Education Loan for Higher Education - Best Benefits Here!
ఉన్నత విద్య కోసం ఎడ్యుకేషన్ లోన్ - బెస్ట్ బెనిఫిట్స్ ఇవే!
Education Loan : ఉన్నత విద్య అభ్యసించాలంటే డబ్బులు తప్పనిసరిగా అవసరం. ఆర్థిక స్థోమత కలిగిన వారికి ఇది పెద్ద సమస్య కాదు. కానీ పేద, మధ్యతరగతి వర్గాల విద్యార్థులకు ఇదొక పెద్ద ఆటంకం. ఇలాంటి వారికి ఎడ్యుకేషన్ లోన్ చాలా ఉపయోగపడుతుంది. ఈ లోన్ తీసుకుంటే విద్యార్థుల ట్యూషన్ ఫీజు, జీవన వ్యయాలు, పుస్తకాలు, పరికరాలు, సహా ఇతర విద్యా సంబంధమైన ఖర్చులకు డబ్బు అందుబాటులోకి వస్తుంది. మన దేశంలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ప్రొఫెషనల్ కోర్సులు అభ్యసించే విద్యార్థుల కోసం విద్యా రుణాలను అందిస్తున్నారు.
పేరెంట్స్ తమ పిల్లల తరఫున బ్యాంకుల నుంచి ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకోవచ్చు. పార్ట్‌టైమ్ లేదా ఆన్‌లైన్ కోర్సులతో నైపుణ్యాన్ని పెంచుకోవాలని భావించే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా ఎడ్యుకేషన్ లోన్స్‌కు అప్లై చేయొచ్చు. ఈ లోన్‌కు అప్లై చేసిన వారికి తగిన అర్హత, ప్రమాణాలు లేకుంటే బలమైన ఆర్థిక నేపథ్యమున్న వ్యక్తి ద్వారా పూచీకత్తును ఇప్పించాల్సి ఉంటుంది. ఇతర లోన్లతో పోలిస్తే ఎడ్యుకేషన్ లోన్స్‌పై వడ్డీ రేటు తక్కువే. కేవలం 8.10 శాతం ప్రారంభ వడ్డీ రేటుతో కూడా కొన్ని ప్రముఖ బ్యాంకులు ఎడ్యుకేషన్ లోన్స్‌ను అందిస్తున్నాయి.
బంగారు భవిష్యత్తుకు బాటలు:
ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే విద్యార్థులకు పాఠ్యేతర కార్యకలాపాలు, వర్క్‌షాప్, ఇంటర్న్‌షిప్‌లు, సమావేశాల ద్వారా నైపుణ్యాభివృద్ధికి అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు కొన్ని కోర్సుల పట్ల ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఎడ్యుకేషన్ లోన్ పొందిన వారికి ఆయా కోర్సులు చేసే అవకాశం దక్కుతుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమేటిక్స్, ఆర్ట్స్ లేదా మరే ఇతర విభాగంలో డిగ్రీలను అభ్యసిస్తున్నా అవసరమైన ఆర్థిక సౌలభ్యాన్ని ఈ లోన్ అందిస్తుంది. నైపుణ్యాలను పెంచే ఇలాంటి యాక్టివిటీస్‌పై డబ్బును ఖర్చుపెడితే, సదరు విద్యార్థికి భవిష్యత్తులో కెరీర్‌పరమైన ప్రయోజనం చేకూరుతుంది. వృత్తిపరమైన నెట్‌వర్క్ ఏర్పడుతుంది. గ్రాడ్యుయేట్లు ఏదైనా జాబ్ చేస్తున్న సందర్భాల్లోనూ వారి విద్య, నైపుణ్యాభివృద్ధికి ఎడ్యుకేషన్ లోన్లు పొందొచ్చు. దీనివల్ల వారి అర్హతలు పెరుగుతాయి. భవిష్యత్తులో పెద్ద హోదాలకు చేరుకునేందుకు మార్గం సుగమం అవుతుంది.
గొప్ప క్రెడిట్ హిస్టరీకి పునాది:
ఎడ్యుకేషన్ లోన్‌ను సకాలంలో తిరిగి చెల్లిస్తే సదరు విద్యార్థి పేరిట చక్కటి క్రెడిట్ హిస్టరీ నిర్మాణం జరుగుతుంది. ఉన్నత విద్య పూర్తయ్యాక ఉద్యోగ కెరీర్ ప్రారంభం అవుతుంది. అదే సమయంలో లోన్ చెల్లింపులను మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ లోన్స్‌ను చాలా ఫ్లెక్సిబుల్‌గా రీపే చేయొచ్చు. చదువు పూర్తై ఉద్యోగ జీవితం ప్రారంభమయ్యాక వచ్చే సంపాదనతో లోన్‌ను కట్టొచ్చు. దీనివల్ల ఆర్థిక ఒత్తిడి లేకుండా జాబ్ కెరీర్‌పై ఫోకస్ పెట్టే వీలు కలుగుతుంది. అధిక ఆర్థిక సామర్థ్యం ఉన్నవాళ్లు ముందే లోన్‌ను చెల్లించేయొచ్చు. దీనివల్ల వడ్డీభారం చాలా వరకు తగ్గిపోతుంది. లోన్ సకాలంలో కడితే క్రెడిట్ హిస్టరీ చక్కగా ఉంటుంది. దీని ఆధారంగా భవిష్యత్తులో కారు లోన్, ఇంటి రుణం వంటివి తీసుకోవచ్చు. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80 ఈ ప్రకారం విద్యా రుణంపై వడ్డీకి పన్ను రాయితీ లభిస్తుంది.
COMMENTS