World Savings Day 2023: Financial security with savings.. Future assurance.. Know the importance of World Savings Day!
World Savings Day 2023: పొదుపుతో ఆర్థిక భద్రత.. భవితకు భరోసా.. వరల్డ్ సేవింగ్స్ డే ప్రాముఖ్యత తెలుసుకోండి!
World Savings Day: ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 30న ప్రపంచ పొదుపు దినోత్సవాన్ని (World Thrift Day) నిర్వహిస్తారు. పొదుపు అవసరాన్ని చాటి చెప్పేందుకు, ప్రజలల్లో సేవింగ్స్‌ను ప్రోత్సహించడానికి ఈ రోజున విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం సేవింగ్స్‌పై ప్రజల్లో అవగాహన పెరిగిందని చెప్పవచ్చు. డబ్బు ఆదా చేయడం తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల నుంచి నేర్చుకుంటారు. మన దగ్గర ఉన్న వనరులను తెలివిగా, జాగ్రత్తగా, భవిష్యత్తు అవసరాల కోసం క్రమ పద్ధతిలో ఉపయోగించడాన్నే పొదుపు (Thrift) చేయడం అంటారు.
పొదుపు ఆలోచనను విస్తృతం చేయాలనే ఉద్ధేశంతో ఇటలీలో తొలిసారి సమావేశాలు నిర్వహించారు. ఆ దేశంలోని మిలన్‌లో 1924లో తొలి అంతర్జాతీయ సేవింగ్స్ కాంగ్రెస్ సమావేశాలు జరిగాయి. డబ్బు ఆదా చేయాలనే ఆలోచనను ప్రోత్సహించడానికి ప్రపంచ వ్యాప్తంగా పొదుపు దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని అప్పుడే నిర్ణయించారు. మారుతున్న పరిణామాలను గుర్తిస్తూ, అందుబాటులో ఉన్న వనరులను అవసరాల కోసం క్రమ పద్ధతిలో వాడుకోవాలనే ఉద్దేశంతో చేసిన ఈ ప్రకటనకు మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత తొలి ప్రపంచ పొదుపు దినోత్సవాన్ని 1925లో నిర్వహించారు. అయితే అంతకు ముందే.. 1921లోనే స్పెయిన్, అమెరికా వంటి దేశాల్లో జాతీయ స్థాయిలో సేవింగ్స్ డేని నిర్వహించారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత దీనికి మరింత ప్రాచుర్యం లభించింది. చాలా దేశాలలో సేవింగ్స్ డేను నిర్వహించుకోవడం ఒక సంప్రదాయంగా మారింది.
పొదుపు ప్రాముఖ్యతను గుర్తించాలి..
మారుతున్న పరిస్థితులు, విజృంభిస్తోన్న మహమ్మారుల, దేశాల మధ్య భౌగోళిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వరల్డ్ సేవింగ్స్ డే ఆలోచన, ఉద్దేశాలను ప్రజలు గుర్తించాలి. ప్రజల ఆర్థిక వనరులు ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉండవు. దీన్ని దృష్టిలో పెట్టుకొని డబ్బు ఆదా చేయడంతో పాటు పొదుపుపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలి. ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు పొదుపు విలువ చాటి చెప్పాలి. డబ్బు ఆదా చేసే ప్రాముఖ్యతపై పాఠశాల స్థాయి నుంచే బోధించాలి. చిన్న వయస్సులోనే పిల్లలకు డబ్బు దాచడం గురించి నేర్పితే, ఆ అలవాటు పెద్దయ్యాక ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఆర్థిక భద్రతకు భరోసా..
అంతర్జాతీయ పొదుపు దినోత్సవం అనేది కేవలం డబ్బు దాచడానికే పరిమితం కాదు. దేశ ఆర్థిక భద్రతను బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలపై ఈ రోజు ప్రత్యేకంగా దృష్టి పెడతారు. ప్రజలు డబ్బులు ఖర్చు చేయడంపై మరింత జాగ్రత్త వహించాలని, సరైన మార్గంలో పొదుపు చేయాలని బ్యాంకులు సైతం అవగాహన కల్పిస్తాయి. ఇందుకు ప్రజలకు అందుబాటులో ఉన్న పద్ధతులను, సేవింగ్స్ అకౌంట్ విలువ గురించి చాటి చెబుతాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వృద్ధిలో సేవింగ్స్ డే ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది.
COMMENTS