HOLIDAY HOME SAFETY TIPS
వేసవి సెలవులకు ఊరెళ్తున్నారా? - వాళ్లకు ఓ మాట చెబితే మీ ఇల్లు సేఫ్!
వేసవిలో చోరీలు ఎక్కువగా జరిగే అవకాశం - అప్రమత్తంగా లేకుంటే దొంగలు ఇంటిని ఖాళీ చేస్తారు జాగ్రత్త!
Holiday Home Safety Tips : సెలవుల కోసం ఫ్యామిలీలే కాదు, దొంగలు కూడా ఎదురు చూస్తుంటారు. సమ్మర్లో పిల్లలు, పెద్దలు కలిసి పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు, బంధువుల ఇళ్లకు వెళ్తే దొంగలు తాళాలు వేసిన ఇళ్లకు వస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా చోరీలు పెరిగిపోయాయి. ఏటా వేసవిలో పలుచోట్ల చోరీ కేసులు నమోదవుతుంటాయి. భారీ మొత్తంలో గోల్డ్, వెండి ఆభరణాలు, నగదు చోరీ చేస్తున్నారు. ప్రస్తుతం తులం గోల్డ్ ధర రూ.లక్ష దాటింది. పది తులాల బంగారం పోయిందంటే రూ.10 లక్షలు పోయినట్లే. అంత భారీ మొత్తం సంపాదించడానికి ఫ్యామిలీ మొత్తం కొన్నేళ్ల పాటు కష్టపడాల్సి ఉంటుంది. పిల్లల చదువులు, వివాహం కోసం దాచిన నగదు పోయినా, తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇంటి భద్రత విషయంలో తగిన జాగ్రత్తలను తీసుకోకపోవటం వల్లనే ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయి.
నిఘా నేత్రాలు కీలకం : పట్టణ ప్రాంతాల్లో ఇండ్ల యజమానులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం నిఘా నేత్రాలు ఏర్పాటు చేసేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఫలితంగా చోరీలు జరిగినా, ఆధారాలు లభించకపోవడంతో దర్యాప్తులో ఆలస్యమవుతోంది. రూ.వేలు ఖర్చు చేస్తే ఇళ్లకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంటి వద్దకు ఎవరెవరు వస్తున్నారనే విషయాన్ని ఫోన్‌లోనే చూసుకోవచ్చు. వీధుల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా కాలనీ కమిటీలు, స్థానిక దాతలు కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఇంటిపై పడుకుంటే : వేసవిలో ఎండ వేడిమి వల్ల ఉక్కపోత భరించలేని పరిస్థితి ఉంటుంది. చల్లగా గాలి వస్తుందని పల్లెలు, పట్టణాల్లో చాలా మంది ఇంటిపైన నిద్రిస్తుంటారు. మరికొందరు ఇంటి ఆవరణలో పడుకుంటారు. ఇలాంటి ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు.
లాకర్ సౌకర్యం ఉందిగా : విలువైన ఆభరణాలను ఇంట్లో పెట్టుకోకపోవడమే ఉత్తమం. దగ్గరలోని బ్యాంకు లాకర్లలో భద్రపరిస్తే నిశ్చింతగా ఉండొచ్చు. అవసరం ఉన్నప్పుడు ఆ ఆభరణాలను తెచ్చుకోవచ్చు. ఇందుకు బ్యాంకు ఆధారంగా ఛార్జీలు ఉంటాయి. అయితే అవి భరించలేనంత ఎక్కువ మాత్రం లేవు.
తాళం వేసి ఉంటే అంతే : ఊరికి వెళ్తూ ఇంటి గేటుకు లాక్ వేస్తే దొంగలు కన్నం వేయటం ఖాయం. గేటుకు లోపలి వైపు తాళం వేయడం మంచిది. ఇంటి ప్రధాన ద్వారానికి బయటకు కనిపించని తాళాలను ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి ముందు, ఇంటి లోపల లైట్లను వేసి ఉంచాలి. ద్వారం వద్ద చెప్పులను ఉంచాలి.
వీళ్లకు చెప్పి వెళ్లారంటే మీ ఇల్లు సేఫ్ : మీరు ఊరికి వెళ్లిన రోజుల్లో ఇంటి వద్ద పాల ప్యాకెట్లు, పేపర్ బాయ్స్‌కు రావద్దని చెప్పండి. న్యూస్ పేపర్ పోగుబడుతుంటే ఇంటి వాళ్లు లేరని దొంగలు గుర్తించే అవకాశముంది. ఊరికి వెళ్లినప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇస్తే పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తూ నిఘా పెడతారు.
COMMENTS