Ayushman Bharat insurance coverage increased to Rs.10 lakhs! Who is eligible?
ఆయుష్మాన్ భారత్ బీమా కవరేజీ రూ.10లక్షలకు పెంపు! ఇంతకీ అర్హులు ఎవరంటే?
Ayushman Bharat Scheme : ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా కవరేజీ డబుల్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పథకం కింద ఏయే ఆస్పత్రులలో చికిత్స పొందొచ్చు? ఆ స్కీమ్‌లో చేరాలంటే ఉండాలంటే ఉండాల్సిన అర్హతలు ఏంటి? ఈ స్కీమ్‌కు కేటాయించిన నిధులెన్ని? ఈ స్కీమ్ ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది? మొదలైన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుందాం.
ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం. దీనికి ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది. అర్హులైన లబ్దిదారులు ఒక్క పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందొచ్చు. అయితే ఒక కుటుంబానికి ఒక సంవత్సరానికి రూ.5 లక్షల వరకు పరిమితి ఉంటుంది. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ప్రతి సంవత్సరం దాదాపు 6 కోట్ల మంది భారతీయులు పేదరికంలోకి వెళ్లిపోకుండా వైద్య సాయం చేస్తోంది.
ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (PM-JAY) అంటే ఏమిటి?
ఆర్థికంగా వెనకబడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీపీఎంజేఏవై) పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కింద కేంద్రం, ఏటా ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల వరకు వైద్యం కోసం ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ స్కీమ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకం. ఈ పథకాన్ని 2008లో జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకం (NHPS) అని పిలిచేవారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం 2018లో ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎంజేఏవై)గా మార్చింది. ఈ పథకానికి నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూరుస్తాయి.
రూ.10 లక్షలకు పెంపు!
ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అంతేకాదు రానున్న కాలంలో ఈ పథకం కింద లబ్ధిపొందేవారి సంఖ్యను సైతం రెండింతలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిసింది. తొలుత 70 ఏళ్లు పైబడిన వారందరినీ ఈ పథకంలో భాగం చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు జులై 23వ తేదీన ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆయుష్మాన్ భారత్ పథకంపై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఖజానాపై ఏటా మరో రూ.12,076 కోట్ల భారం పడనున్నట్లు జాతీయ ఆరోగ్య సంస్థ అధికారులు వెల్లడించారు.
12 కోట్ల కుటుంబాలకు లబ్ది:
కేంద్ర ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (AB PMJAY)ను 12 కోట్ల కుటుంబాలకు విస్తరిస్తున్నట్లు తెలిపింది. దీని కోసం కేటాయింపులను రూ.7,200 కోట్లకు పెంచింది. మరో రూ.646 కోట్లు ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్‌కు కేటాయించింది. అలాగే ఆయుష్మాన్ భారత్ యోజనను 70 ఏళ్లు పైబడిన వారికి సైతం విస్తరిస్తున్నట్లు జూన్ 27న పార్లమెంట్ వేదికగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రకటించారు. అలా అయితే ఈ పథకంలో మరో 4-5 కోట్ల మంది చేరుతారని అంచనా వేస్తున్నారు. పీఎంజేఏవై కింద రూ.5 లక్షల పరిమితిని 2018లో విధించారు. దానిని ఈ ఏడాది నుంచి రూ.10 లక్షలకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
COMMENTS