NASA : He faced difficulties.. He moved towards the goal.. He got a job in NASA.. Guntur boy's success story..!
NASA : కష్టాలను ఎదుర్కొన్నాడు.. లక్ష్యం వైపు పయనించాడు.. నాసాలో జాబ్ కొట్టాడు.. గుంటూరు కుర్రాడి సక్సెస్ స్టోరీ..!
Success Story : తెలుగు కుర్రాడు.. అందులోనూ గుంటూరు కుర్రాడు.. హర్షవర్ధన్‌రెడ్డి నాసాలో ఉద్యోగం సంపాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. విజయం ఎంతో మంది సాధిస్తారు.. కానీ ప్రతికూల పరిస్థితుల్లో సైతం పోరాడి విజయం సాధించడమే నిజమైన కిక్.. మనోడి విజయగాథ కూడా అలాంటిదే..
NASA in America :నాసా (NASA)లో ఉద్యోగం సాధించడం అంటే మామూలు విషయం కాదు. అంతరిక్ష పరిశోధన సంస్థల్లో ప్రపంచంలోనే ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న నాసా (NASA)లో ఉద్యోగం చేయాలని ఎంతో మంది కలలు కంటారు.. కానీ కొందరే సాధిస్తారు. ఇంతటి ప్రఖ్యాతి గల సంస్థలో గుంటూరుకు చెందిన కుర్రాడు ఉద్యోగం సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే అతనికి ఇది అంత సులభంగా వచ్చింది కాదు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు ఇలా ఎన్నో ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని నిలిచాడు.. చివరికి తన లక్ష్యాన్ని సాధించాడు. వివరాల్లోకెళ్తే..
గుంటూరుకు చెందిన హర్షవర్దన్‌రెడ్డి ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా)లో కొలువు సాధించాడు. కడప జిల్లాకు చెందిన ఈశ్వర్ రెడ్డి, శివ పార్వతలు కొద్ది కాలం కిందట గుంటూరు వచ్చి స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు పిల్లలు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఈశ్వర రెడ్డి ఇద్దరి పిల్లలను బాగా చదివించాలనుకున్నారు. ప్రైవేటు పాఠశాలలో పని చేస్తూ వారిని ఉన్నత చదువులు చదివించారు.
పెద్ద కొడుకు హర్షవర్థన్ రెడ్డి చిన్నప్పటి నుండి చదువులో చురుగ్గా ఉండేవాడు. పులివెందులలో పదవ తరగతి వరకూ చదివి హైదరాబాద్ శ్రీ చైతన్యలో ఇంటర్ పూర్తి చేశాడు. అనంతరం జేఈఈలో మంచి మార్కులతో ఐఐటి గౌహతిలో సీటు సాధించాడు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన హర్షవర్థన్ రెడ్డి చదువులో ప్రతిభను చాటడంతో పాటు సిల్వర్ మెడల్ కూడా సాధించాడు.
ఓఎన్జీసీ హర్షవర్థన్ రెడ్డికి బంగారు పతకంతో పాటు లక్ష రూపాయల ఉపకార వేతనం కూడా అందించింది. 2015లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన హర్షవర్థన్ రెడ్డి పీహెచ్‌డీ చేయాలనుకున్నాడు. అయితే ఆర్థిక పరిస్థితులు అనుకూలించలేదు. ప్రైవేటు పాఠశాలలో పని చేస్తున్న తండ్రి మరోవైపు హర్షవర్థన్ రెడ్డి తమ్ముడు నందన్ రెడ్డిని చదివించాల్సి వచ్చింది. నందన్ రెడ్డి ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ పరీక్షలకు ప్రిపేరవుతున్ఆడు. ఇలా ఇద్దరూ పిల్లలను చదివించడం ఈశ్వర రెడ్డికి కష్టంగా మారింది.
ఈ క్రమంలో పీహెచ్‌డీ చేయాలని ఉన్నా ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో హర్ష రిలయెన్స్ సంస్థలో ఉద్యోగంలో చేరాడు. 2015 నుంచి 2017 వరకు రెండేళ్ల పాటు ఉద్యోగం చేశాడు. దీంతో ఆర్థిక పరిస్థితులు కొంత మెరుగయ్యాయి. వెంటనే కాలిఫోర్నియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. అక్కడ సీటు సాధించి ఏరో స్పేస్ పీహెచ్‌డీ చేస్తున్నాడు. పీహెచ్‌డీ చేస్తున్న సమయంలోనే నాసాలో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. కాలిఫోర్నియాలోని నాసా ఫీల్డ్ సెంటర్ లో ఇంజినీర్ గా ఈ నెల 10వ తేదీన బాధ్యతలు స్వీకరించాడు. కష్టాలెన్ని ఉన్నా ప్రణాళిక బద్ధంగా లక్ష్యం దిశగా మనం అడుగులు వేస్తే సాధించలేనిది ఏదీ లేదని మరోసారి నిరూపించాడు.
COMMENTS