Before requesting a home loan from a bank, let's learn more about these.

Before requesting a home loan from a bank, let's learn more about these.

Before requesting a home loan from a bank, let's learn more about these.

గృహ‌ రుణం కోసం బ్యాంకును సంప్ర‌దించే ముందు వీటిని గురించి తెలుసుకుందాం.

గ‌త కొద్ది రోజులుగా గృహ రుణ వ‌డ్డీ రేట్లు త‌క్కువ‌గా ఉండ‌డం, రియ‌ల్ ఎస్టేట్ మార్కెట్ స్త‌బ్దుగా ఉండ‌డం సొంతింటి కలను సాకారం చేసేందుకు కొనుగోలుదారుల‌కు క‌లిసొచ్చే అంశం. అయితే, దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌ధాన న‌గ‌రాల్లో చాలా మంది  రుణాల ద్వారానే ఆస్తుల‌ను కొనుగోలు చేస్తున్నారు. అయితే గృహ రుణం కోసం బ్యాంకుల‌ను గానీ బ్యాకింగేత‌ర సంస్థ‌ల‌ను సంప్ర‌దించే ముందు కొన్ని నిర్దిష్ట అంశాల‌ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

1. రుణ అర్హత..: రుణ గ్ర‌హీత అర్హ‌త‌ను నిర్ణ‌యించ‌డంలో ఆదాయం, వ‌య‌సు, క్రెడిట్ స్కోరు, రుణ కాల‌వ్య‌వ‌ధి వంటి ప‌లు అంశాల‌ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుంటాయి బ్యాంకులు. అయితే ప్ర‌ధానంగా రుణ అర్హ‌త‌ను నిర్ణ‌యించేది మాత్రం వార్షిక ఆదాయ‌మే. కాబ‌ట్టి రుణ అర్హ‌త‌ను పెంచుకునేందుకు జీవిత భాగ‌స్వామి ఆదాయాన్ని కూడా.. మీ ఆదాయానికి చేర్చొచ్చు. ఇందుకు స‌హ ద‌ర‌ఖాస్తుదారునిగా జీవిత భాగ‌స్వామిని చేర్చాల్సి ఉంటుంది. చేతికి వ‌చ్చే జీతం మొత్తం నుంచి 50 శాతం మాత్ర‌మే ఈఎంఐగా చెల్లించేందుకు బ్యాంకులు అంగీక‌రిస్తాయి. ఎక్కువ కాల‌ప‌రిమితి ఎంచుకుంటే ఈఎంఐ త‌గ్గుతుంది. అలాగే రుణం మొత్తం పెంచుకునేందుకు వీలుంటుంది. 

ప్ర‌స్తుతం ఆన్‌లైన్‌లో హోమ్‌లోన్ కాలిక్యులేట‌ర్లు అందుబాటులో ఉన్నాయి. వీటి సాయంతో మీ రుణ అర్హ‌త‌ను తెలుసుకోవ‌చ్చు. లేదా నేరుగా రుణ దాతను సంప్ర‌దించి.. మీ వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల ఆధారంగా రుణ అర్హ‌త‌ను అడిగి తెలుసుకోవ‌చ్చు. రుణం తీసుకునే ముందు 3 నుంచి 4 బ్యాంకుల‌ను సంప్ర‌దించి వివ‌రాల‌ను తెలుసుకుని అనువైన బ్యాంకు వ‌ద్ద నుంచి రుణం తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. 

2. వ‌డ్డీ: సాధార‌ణంగా బ్యాంకులు గృహ రుణ వ‌డ్డీ రేట్ల‌ను ఆర్‌బీఐ రెపో రేటుతో అనుసంధానిస్తాయి. అందువ‌ల్ల ఆర్‌బీఐ రెపో రేటును స‌వ‌రించిన ప్ర‌తిసారీ బ్యాంకులు అందించే వ‌డ్డీ రేట్ల‌లోనూ మార్పులు చోటుచేసుకుంటాయి. రుణ గ్ర‌హీత‌గా బ్యాంక్ ఎక్స్‌ట్ర‌న‌ల్ బెంచ్‌మార్క్ రేటును మీరు తెలుసుకోవ‌చ్చు. దీనినే రెపో లింక్డ్ లెండింగ్ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్‌) అని కూడా అంటారు.  బ్యాంకులు ఆర్ఎల్ఎల్ఆర్ ఫ్లోర్ రేటుగా తీసుకుని దానిపై కొంత మార్జిన్ వేసి రుణాల‌కు వ‌ర్తింపజేస్తాయి. మార్జిన్ ఎంత అని నిర్ణ‌యించే స్వేచ్ఛ బ్యాంకుల‌కు ఉంటుంది. ఉదాహ‌ర‌ణకు.. బ్యాంకు ఆర్ఎల్ఎల్ఆర్ రేటు 6.5 శాతం ఉంటే.. బ్యాంకు అస‌లు గృహ‌రుణ వ‌డ్డీ రేటు 7.5 శాతం ఉంద‌నుకుందాం. అంటే ఇక్క‌డ బ్యాంకు మార్జిన్ 1 శాతం ఉంటుంది. ఈ రేటు వేరు వేరు రుణ గ్ర‌హీత‌ల‌కు వేరు వేరుగా ఉండొచ్చు. తీసుకున్న రుణం మొత్తం, కాల‌వ్య‌వ‌ధి, రుణ గ్ర‌హీత రిస్క్ గ్రూప్‌ వంటి.. ప‌లు అంశాల ఆధారంగా వ‌డ్డీ రేటు మారుతుంటుంది. అందువ‌ల్ల ఆర్ఎల్ఎల్ఆర్ లేదా లెండింగ్ రేటు త‌క్కువ ఉన్న రుణ‌దాత‌లను అన్వేషించి, మీకు వ‌ర్తించే గృహ రుణ వ‌డ్డీ రేటు పోల్చిచూడండి. 

3. క్రెడిట్ స్కోరు: రుణం త్వ‌ర‌గా మంజూరు కావాల‌న్నా, అలాగే త‌క్కువ వ‌డ్డీ రేటుకే ల‌భించాల‌న్నా మంచి క్రెడిట్ స్కోరును క‌లిగి ఉండ‌డం చాలాముఖ్యం. 750 లేదా అంత‌కంటే ఎక్కువ క్రెడిట్ స్కోరు ఉంటే.. వీలైనంత త‌క్కువ వ‌డ్డీకే రుణం ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకొస్తున్నాయి. ఒక‌వేళ మీరు గృహ రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేస్తుంటే మీ క్రెడిట్ స్కోరు చెక్ చేసుకోండి. 750 కంటే త‌క్కువ ఉంటే క్రెడిట్ స్కోరును మెరుగుప‌రుచుకునే ప్ర‌య‌త్నం చేయండి. ఆ త‌ర్వాతే రుణంకోసం ద‌ర‌ఖాస్తు చేయండి.

4.డౌన్‌పేమెంట్‌: కొత్తగా కొనుగోలు చేస్తున్న ఇంటి విలువ‌లో 80 నుంచి 90 శాతం మొత్తాన్ని రుణంగా ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వ‌స్తున్నాయి. మిగిలిన మొత్తాన్ని కొనుగోలుదారుడు స్వ‌యంగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే వ‌డ్డీ భారాన్ని త‌గ్గించుకునేందుకు వీలైనంత ఎక్కువ డౌన్‌పేమెంట్‌ను సిద్ధం చేసుకోవాల‌ని, త‌క్కువ మొత్తాన్ని రుణంగా తీసుకోవాల‌ని చెప్తుంటారు నిపుణులు. 

ఒక‌వేళ గృహ కొనుగోలు స‌మయంలో ఎక్కువ డౌన్‌పేమెంట్‌ని ఏర్పాటు చేసుకోలేక పోయిన‌ప్ప‌టికీ, చెల్లింపులు ప్రారంభ ద‌శ‌లో ఉన్న‌ప్పుడు రుణ మొత్తంలో ప్ర‌ధాన భాగాన్ని తిరిగి చెల్లించ‌డం మంచిది. ఎందుకంటే ప్రారంభ ద‌శ‌లో చెల్లించే ఈఎంఐలో ఎక్కువ భాగం వ‌డ్డీ ఉంటుంది. కాబ‌ట్టి వ‌డ్డీ భారాన్ని త‌గ్గించుకోవ‌చ్చు. 

5.కావ‌ల‌సిన ప‌త్రాలు: గృహ రుణం కోసం ద‌ర‌ఖాస్తు ఫారంతో పాటు కొన్ని ప‌త్రాల‌ను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆదాయ మార్గాన్ని అనుస‌రించి ఇవ్వాల్సిన ప‌త్రాలు ఉంటాయి . జీతం ద్వారా ఆదాయం పొందుతున్న వారు ఫారం-16తో పాటు మూడు సంవ‌త్స‌రాల ఐటీ రిట‌ర్నులు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు ఇవ్వాల్సి ఉంటుంది. వృత్తి, వ్యాపారులు వారి ఆదాయాన్ని బ‌ట్టి మూడు సంవ‌త్స‌రాల ఐటీ రిట‌ర్నులు, గ‌త మూడు సంవ‌త్స‌రాల లాభ‌/న‌ష్టాల బ్యాలెన్స్ షీట్‌, 6 నెల‌ల బ్యాంకు స్టేట్‌మెంట్‌లు, జీఎస్టీ రిట‌ర్నులు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

చివ‌రగా..: ఇంటి కొనుగోలు విలువ లక్ష‌ల్లో ఉంటుంది. కాబ‌ట్టి రుణం తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి కావ‌చ్చు. అలాగే తిరిగి చెల్లింపుల‌కు దీర్ఘ‌కాల స‌మ‌యం ప‌డుతుంది. అందువ‌ల్ల గృహ కొనుగోలు నిర్ణ‌యం తీసుకునే ముందు పైన వివ‌రించిన ప‌లు అంశాల‌పై దృష్టిపెట్టాలి. రుణ వ‌డ్డీ శాతం కొద్దిగా త‌గ్గినా.. చెల్లింపులు ల‌క్ష‌ల్లో త‌గ్గించుకునే అవ‌కాశం ఉంది. అందువ‌ల్ల ఒక బ్యాంక్‌కే ప‌రిమితం కాకుండా, 3 నుంచి 4 బ్యాంకుల‌ను సంప్ర‌దించి వివ‌రాలు తెలుసుకుని.. రుణం తీసుకోవ‌డం మంచిది.

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post