ATS CENTERS IN TELANGANA
పది పాసైన వారికి టాటా గ్రూప్ సూపర్ ఛాన్స్ - ట్రైనింగ్‌తో పాటు జాబ్!
పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు పారిశ్రామిక శిక్షణ - రాష్ట్రంలో అధునాతన సాంకేతిక శిక్షణ కేంద్రాల ఏర్పాటు - శిక్షణ పూర్తయిన వెంటనే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు.
ATS Centers in Telangana by Tata Group : పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు వివిధ పరిశ్రమల్లో ఉపాధి కల్పించడానికి అవసరమైన పారిశ్రామిక శిక్షణ ఇస్తున్న ఐటీఐలు అధునాతన సాంకేతిక శిక్షణ కేంద్రాలుగా (ఏటీసీ)గా రూపొందుతున్నాయి. వీటికి టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థ నిధులు సమకూర్చుతోంది. అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన శిక్షణ అందిస్తున్న ఈ కేంద్రాల్లో శిక్షణ పూర్తయిన వెంటనే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభించేలా ఏటీసీల్లో సిలబస్ రూపొందించారు.
మారుతున్న కాలంలో సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. ఆధునికతను అందిపుచ్చుకునేందుకు యువత సిద్ధంగా ఉన్నా ప్రభుత్వ ఐటీఐ, కళాశాలల్లో ఇలాంటి వృత్తి విద్యా కోర్సులు అందుబాటులో లేవు. దీంతో వేలాది రూపాయలు ఖర్చు చేసి పట్టణాలకు వెళ్లి విద్యనభ్యసించాల్సిన పరిస్థితి ఏర్పుడుతుంది. ఇది పేద విద్యార్థులకు భారంగా మారింది. ఈ క్రమంలో కొత్త కోర్సుల్లో అవకాశం కల్పించడం మంచి పరిణామం.
నూతన భవన నిర్మాణం : ఆదిలాబాద్ జిల్లాలోని మందమర్రి, మంచిర్యాల, జన్నారం, శ్రీరాంపూర్, బెల్లంపల్లిలో ఏటీసీ కేంద్రాలు నిర్మిస్తున్నారు. మందమర్రి ప్రభుత్వ ఐటీఐ వెనకాల ఖాళీ స్థలంలో సర్కార్ భాగస్వామ్యంతో టాటా టెక్నాలజీ లిమిటెడ్ కంపెనీ రూ.4 కోట్లతో భవనాన్ని నిర్మించారు. దీంతో 74 సీట్లకు గాను పూర్తి స్థాయిలో విద్యార్థులు చేరారు. నూతన హంగులతో నిర్మించిన గదుల్లో ఆధునిక పద్ధతిలో తరగతులు చెప్తుండడంతో విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే సీట్లు మొత్తం భర్తీ కాగా ఈ ఏడాది కూడా చేరేందుకు ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్నారు.
కోర్సులు పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు : కోర్సులను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రతిభ ఆధారంగా టాటా, మహీంద్ర కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రణాళిక రూపొందించారు. ఏటీసీ భవన నిర్మాణంతో పాటు ఫర్నీచర్ కూడా టాటా కంపెనీ సమకూర్చింది.
COMMENTS