Artificial Intelligence: What do you need to add to AI?
Artificial Intelligence: ఏఐకి తోడుగా ఏమేం కావాలి?
కెరియర్ సక్సెస్‌కు సూచనలు:
కృత్రిమ మేధ (ఏఐ) మనం చదువుకునే తీరునూ, పని చేసే విధానాలనూ ఎంతగానో ప్రభావితం చేస్తోంది. ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం.. పని ప్రదేశాల్లో దాదాపు 15 శాతం టాస్కులను ఏఐ ఎటువంటి తప్పులకూ ఆస్కారం లేకుండా ఇప్పటికే చేయగలుగుతోంది. మరి ఇంతటి ప్రభావవంతమైన అంశాన్ని నేర్చుకోవాలంటే ఎప్పటికప్పుడు తాజా నైపుణ్యాలతో తయారుగా ఉండాలి. కేవలం సాంకేతికత తెలిస్తే సరిపోదు, దానికి తగిన విధమైన ఇతర నైపుణ్యాలూ అవసరం.
వీలైనంతవరకూ మార్పులను ఆకళింపు చేసుకోవడం, నైపుణ్యాలను అప్‌స్కిల్ చేసుకోవడం, కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడం ద్వారా వేగంగా మారుతున్న పరిస్థితులకు సిద్ధమవుతాం!
సృజనాత్మకత, నిర్ణయం, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వంటి వాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రత్యామ్నాయం కాదు. అందుకే ఏఐ టెక్నాలజీతోపాటుగా వీటినీ సాధన చేయాలి. అవేంటో నిపుణులు సూచిస్తున్నారిలా..
నిరంతరం నేర్చుకుంటూ ఉండటం:
ఏఐ ద్వారా వచ్చే ఆటోమేషన్.. వర్తమాన జాబ్‌మార్కెట్ను నిరంతరం మారుస్తూ ఉంది. పాత ఉద్యోగాల తీరు మారుతూ కొత్తవి తయారవుతున్నాయి. ఇటువంటి సమయంలో వెనకబడిపోకుండా ఉండాలంటే జీవిత పర్యంతం అభ్యాసం తప్పనిసరి. నేర్చుకోవడానికి విరామం ఇస్తే మన వెనుక ఉన్నవారు మనకంటే ముందు వెళ్లిపోయే ఆస్కారం ఉంది. కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటేనే.. కొత్త అవకాశాలు అందుకోగలం.
డేటా లిటరసీ- అనలిటికల్ స్కిల్స్:
ప్రస్తుతం మనం ఉన్నది డేటా ఆధారిత ప్రపంచం. ప్రతి నిర్ణయం, వ్యూహం, ఆవిష్కరణ వెనుక డేటా హస్తం ఉంటోంది. కానీ ఇప్పటికీ దాదాపు 43 శాతం మంది టెక్ లీడర్లు.. తమ టీమ్‌కు కావాల్సిన మేరకు డేటా నైపుణ్యాలు ఉండటం లేదని చెబుతున్నారు. అలాగే ఏఐ, మెషిన్ లెర్నింగ్‌లో కూడా వెనుకబడ్డారని అంటున్నారు. ఇలా అవ్వకుండా ఉండాలంటే డేటా లిటరసీ అవసరం. డేటాను కేవలం స్ప్రెడ్‌షీట్్సలో ఉంచడం కాకుండా దాన్నుంచి విలువైన ఇన్‌సైట్్స ఎలా తీసుకోవాలో తెలిసి ఉండాలి. విజువలైజేషన్ టూల్స్ ఉపయోగించడం, స్టాటిస్టికల్ అనాలిసిస్ చేయడం, డేటా చెప్పే విషయాలను గ్రహించడం ముఖ్యం. ఇది కేవలం డేటా సైంటిస్టులకే కాదు.. అందరికోసం. మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్‌ఆర్.. ఇలా ఏ విభాగానికి చెందినవారికైనా డేటా అవసరం. దీన్ని అర్థం చేసుకుంటే ఆవిష్కరణలు, నూతన ప్రక్రియలు.. ఇలా దేన్నయినా డేటా సహాయంతో కొత్త పుంతలు తొక్కించవచ్చు.
క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లం సాల్వింగ్:
డేటా ఎంట్రీ, షెడ్యూలింగ్, కొంతమేరకు కస్టమర్ సర్వీస్ వంటి వాటిని ఏఐ చేసేయగలదు. యంత్రాలు చేయలేని టాస్కులకు మనుషులు అవసరం అవుతారు. క్లిష్టమైన సమస్యలకు నూతన విధానంలో పరిష్కారాలు చూపించగలిగే సామర్థ్యాన్ని అలవరుచుకోవాలి. పాట్రన్స్, ట్రెండ్స్ వంటివాటిని ఏఐ గమనించగలదు కానీ.. నిర్ణయాలు తీసుకునేలా విశ్లేషణాత్మకంగా ఆలోచించలేదు. దీన్నే అభ్యర్థులు అలవరుచుకోవాలి. సమాచారాన్ని వివిధ కోణాల్లో పరిశీలించడం, తర్కంతో నిర్ణయం తీసుకోవడం తెలియాలి. కొత్తగా ఏదైనా మార్కెట్ వ్యూహాన్ని ఆలోచించినప్పుడు ఎదురయ్యే సవాళ్లకు మెరుగైన పరిష్కారాలు చూపగలిగేలా ఉండాలి.
ఎమోషనల్ ఇంటెలిజెన్స్:
సహానుభూతి (ఎంపథీ), ఎదుటివారు చెప్పేది మనసుపెట్టి వినడం, ఇబ్బందుల తొలగింపు.. వంటివి రానున్న కాలంలో ఉన్నతస్థాయిలో తమను తాము చూడాలనుకునే విద్యార్థులు అలవరుచుకోవాల్సిన లక్షణాలు. ఆత్మీయ సంబంధాలు కలిగి ఉండటం, సహచరులతో కలసి పనిచేయడం, క్లయింట్లు, స్టేక్ హోల్డర్‌తో మమేకం కావడం.. వీటన్నింటికీ ఈ లక్షణాలు అవసరం. పనిచేసే చోట కేవలం పని సంబంధిత నైపుణ్యాలే కాదు.. మానసికంగా దృఢంగా ఉండటమూ అవసరం.
ఎథికల్ అవేర్‌నెస్:
ఏఐ కేవలం ఉద్యోగాలనే కాదు, ప్రపంచం నడిచే తీరునూ మార్చనుంది. వ్యాపారాల్లో దీని వినియోగం అధికంగా పెరుగుతుండటం వల్ల.. ప్రొఫెషనల్స్‌కు డేటా ప్రైవసీ, ఆటోమెటేషన్ వంటి అంశాలపై అవగాహన ఉండాలి. ప్రస్తుతం వ్యాపారాలు స్థానిక మార్కెట్కు పరిమితం కాదు.. ఎంత చిన్నదైనా అది గ్లోబల్. విభిన్న సంస్కృతులను అర్థం చేసుకోవడం, నిబంధనలు - విపణి పరిస్థితులకు తగిన విధంగా నడుచుకోవడం అవసరం. గ్లోబల్ ఆలోచనాధోరణి అభివృద్ధి చేసుకోవడం ద్వారా దీన్ని సాధించవచ్చు.
ఏఐ సామర్థ్యాన్ని ఉపయోగించడం తెలియాలంటే.. అనుబంధంగా ఈ నైపుణ్యాలూ కావాలి! ఇవి భవితకు పునాది. ఏఐను ఉపయోగించుకుంటూ.. దాని ప్రభావాన్ని మించి ఎదిగేందుకు వీటిని సాధన చేయడం తప్పనిసరి.
ఏఐ మనకిచ్చే బలం.. బాధ్యతలతో కలిసి ఉంటుంది. టెక్నాలజీని వినియోగిస్తున్న విధానం.. ఎవరు ప్రభావితం అవుతున్నారు వంటి విషయాలన్నీ విస్తృతస్థాయిలో అర్థం చేసుకున్నప్పుడే.. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లగలం. ఏఐ దానికదే ఉద్యోగులను రీప్లేస్ చేయదు, కానీ దాన్ని తెలివిగా ఉపయోగించడం తెలిసిన ఉద్యోగులు ఆ పని చేయగలరు. ఏఐలో కానీ, మరే సాంకేతికతలో గానీ అప్‌డేటెడ్‌గా నిలబడాలంటే తగిన శిక్షణ అవసరం!
COMMENTS