Do you travel by trains often? Do you know about CC, EC, 3E, EA classes?
మీరు తరచూ రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటారా? మరి CC, EC, 3E, EA క్లాస్‌ల గురించి తెలుసా?
Travel Classes In Indian Trains : రైలు ప్రయాణం చేసేవారు, వాటిలోని తరగతుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా రైళ్లలో ప్రయాణించే వారికి ఏసీ, నాన్ ఏసీ క్లాసుల (ట్రావెల్ క్లాసుల) గురించి తెలిసే ఉంటుంది. ఏసీలో కూడా మళ్లీ వివిధ తరగతులు ఉంటాయి. ట్రైన్లో స్లీపర్ (SL), థర్డ్ ఏసీ (3A), సెకండ్ క్లాస్ ఏసీ (2A), ఫస్ట్ క్లాస్ ఏసీ (1A) ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే. అయితే ట్రైన్ టికెట్ బుక్ చేసేటప్పుడు CC, EC, 3E, EA లాంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇంతకీ ఈ కోడ్లు ఏ తరగతుల(ట్రావెల్ క్లాస్)ను సూచిస్తాయి? మొత్తంగా ట్రైన్లో ఎన్ని రకాల తరగతులు ఉంటాయి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఫస్ట్ ఏసీ (1A) : ఇండియన్ రైల్వేస్‌లో ఫస్ట్ క్లాస్ ఏసీ స్లీపర్‌ను 1Aగా పిలుస్తారు ఇందులో 4 లేదా 2 బెర్తులతో కూడిన కంపార్ట్మెంట్లు మాత్రమే ఉంటాయి. వీటిలో సైడ్ అప్పర్, సైడ్ లోయర్ బెర్తులు ఉండవు. 2 బెర్తులు ఉండే కంపార్ట్మెంట్ను 'కూప్' అని, 4 బెర్తులు ఉంటే, దానిని 'క్యాబిన్' అని అంటారు. ప్రయాణికులు తమ కంపార్ట్‌మెంట్‌కు లాక్ వేసుకోవచ్చు. ఒక్కో బోగీలో మొత్తంగా 18-24 బెర్తులు మాత్రమే ఉంటాయి. అయితే ఈ ఫస్ట్ క్లాస్ ఏసీ టికెట్ ఖరీదు ఇంచుమించు విమానం టికెట్ ధరకు సమానంగా ఉంటుంది. ఈ కోచ్‌లను H1, H2, HA1, HA2, HB1, HB2 లాంటి నంబర్లతో సూచిస్తారు.
సెకండ్ ఏసీ (2A) : సెకండ్ ఏసీని 'టూ-టైర్ ఏసీ' అని కూడా పిలుస్తారు. ఈ తరహా కోచ్‌లలో 45- 54 సీట్లు వరకు ఉంటాయి. ఒక్కో కంపార్ట్మెంట్లో 6 సీట్లు ఉంటాయి. దీనిలో మిడిల్ బెర్తులు ఉండవు. ఈ తరహా కోచ్‌లను A అక్షరంతో సూచిస్తారు. కోచ్ పొజిషన్ ఇచ్చేటప్పుడు A1, A2 అని పేర్కొంటారు.
థర్డ్ ఏసీ (3A) : భారతీయ రైల్వేలో మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే ఏసీ క్లాస్ ఇది. స్లీపర్ క్లాసులో ప్రయాణించలేని వారు ఎక్కువగా ఈ థర్డ్ ఏసీని ఎంచుకుంటారు. ఒక్కో కోచ్‌లో మొత్తం 64-72 బెర్తులు ఉంటాయి. ఈ కోచ్‌లను B అనే అక్షరంతో సూచిస్తారు.
థర్డ్ ఎకానమీ (3E) : ఇటీవలి కాలంలో కొన్ని రైళ్లలో 3E తరగతి కనిపిస్తోంది. థర్డ్ ఏసీ కంటే దీని టికెట్ ధర కాస్త తక్కువగా ఉంటుంది. ఈ తరహా కోచ్‌లలో 72-81 బెర్తులు ఉంటాయి. థర్డ్ ఏసీతో పోల్చినప్పుడు, వీటిలో సైడ్ మిడిల్ బెర్తు అదనంగా ఉంటుంది. గరీబ్‌రథ్ లాంటి రైళ్లలో ఈ తరహా కోచ్‌లు ఉంటాయి. ఈ కోచ్‌లను Mతో సూచిస్తారు.
స్లీపర్ క్లాస్ (SL) : సాధారణ ప్రజలు ఎక్కువగా స్లీపర్ కోచ్‌ల్లోనే ప్రయాణిస్తూ ఉంటారు. తక్కువ ఖర్చుతో దూర ప్రయాణం చేసే వారు ఈ స్లీపర్ క్లాస్‌ను ఎంచుకుంటూ ఉంటారు. ఇందులో 72-81 బెర్తులు ఉంటాయి. ఒక్కో కంపార్ట్మెంట్లో మొత్తం 8 బెర్తులు ఉంటాయి. ఈ కోచ్‌లను S అనే అక్షరంతో సూచిస్తారు. కొన్నిసార్లు రైలుకు అదనపు బోగీలను ఏర్పాటు చేసినప్పుడు SE పేరుతో నంబరింగ్ ఇస్తుంటారు.
ఎగ్జిక్యూటివ్ క్లాస్ (EC) : ఇది విమానాల్లో ఉండే బిజినెస్ క్లాస్‌ను పోలి ఉంటుంది. దీనిలో ఏసీతో కూడిన సీటింగ్ ఉంటుంది. కానీ స్లీపర్ బెర్తులు ఉండవు. వందేభారత్ రైళ్లలో ఈ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. ఈ కోచ్‌లను E అనే అక్షరంతో సూచిస్తారు.
ఎగ్జిక్యూటివ్ అనుభూతి క్లాస్ (EA) : శతాబ్ది లాంటి రైళ్లలో 'ఎగ్జిక్యూటివ్ అనుభూతి' క్లాస్‌లు ఉంటాయి. ఈ కోచ్‌లో ఏసీతో కూడిన 56 ఛైర్లు ఉంటాయి. సినిమాలు చూడడానికి, సంగీతాన్ని ఆస్వాదించేందుకు ఇందులో ఎల్సీడీ స్క్రీన్లు ఉంటాయి. హెడ్ఫోన్లు కూడా ఇస్తారు. ఈ కోచ్‌కు ఆటోమేటిక్ డోర్స్ ఉంటాయి. ఈ కోచ్‌లను K అనే అక్షరంతో సూచిస్తారు.
ఏసీ ఛైర్ కార్ (CC) : ఒకవైపు 3 వరుసలు, మరో వైపు 2 వరుసలతో కూడిన ఛైర్లు ఉంటాయి. పగటి పూట ప్రయాణించే రైళ్లలో ఈ కోచ్‌లు ఉంటాయి. ప్రస్తుతం వందే భారత్ ట్రైన్లలో ఉన్న కోచ్‌లు ఇవే. ఈ కోచ్‌లను C అనే అక్షరంతో సూచిస్తారు.
విస్టాడోమ్ (EV) : పర్యాటక ప్రాంతాలకు నడిపే రైళ్లలో విస్టాడోమ్ కోచ్‌లు ఉంటాయి. ప్రయాణికులు ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు వీలుగా ఈ కోచ్‌లలో అద్దాలతో కూడిన ఏర్పాటు ఉంటుంది. ఇందులోని నాన్ ఏసీ కోచ్‌లను DV అని, ఏసీ కోచ్‌లను EV అని పిలుస్తారు.
సెకండ్ సిట్టింగ్ (2S) : కొన్ని ట్రైన్లలో సెకండ్ సిట్టింగ్ (2S) క్లాసులు కూడా ఉంటాయి. అయితే వీటిల్లో కేవలం కూర్చొని మాత్రమే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వీటికి కూడా టికెట్లు రిజర్వేషన్ చేసుకోవచ్చు.
అన్రిజర్వ్డ్ కోచ్ (UR) : రైళ్లలో అన్రిజర్వ్డు కోచ్‌లు (UR) కూడా ఉంటాయి. వీటినే 'సెకండ్ క్లాస్' అని కూడా అంటారు. అయితే వీటికి ముందుస్తు రిజర్వేషన్ సౌకర్యం ఉండదు.
COMMENTS