాత్తు చనిపోతే ఇద్దరు పిల్లలకు గరిష్ఠంగా రూ.లక్ష వరకు వర్తింపజేస్తారు.
కుటుంబ సభ్యులందరికీ వర్తింపు :
కుటుంబ సభ్యులందరికీ ప్రయోజనకరంగా ఉండేలా నివా హెల్త్ ఇన్సూరెన్సు సహకారంతో బూపా హెల్త్‌ప్లస్ ప్లాన్‌ను తపాలా శాఖ ప్రవేశపెట్టింది. రూ.10 లక్షలు, రూ.15 లక్షల పాలసీలో కుటుంబంలో ఒక్కరికి రూ.899, ఇద్దరికి రూ.1399, దంపతులు.. ఒక సంతానానికి రూ.1799, ఇద్దరికి రూ.2,199 ప్రీమియం ఉంటుంది. రూ.2 లక్షల వరకు హాస్పటల్ బిల్లులు అయితే వినియోగదారులే భరించాలి. రూ.2 లక్షలకు పైగా ఖర్చులు తపాలా శాఖ చెల్లిస్తుంది. ప్రమాదవశాత్తు మృతి, పక్షవాతం, శాశ్వత వైకల్య, అవయవాలు కోల్పోతే రూ.15 లక్షల బీమా వర్తిస్తుంది. విద్య, పెళ్లి ప్రయోజనాలు ఉంటాయి. మృతి చెందితే అంత్యక్రియలకు రూ.5 వేలు ఇస్తారు. 18 నుంచి 60 సంవత్సరాలలోపు దంపతులు, 91 రోజుల నుంచి 21 సంవత్సరాల పిల్లలు ఈ పథకంలో చేరవచ్చు. 30 రోజుల అనంతరం నుంచి సంవత్సరంలోపు ప్రయోజనాలు వర్తిస్తాయి.
COMMENTS