Drumstick Cultivation : మునగలో చీడపీడల నివారణ
Drumstick Cultivation : భారతీయుల వంటకాల్లో మునగ అత్యంత ముఖ్యమైనది. ఏంతో రుచిగా ఉండే మునగ కూరను ఇష్టంగా ఆరగిస్తారు. మునగలో ఎన్నో పోషకవిలువలు ఉన్నాయి. దీంతో మునగపంటకు మంచి అదరణ పెరిగింది. ఇటీవలి కాలంలో మునగ సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. మునగసాగులో సరైన యాజమాన్యపద్దతులు పాటిస్తూ, చీడపీడలను నివారిస్తే మంచి దిగుబడితోపాటు, రైతులు అదాయాన్ని పొందవచ్చు. మునగసాగులో చీడపీడల విషయంలో రైతులు ఈ క్రింది సస్యరక్షణ చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
చీడపీడల నివారణ…
గొంగళి పురుగు: మునగ పంటనాశించే పురుగులలో ఇది చాలా ముఖ్యమైనది. రెక్కల పురుగు లేత పసుపు రంగులో ఉండే రెక్కలను కలిగి ఉంటుంది. తల్లి రెక్కల పురుగు మునగ లేత భాగాల పైన గుడ్లను పెడుతుంది. గుడ్ల నుంచి 5 నుండి 7 రోజులలో పిల్ల పురుగులు బయటికి వస్తాయి. పగటి సమయంలో సమూహాలుగా చెట్టు కాండం పైకి చేరతాయి. రాత్రి వేళల్లో ఈ గొంగళి పురుగులు ఆకులను తింటూ బెరడును కూడా గీకుతాయి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే చెట్లు మోడులాగా అవుతాయి. ఈ పురుగు నివారణకి, తల్లి రెక్కల పురుగు పెట్టిన గుడ్డ సముదాయాలను, గొంగళి పురుగు సమూహాలను ఏరి నాశనం చేయాలి. కాగడాల లాంటి చిన్న మండలతో చెట్టు బెరడు మీద గుంపులుగా ఉన్న గొంగళి పురుగులను నాశనం చేయాలి. క్వినాల్ ఫాస్ 2 మి.లీ. లేదా మిథైల్ డెమటాన్ 2 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి ఈ పురుగును నివారించవచ్చు.
కాయతొలిచే ఈగ: కాయతోొలిచే ఈగ పూత దశలో ఆశించి పిందె దశలో కాయలోనికి ప్రవేశించి, లోపలి, పదార్ధాన్ని తిని నాశనం చేస్తాయి. దీంతో కాయల ఆకారం మారిపోయి వంకరగా అవుతాయి. కాయతోలిచే ఈగ నివార ణకు పూత దశలో లీటరు నీటికి 2 మి.లీటర్ల ఫాసలన్ కలిపి పిచికారీ చేయాలి. పిందె దశలో లీటరు నీటికి 1మి.లీటరు డైక్లోరోవాస్ కలిపి మళ్లీ పిచికారీ చేయాలి. అవసరమైతే మరోసారి 25 రోజుల తరువాత పిచికారీ చేయాలి.
వేరు కుళ్లు, కాండం కుళ్లు: వర్షాకాలంలో మురుగు నీరు పోయే సౌకర్యం లేని నేలల్లో ఎక్కువగా ఆశిస్తుంది. కాండం చుట్టూ ఉన్న బెరడు కుళ్లిపోయి చెట్టు విరిగిపోతుంది. వేర్లు కూడా కుళ్లిపోయి చెట్టు చనిపోతుంది. దీని నివారణకు లీటరు నీటిలో 1గ్రాము కార్చండైజిమ్ లేదా 3గ్రాముల డైథేన్ ఎం-45 కలిపిన ద్రావణం కానీ లేదా 1శాతం బోర్టోమిశ్రమం గానీ మొక్కల మొదలు వద్ద ముంపుగా తడపాలి. మొక్క మొదలు వద్ద మురుగు నీరు నిల్వకుండా జాగ్రత్త తీసుకోవాలి. ప్రతి చెట్టూ మొదలులో ట్రైకోడెర్మా విరిడి ఎకరానికి 2 కిలోలు కలిపిన పశువుల ఎరువును 5 కిలోల చొప్పున వేయాలి.
COMMENTS