Here's how to check if someone has used your PAN card
మీ పాన్‌కార్డును ఎవరైనా వాడారో లేదో ఇలా చెక్ చేయండి
మనం చాలా చోట్ల ఐడీ ప్రూఫ్‌గా పాన్‌కార్డును ఇస్తుంటాం. ఆర్థిక లావాదేవీలకు పాన్‌కార్డు తప్పనిసరి అయింది. మీ పాన్ నెంబర్‌తో మొత్తం మీకు ఎన్ని లోన్స్ ఉన్నాయి, మీ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎన్ని క్రెడిట్ కార్డులు ఉన్నాయి, మొత్తం లిమిట్ ఎంత ఇలాంటి వివరాలు అన్నీ తెలుసుకోవచ్చు. అయితే ఇటీవల పాన్ కార్డ్ మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. అంటే ఒకరి పాన్ కార్డ్ ఉపయోగించి మరొకరు లావాదేవీలు చేయడం లేదా లోన్స్ తీసుకోవడం లాంటి మోసాలు బయటపడుతున్నాయి.
పాన్ కార్డ్ ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే ముఖ్యమైన డాక్యుమెంట్. వ్యక్తులకే కాదు, సంస్థలకు కూడా పాన్ కార్డులు ఉంటాయి. పాన్ నెంబర్లో 10 ఆల్ఫాన్యూమరికల్ డిజిట్స్‌తో ఉంటాయి. ప్రతీ పాన్ నెంబర్ భిన్నంగా ఉంటుంది. అంటే ఒకే నెంబర్‌తో రెండు పాన్ కార్డులు ఉండవు. సైబర్ నేరగాళ్లు ఇతరుల పాన్ కార్డ్ డేటా ఉపయోగించి క్రెడిట్ కార్డులు తీసుకుంటారు. రుణాలు కూడా తీసుకుంటున్నారు. అందుకే పాన్ కార్డ్ హోల్డర్స్ అప్రమత్తంగా ఉండాలి.
బ్యాంక్ స్టేట్మెంట్స్, క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్స్, మెయిల్స్, ఇతర లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్స్ తరచూ చెక్ చేస్తూ ఉండాలి. మీ క్రెడిట్ రిపోర్ట్‌ను నెలకోసారైనా చెక్ చేయాలి. సిబిల్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకుంటే మీ పేరుతో ఎన్ని లోన్స్, ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయో తెలుస్తుంది. ఈ రిపోర్ట్‌లో మీరు తీసుకోని లోన్ లేదా క్రెడిట్ కార్డ్ ఏదైనా ఉందేమోనని గుర్తించాలి.
ఆదాయపు పన్ను శాఖ వెబ్సైట్లో మీ వివరాలతో లాగిన్ కావాలి. అందులో ఫామ్ 26ఏఎస్ చెక్ చేయాలి. మీ పాన్ కార్డుతో జరిపిన లావాదేవీలన్నీ అందులో ఉంటాయి. ఓసారి ఆ వివరాలన్నీ చెక్ చేయాలి. ఒకవేళ అనుమానాస్పద లావాదేవీలు ఉంటే వెంటనే అలర్ట్ కావాలి. ఉదాహరణకు మీ పేరు మీద క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్టు ఉంటే క్రెడిట్ కార్డ్ జారీ చేసిన సంస్థకు కంప్లైంట్ చేయాలి. లోన్ తీసుకున్నట్టు వివరాలు ఉంటే సదరు బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థకు కంప్లైంట్ ఇవ్వాలి.
మీ పాన్ కార్డును ఇతరులు ఉపయోగించినట్టు మీ దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా వెనకాడవద్దు. ఆదాయపు పన్ను శాఖ కస్టమర్ సర్వీస్ హెల్ప్‌లైన్ నెంబర్‌కు కంప్లైంట్ చేయాలి. లేదా దగ్గర్లో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలి. కంప్లైంట్లో మీ ద్గగర ఉన్న ప్రూఫ్స్ కూడా చూపించండి.
COMMENTS