Temarind : ఉద్యాన శాస్త్రవేత్తల ఘనత.. కొత్తరకం చింత మొక్కల ఆవిష్కరణ
Temarind : భారత దేశపు ఖర్జూరంగా చింతను పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ దైనందిన ఆహారపు వంటకాల్లో చింతపండును విరివిగా ఉపయోగిస్తారు. సాంప్రదాయ ఔషదాలతో పాటు, మెటల్ పాలిష్ లలో దీనిని వాడతారు. చింత చెట్టు 20 మీటర్ల ఎత్తువరకు పెరుగి దట్టంగా వ్యాపిస్తుంది. చింత చిగురును ఆకు కూరగా వినియోగిస్తారు. కూరల్లో పుల్లదనానికి చింతపండును వాడతారు. పులిహోరలో చింత పండు గుజ్జుతో మంచి రుచి వస్తుంది.
ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో చింతసాగు చేసేందుకు చాలా మంది రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో చింతపంట సాగును రైతులు చేపట్టారు. సాధారణంగా చింత మొక్కలు నాటిన ఆరేళ్ల తర్వాత కాయలు కాయడం ప్రారంభిస్తాయి. చింత మొక్కలు నాటిన తరువాత ఎక్కవకాలం రైతులు దిగుబడికోసం వేచిచూడాల్సిన పరిస్ధితి నెలకొంది. ఈ నేపధ్యంలో గత కొంతకాలంగా వ్యవసాయ శాస్త్ర వేత్తలు కొత్త రకం చింత వంగడాన్ని సృష్టించేందుకు పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల పరిధిలోని రేకులకుంట ఉద్యాన పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు తెట్టుఅమాలిక అనే కొత్త రకం చింత మొక్కలను ఆవిష్కరించారు. ఇవి తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి ఇస్తాయి. గతంలో అనంత రుధిర పేరుతో నూతన రకం చింత మొక్కలను ఈ పరిశోధనా కేంద్రం రూపొందించింది..
రేకులకుంట ఉద్యాన పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు నటరాజ్, శ్రీనివాసులు చిత్తూరుజిల్లా మదనపల్లె శివారులో ఉన్న తెట్టు అనే గ్రామంలో చింత చెట్ల నమూనాలు తీసుకువచ్చి పరిశోధనలు చేపట్టారు. 2012 నుండి 2018 వరకు వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశోధనలు కొత్త రకం చింత పై పరిశోధనలు చేపట్టి కొత్త రకాన్ని సృష్టించారు. తెట్టు గ్రామం నుంచి తీసుకురావడంతో ఆ గ్రామం పేరు కలిసేలా తెట్టుఅమాలిక గా నామకరణం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తెట్టుఅమాలిక వంగడానికి 2019లో గుర్తిస్తూ అనుమతులు ఇచ్చింది.
ఈ తెట్టుఅమాలిక వెరైటీ చెంతరకం నాటిన మూడేళ్ల నుంచే కాపుకు వస్తాయి. ఒక్కో చెట్టు నుంచి 20 కిలోల చింతపండు వస్తుంది. పదేళ్ల తర్వాత 200 కిలోల వరకూ వస్తుంది. ఇతర మామూలు రకాలతో పోల్చుకుంటే ఈ రకం చింతచెట్లు తక్కువ ఎత్తు, తక్కువ విస్తీర్ణంలో పెరుగుతాయి. చింతపండు నాణ్యత విషయంలో ఇతర వాటితో పోల్చుకుంటే చాలా బాగుండటాన్ని గుర్తించారు. ఈరకం సాగుకోసం అటు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. మన రాష్ట్రంతోపాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా నుంచి రైతులు మొక్కల కోసం రేకులకుంట పరిశోధనా స్ధానాన్ని సంప్రదిస్తున్నారు. ఇప్పటి వరకు 30వేల వరకు మొక్కలను రైతులకు అందజేశారు. తెట్టు మాలిక చింత రకాన్ని అవిష్కరించటంతో రేకులకుంట ఉద్యాన పరిశోధన స్ధానానికి జాతీయ స్ధాయిలో గుర్తింపు లభించింది.
COMMENTS