Success Story : Super woman who studied after marriage and won 15 gold medals..!
Success Story : పెళ్లయ్యాక చదివి 15 గోల్డ్ మెడల్స్ సాధించిన సూపర్ ఉమెన్..!
Success Story : పట్టుదల ఉంటే అనుకున్నది సాధించవచ్చు అని మరోసారి నిరూపించింది శ్రీవిద్య. ఓ పక్క అమ్మ, నాన్నల మరణం.. మరోపక్క ఫైనల్ ఎగ్జామ్స్.. పైగా చెల్లిలి బాధ్యత.. ఈ కష్టాలన్నింటినీ దాటుకుంటూ.. కుటుంబాన్ని పోషించుకుంటూ.. చెల్లికి పెళ్లి చేసి.. తర్వాత తను కూడా పెళ్లి చేసుకుని.. తల్లయ్యాక చదువు ప్రారంభించి 15 గోల్డ్ మెడల్స్ సాధించింది. గ్రేట్ కదా..!
శ్రీవిద్యది మైసూరు జిల్లాలోని కల్కుణికె గ్రామం. ఆమె తండ్రి స్వామి వంట పాత్రలను సైకిల్‌పై మోసుకెళ్లి పక్క ఊళ్లలో వాయిదా పద్ధతిలో అమ్మేవారు. దీంతోపాటు ఇంటివద్ద సైకిల్ రిపేర్ షాపునీ నిర్వహించేవారు. ఆర్థిక ఇబ్బందుల రీత్యా.. 10వతరగతి వరకు ప్రభుత్వ స్కూల్‌లోనే చదివింది. ఇంటర్‌లో మంచి కాలేజీలో చదవడం కోసం ఆమె కుటుంబం మకాం హుణసూరుకి మార్చారు. శ్రీవిద్యకు 10వతరగతిలో 90 శాతానికిపైగా మార్కులు రావటంతో నెలకు రూ.1000 స్టూడెంట్ స్కాలర్‌షిప్ వచ్చేది. ఇది ఆమెకు ఇంటర్ చదువులకు ఉపయోగపడింది.
అదే ఉత్సాహంతో మరింత బాగా చదివింది. రేపటి నుంచి ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షలు. ఇంతలోనే ఆమె తండ్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తండ్రి ఆసుపత్రిలో.. ఇల్లంతా దుఖంలో మునిగిపోయింది. ఆమెకేమో ఇంటర్ ఫస్ట్ ఎగ్జామ్. అమ్మ ఓదార్పుతో పరీక్షకు బయలుదేరి వెళ్లి పరీక్ష రాసింది. తిరిగి ఇంటికొచ్చే సరికి నాన్న చనిపోయాడన్న చేదు వార్త. అంత బాధలోనూ తల్లి ఓదార్చి పరీక్షలన్నీ రాయించింది. దుఃఖం ఆపుకోలేక ఏడుస్తూనే పరీక్షలు రాసి.. ఫలితాల్లో కాలేజీ టాపర్‌గా నిలిచింది. కూతుర్ని టాపర్‌గా చూడాలనే కోరిక తీరకుండానే తండ్రి మరణించాడనే బాధతో రోజంతా ఏడ్చింది.
మరోవైపు ఆర్థిక కష్టాలు:
ఇల్లు గడవాలంటే నాన్న పనే దిక్కు. పైగా అప్పులున్నాయి. దీంతో ఇంట్లోనే వాయిదా పద్ధతిలో వస్తువుల అమ్మకాలు కొనసాగించారు. కానీ తండ్రిపై దిగులుతో మంచాన పడ్డ అమ్మ శ్రీవిద్యా డిగ్రీలో చేరిన నాలుగు నెలలకే చనిపోయింది. జీవితమే చీకటిగా మారిపోయింది. శ్రీవిద్యని, చెల్లిని బంధువులు చూసుకుంటామని ముందుకొచ్చినా ఆమె మనసు అంగీకరించలేదు. డిగ్రీ చదువుతూనే చెల్లి సాయంతో వ్యాపారాన్ని కొనసాగించి 80శాతం మార్కులు సాధించింది.
ఉన్నత చదువులు చదవాలన్న కోరిక ఉన్నా.. ఆర్థిక ఇబ్బందులు కారణంతో చదువుకు పుల్‌స్టాఫ్ పెట్టింది. ఎలాగోలా చెల్లిని డిగ్రీ చదివించి పెళ్లి చేసింది. అప్పులూ తీర్చింది. తర్వాత ఆమె కూడా పెళ్లి చేసుకుంది. శ్రీవిద్య భర్త ప్రదీప్ టీచర్. ఆయన ప్రోత్సాహంతో బీఈడీలో ఉచిత సీటు సాధించింది. ఇంతలో పాప పుట్టడంతో ఎంఏ కలకు బ్రేక్ పడింది. పైగా చదవాలంటే మైసూరుకు వెళ్లాలి. వాళ్లది ఉమ్మడి కుటుంబం. ఇంట్లో పనితోనే రోజంతా గడిచిపోయేది. అంతదూరం పంపడానికి ఇంట్లో అంగీకరించలేదు.
అనంతరం రెండేళ్లకు.. అంటే 2020లో హుణసూరులోనే కాలేజీ ప్రారంభమవ్వడంతో చదువుపై మళ్లీ కోరిక కలిగింది. ఇంట్లో ఒప్పించి ఎంఏ (కన్నడ)లో చేరింది. తెల్లవారుజామున లేచి ఇంటిపని పూర్తిచేసి కాలేజీకి వెళ్లేది. రెండేళ్లు చదువు ఆపినా 8.9పర్సెంటైల్ సాధించింది. మైసూరు యూనివర్సిటీలో స్నాతకోత్సవంలో 15 గోల్డ్ మెడల్స్, నాలుగు నగదు పురస్కారాలు అందుకుంది. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది.
COMMENTS