Be careful with thunderstorms in rainy season- the effect is more on this animal- do you know why?
వర్షాకాలంలో పిడుగులతో జాగ్రత్త- ఈ జంతువుపైనే ఎఫెక్ట్ ఎక్కువే- ఎందుకో తెలుసా?
Thunder Lightning Effect On Giraffes : వర్షాలు కురిసే ముందు ఆకాశంలో ఉరుములు, మెరుపులు వస్తుంటాయి. ఇలాంటి కొన్ని సందర్భాలలో కొన్నిసార్లు పిడుగులు పడుతుంటాయి. అయితే మనుషుల కంటే జిరాఫీలు పిడుగుపాటుకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని మీకు తెలుసా? పిడుగు పాటు సమయంలో మనకంటే ఎక్కువ జంతువులే ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఎందుకంటే?
ప్రకృతి వైపరీత్యాలు నిత్యం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ముఖ్యంగా వర్షాలు పడే సమయంలో తల దాచుకోవడానికి ఏ చెట్టు కిందకో పరుగులు తీయడం అసంకల్పితంగా జరిగిపోతుంది. జంతువుల విషయంలో కూడా అలాగే జరుగుతుంది. మేఘాలలోని ధూళి కణాలలోని విద్యుదావేశాలు అంటే ఛార్జ్‌డ్ పార్టికల్స్ ఒకచోట పోగుపడతాయి. పాజిటివ్ ఛార్జ్ ఉన్న కణాలన్నీ మేఘం పై వైపునకు, నెగెటివ్ ఛార్జ్ ఉన్నవి కింది వైపునకు చేరుకుంటాయి. సైన్స్ ప్రకారం భిన్నమైన ఎలక్ట్రిక్ ఛార్జ్ ఉన్నవి రెండు మేఘాలు దగ్గరగా వచ్చినప్పుడు ఒకదానిని ఒకటి ఆకర్షించుకుంటాయి.
దీంతో మేఘంలోనే రెండు విద్యుదావేశాల మధ్యన లేదా రెండు మేఘాలలో ఉన్న వేర్వేరు విద్యుదావేశాల మధ్యన లేదంటే కొన్నిసార్లు మేఘానికి, భూమికి మధ్యన జరిగే ఘర్షణతో చాలా స్వల్ప వ్యవధిలోనే ఎక్కువ విద్యుచ్ఛక్తి వెలువడుతుంది. ఇదే మెరుపు. విపరీతమైన శక్తి పుట్టడం వల్ల వచ్చే పెద్ద శబ్దం ఉరుము. ఇక ఒక్కోసారి మేఘాల నుంచి ఆ విద్యుత్ భూమిలోకి కూడా ప్రవహిస్తుంది. అలా ప్రవహించే విద్యుచ్ఛక్తే పిడుగు. మెరుపుల వల్ల ఆ ఎలక్ట్రిక్ ఛార్జ్ భూమిలోకి ప్రవహించడం అన్నది ఒక్కోసారి పొడవాటి చెట్లు, పొడవైన స్తంభాల ద్వారా తేలిగ్గా జరిగిపోతుంది. అందుకే మెరుపులు మెరుస్తూ, ఉరుములు వినబడుతున్నప్పుడు చెట్ల కిందకి, పెద్ద స్తంభాల దగ్గరికి వెళ్లవద్దని పెద్దలు చెబుతుంటారు.
సింపుల్గా చెప్పాలంటే పొడవైన వస్తువులు, అలాగే తమ ద్వారా విద్యుత్ ప్రవాహాన్ని అంగీకరించేవి ఏవైనా పిడుగును చాలా త్వరగా స్వీకరిస్తాయి. అందుకే మిగతా జంతువుల కంటే జిరాఫీలు పిడుగుపాటుకు ఎక్కువగా గురవుతాయి. పిడుగుపాటు వల్ల మనుషుల కంటే జీరాఫీల మరణం 30 రేట్లు ఎక్కువ. ఇలాంటి సమయంలో జంతువులు గుంపులుగా బయట ఉండటం, అలాగే అవి కంచె దగ్గరలో ఉన్నప్పుడు కంచె ద్వారా విద్యుత్ ప్రవాహం జరిగి అవన్నీ గుంపుగా కూడా మరణించే అవకాశం ఉంది.
COMMENTS