RYTHU BANDHU 2022
రైతులకు అలర్ట్.. రైతుబంధుకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి అవకాశం.. ఆ తేదీలోగా..
Rythu Bandhu: రైతుబంధు పథకం కింద లబ్ధి పొందేందుకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం కరీంనగర్ జిల్లా రైతులకు మరో అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. కొంతమంది కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన నేపథ్యంలో.. దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం ఇచ్చింది. వారితో పాటు ఇప్పటివరకు పట్టాదారు పాస్‌బుక్, బ్యాంకు డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు వివరాలు కూడా ఇవ్వని రైతులు కూడా ఇప్పుడు వాటిని సమర్పించి రైతుబంధు పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది.
ప్రధానాంశాలు:
- కరీంనగర్ జిల్లా రైతులకు గుడ్ న్యూస్
- రైతుబంధుకు దరఖాస్తు చేసుకునేందుకు మరో ఛాన్స్
- జనవరి 7వ తేదీలోగా అప్లై చేసుకోవాలని సూచన
Rythu Bandhu: తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. యాసంగి సీజన్‌కి సంబంధించి ఈ నెల 28 నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ చేయాలని ఇటీవల అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఒక ఎకరం నుంచి మొదలుపెట్టి సంక్రాంతిలోపు రైతులందరీ బ్యాంక్ అకౌంట్లలో నగదు జమ చేయాలని కేసీఆర్ ఆదేశించారు. వీటికి అవసరమైన నిధులు విడుదల చేయాలని ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావును కేసీఆర్ ఆదేశించారు.
ఈ నెల 29 నుంచి రైతుబంధు డబ్బులు జమ కానుండగా.. సెస్ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల జిల్లా రైతులకు వారం రోజుల ముందుగానే రైతుబంధు డబ్బులు విడుదల చేశారు. అయితే రైతుబంధుకు దరఖాస్తు చేసుకునేందుకు కరీంనగర్ జిల్లా రైతులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. జనవరి 7లోగా దరఖాస్తు చేసుకోవాలని రైతులకు సూచించింది. భూక్రయవిక్రయాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన వారు రైతుబంధు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది.
పట్టాదారు పాసు పుస్తకం, బ్యాంక్ పాస్‌బుక్, ఆధార్ కార్డు, ఇతర పత్రాల జిరాక్సులతో గడువులోగా దరఖాస్తు చేసుకుంటే డబ్బులు పడతాయని ప్రభుత్వం తెలిపింది. కొంతమంది గ్రామాల్లో అందుబాటులో లేకపోవడం, పట్టాదారు పాసు బుక్‌లు కలిగి ఉన్నా ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా పత్రాలు సమర్పించకపోవడంతో రైతుబంధు లబ్ధిదారుల జాబితాలో కొంతమంది నమోదు కాలేదు. బ్యాంకు వివరాలు ఇవ్వనివారు, తప్పుగా ఇచ్చినవారు, ఆధార్ కార్డు కాపీలు ఇవ్వనివారు కూడా సరైన పత్రాలు సమర్పించాలని ప్రభుత్వం సూచించింది.
ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవ్వకపోవడం, పట్టాలపై ఆంక్షలు విధించడం, ఒక సర్వే నెంబర్‌తో రెండు పట్టాదారు పాసు పుస్తకాలు కలిగి ఉండటం వల్ల కొంతమంది రైతుబంధుకు దూరమవుతున్నట్లు ప్రభుత్వ అధికారుల పరిశీలనలో తేలింది. జిల్లాలో ప్రస్తుతం రైతుబంధు లబ్ధిదారుల సంఖ్య 1.72,877గా ఉంది. ఇప్పుడు దరఖాస్తు చేసుకునేందుకు గడువు మరింత పెంచడంతో.. లబ్ధిదారుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. కరీంనగర్ జిల్లాల్లోనే కాకుండా చాలా జిల్లాల్లో కొత్తగా లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పెరిగినట్లు తెలుస్తోంది.
మొత్తం 68 లక్షలకుపైగా రైతులకు రూ.7,600 కోట్లను బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం వేయనుంది. ఇప్పటివరకు 9 సీజన్లలో రైతులకు ప్రభుత్వం పెట్టబడి సాయం అందించింది. ఇప్పటివరకు రైతుబంధు పథకం కింద రూ.58,102 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
COMMENTS