Indian Railways: Online services in running train.. with the help of QR code..
Indian Railways: రన్నింగ్ ట్రైన్లో ఆన్‌లైన్ సేవలు.. క్యూఆర్ కోడ్ సాయంతో..
మన దేశంలోని అతి పెద్ద రవాణా వ్యవస్థ అయిన భారతీయ రైల్వే కొత్త పుంతలు తొక్కుతోంది. పూర్తి స్థాయిలో ఆధునికతను అందిపుచ్చుకుంటోంది. ఇప్పటికే వందే భారత్ రైళ్లతో కొత్త లుక్ ను తీసుకొచ్చిన ఇండియన్ రైల్వేస్.. పలు ఆన్ లైన్ సేవలను సైతం అందుబాటులోకి తెచ్చింది. ఐఆర్సీటీసీ ద్వారా టికెట్ బుకింగ్స్ ను ఆన్ లైన్ చేసేయగా.. రైళ్లలో ఉండే టీటీఈలు కూడా క్యూఆర్ కోడ్ సాయంతో బెర్త్ లు కేటాయించడం, నిబంధనలు పాటించని ప్రయాణికుల నుంచి ఫైన్లు వసూలు చేయడాన్ని ప్రారంభించింది. రైలు రన్నింగ్ లో ఉండగానే ఆన్ లైన్లోనే దీనిని నిర్వహించే విధంగా చర్యలు చేపడుతోంది. అందుకోసం హ్యాండ్ హెల్డ్ టెర్మినల్(హెచ్ హెచ్ టీ) మెషీన్లను తీసుకొచ్చింది. వీటిని టీటీఈలకు ఇవ్వడం ద్వారా జరిమానాలు ప్రయాణికుల నుంచి వసూలు చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
డిజిటల్ రికవరీ ఇలా..
రన్నింగ్ ట్రైన్లలో ఈ డిజిటల్ రికవరీ గురించి జోధ్‌పూర్ డివిజన్ సీనియర్ డీసీఎం వికాస్ ఖేడా మాట్లాడుతూ రైల్వే నిబంధనల ప్రకారం రైళ్లు, రైల్వే స్టేషన్‌లలో టీటీఈ ఆన్‌లైన్‌లో చెల్లింపులు జరపడానికి సంబంధించి మార్గదర్శకాలు వచ్చాయన్నారు. దాన్ని అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించినట్లు చెప్పారు. జోధ్‌పూర్ డివిజన్‌లో పనిచేస్తున్న సుమారు 300 మంది టీటీఈలకు పారదర్శకత తీసుకురావడానికి.. అలాగే టిక్కెట్ల తనిఖీని సులభతరం చేయడానికి హెచ్‌హెచ్‌టీ యంత్రాలను అందించినట్లు ఆయన చెప్పారు. దీంతో రైళ్లలో టికెట్ చెక్ చేసే పని ఇప్పుడు దీని ద్వారానే జరుగుతుందని వివరించారు.
క్యూఆర్ కోడ్ సాయంతో..
హెచ్‌హెచ్‌టీ మెషిన్ నుంచి పేమెంట్ తీసుకోవడం వల్ల టీటీఈ పని సులువుగా మారిందని సీనియర్ డీసీఎం చెప్పారు. ఆన్‌లైన్‌లో జరిమానాలు వసూలు చేయడం ద్వారా ఈ వ్యవస్థ పేపర్‌లెస్‌గా మారుతుందన్నారు. ప్రయాణికుల నుండి వసూలు చేసిన జరిమానా నేరుగా రైల్వే బుకింగ్‌లో లావాదేవీగా మార్పు సాధిస్తుంది. దీని పూర్తి రికార్డు టీటీఈ వద్ద ఉన్న హెచ్ హెచ్ టీ యంత్రంలో నిక్షిప్తమై ఉంటుంది. దీని వల్ల అటు ప్రయాణికులకు, టీటీఈకి కూడా పని సులువు అవుతుంది. కేవలం ఫైన్లు మాత్రమే కాక, సీట్ అవైలబులిటీ, బుకింగ్ కూడా దీని నుంచి చేసుకొనే వెసులుబాటు ఉందని చెబుతున్నారు. దీని ద్వారా టీటీఈ చేతివాటం ప్రదర్శించే అవకాశం ఉండదు. మొత్తం ఫైన్లు, రన్నింగ్ ట్రైన్లో చేసే లావాదేవీలన్నీ ఈ యంత్రాల సాయంతో రికార్డు అవుతాయి. ఆ సొమ్మంతా రైల్వే బోర్డునకు వెళ్తుంది. పూర్తి పారదర్శకంగా ఈ వ్యవహారం జరగడంతో రైల్వేకు లాభం జరుగుతుంది.
COMMENTS