UNION BUDGET 2023
ఇండియా బడ్జెట్ హిస్టరీ తెలుసా? 1860- 2023 వరకు కేంద్ర బడ్జెట్ చరిత్ర తెలుసుకోండి..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) త్వరలో 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి(Financial Year) సంబంధించిన ఆర్థిక నివేదికలు, పన్నుల ప్రతిపాదనలను పార్లమెంట్‌లో సమర్పించనున్నారు. ప్రవేశపెట్టే బడ్జెట్ (Union Budget) ద్వారా కొన్ని మినహాయింపులు, సడలింపులు కలుగుతాయని ప్రజలు ఎదురుచూస్తూ ఉంటారు. ఖర్చులను తగ్గించే, పొదుపును ప్రోత్సహించే నిర్ణయాల కోసం నిరీక్షిస్తుంటారు. త్వరలో రాబోతున్న 2023 బడ్జెట్ సందర్భంగా.. ఒక్కసారి వెనక్కి వెళ్లి భారతదేశ భవిష్యత్తు ప్రణాళికలు కోసం పునాదిరాయి వేసిన వారి గురించి తెలుసుకుందాం. 1860 నుంచి బడ్జెట్ చరిత్రను పరిశీలిద్దాం.
1860లో మొదటి బడ్జెట్
ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన స్కాటిష్ ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు జేమ్స్ విల్సన్ ఏప్రిల్ 7, 1860న యూనియన్ బడ్జెట్‌ను మొదటిసారిగా బ్రిటిష్ క్రౌన్‌కు సమర్పించారు. మొదటి బ్రిటీష్ ఇండియా బడ్జెట్ సమయంలో తయారీదారులు నాలుగు విభాగాలు నుంచి ఆదాయ మార్గాలను కలిగి ఉండేవారు. ఆస్తి, వృత్తి లేదా వ్యాపారం, సెక్యూరిటీలు, చెల్లింపులు & పెన్షన్ ఆదాయం నుంచి వచ్చే మొత్తం ఆదాయన్ని పరిగణనలోకి తీసుకునే వారు. అప్పట్లో రెండు పన్ను శ్లాబులు మాత్రమే ఉండేవి.
ఒక వ్యక్తి వారి వార్షిక ఆదాయం రూ.500 కంటే తక్కువ ఉంటే 2% పన్ను చెల్లించేవారు. అలాగే రూ.500 కంటే ఎక్కువ ఆదాయం ఉంటే 4% పన్ను విధించేవారు. దీని ప్రకారం రూ.500 లోపు ఆదాయం ఉన్నవారు రూ.10, దాని కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు రూ.20 పన్నుగా చెల్లించాల్సి వచ్చేది.భారత దేశానికి పేపర్ మనీని పరిచయం చేసిన మొదటి వ్యక్తి జేమ్స్ విల్సన్.
1947లో మొదటి స్వతంత్ర భారత బడ్జెట్
భారతదేశం తన మొదటి స్వతంత్ర బడ్జెట్‌ను నవంబర్ 26, 1947న ప్రవేశపెట్టింది. ఆ సమయంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన RK షణ్ముఖం శెట్టి స్వతంత్ర భారతదేశ మొదటి యూనియన్ బడ్జెట్‌ను సమర్పించారు. 1999 వరకు బ్రిటీష్ సంప్రదాయాన్ని అనుసరించి ఫిబ్రవరి నెల చివరి వర్కింగ్ డే రోజున 5 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవారు. తరువాత 1999లో బడ్జెట్ సమర్పణ సమయాన్ని అప్పటి ఆర్థిక మంత్రి దివంగత యశ్వంత్ సిన్హా ఉదయం 11 గంటలకు సర్దుబాటు చేశారు.
బ్రిటిష్ సంప్రదాయానికి స్వస్తి పలికిన అరుణ్ జైట్లీ
ఫిబ్రవరి నెల చివరి పనిదినాన కేంద్ర బడ్జెట్‌ను సమర్పించే బ్రిటిష్ సంప్రదాయానికి భిన్నంగా 2017 సంవత్సరంలో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం ప్రారంభించారు. 1995 వరకు బడ్జెట్ కేవలం ఇంగ్లీషులో మాత్రమే ప్రవేశపెట్టేవారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ నేతృత్వంలో ఇంగ్లీష్ పాటు హిందీలో కూడా బడ్జెట్ ముసాయిదాను ముద్రించి ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.
2021 నుంచి పేపర్ లెస్ బడ్జెట్
కోవిడ్-19 వ్యాప్తి కారణంగా 2021-2022 ఆర్థిక సంవత్సరం నుంచి బడ్జెట్‌లో పేపర్ విధానాన్ని తొలగించారు. ఇలా చేయడం స్వతంత్ర భారతదేశంలో ఇదే మొట్టమొదటిసారి. ఇందిరా గాంధీ తర్వాత భారతదేశ చరిత్రలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రెండవ మహిళగా నిర్మలా సీతారామన్ నిలిచారు. ఆమె ప్రస్తుతం వరుసగా ఐదో సారి బడ్జెట్‌ను తీసుకురానున్నారు.
COMMENTS