Lamb Care : చలికాలంలో గొర్రెపిల్లల సంరక్షణ…మెళకువలు
Lamb Care : చలికాలంలో జీవాల పెంపకం అన్నది పెద్ద సవాల్ లాంటిదే. జీవాల పెంపకం, సాం ప్రదాయ పద్ధతులలో కొనసాగడం వల్ల ఈకాలంలో జీవాలు తరచూ వ్యాధులకు గురికావడం, అంతర పరాన్న జీవుల కారణంగా మృత్యువాత పడుతుంటాయి. చలికాలంలో జీవాల పెంపకంలో తగిన జాగ్రత్తలు తీసుకోనట్టయితే ముఖ్యంగా పిల్ల గొర్రెలు చలికి తట్టుకోలేక ఊపిరితిత్తుల వ్యాధితో చనిపోతుంటాయి. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో సరిగ్గా పాలు తాగకపోవడంతో ఒకటి రెండు రోజల్లోనే చనిపోతాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వాటిని కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు; గొర్రెపిల్ల పుట్టిన వెంటనే అరగంటలోపు వాటికి తల్లిపాలు తాగించాలి. మొదటి 15 రోజుల వరకు పూర్తిగా తల్లిపాల మీదనే పిల్లల పోషణ జరగాలి. ఇలా చేయటం వల్ల వాటిలో వ్యాధినిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఒకవేళ తల్లి వద్ద పాలు లేకపోతే డబ్బాతో అయినా పాలు పట్టించాలి. పిల్లల బొడ్డును 2-3 అంగుళాలు వదలి దారంతో కట్టి ,కొత్త బ్లేడ్ తొ కత్తిరించి , అయోడిన్ 2-3 రోజుల పాటు అద్దాలి . ఇలా చేయటం వల్ల దనుర్వాతం , బొడ్డువాపు సమస్యలు రాకుండా ఉంటాయి.
పుట్టగానే ధనుర్వాతం రాకుండా టేటనాస్ టాక్సాయిడు ఇంజక్షన్ వేయించాలి. 3,4,5 రోజులలో యాంటిబయాటిక్ పౌడర్ ను నీళ్ళలో కలిపి తాగించాలి. 15 వ రోజు నట్టల నిర్మూలనకు మొదటిసారి నట్టల నివారణ మందు తాగించాలి. 15 రోజుల వయసు వచ్చిన తర్వాత చిన్న పిల్లల మిశ్రమ దాణా ను తల్లిపాలతోపాటుగా శరీర బరువులో ఒక శాతం అందించినట్టయితే పిల్లలలో ఎదుగుదల ఉంటుంది. పాకల్లో ఖనిజ లవణ ఇటుకలను వేలాడదిస్తే వాటిని నాకుతూ నేలను నాకకుండా మట్టి తినకుండా ఉంటాయి. త్రాగు నీరూ అందుబాటులో ఉండాలి. 2 నెలల వయసు నుండి పిల్లలకు పప్పు జాతి గడ్డి , వేప కొమ్మలు కోరికేందుకు అందుబాటులో ఉంచాలి. తద్వారా పొట్ట త్వరగా వృద్ది చెందుతుంది.
శాస్త్రీయ పద్ధతి ప్రకారం పిల్లలను 90 రోజులు వయసు వచ్చే వరకు బయటికి మేత కోసం తీసుకెళ్లకూడదు. అలా తీసుకెళ్లడం ద్వారా పిల్లలు తల్లితో సమానంగా నడవడం వల్ల అలిసిపోతాయి. 3 నెలల వయసు వచ్చిన తర్వాత పిల్లలను తల్లి నుండి వేరు చేయాలి. మూడుమాసాల వయసు పిల్లలో మేత వినియోగం బావుండి, పెరుగుదల రేట్ అధికంగా ఉంటుంది .కాబట్టి ఉదయం లేదా సాయంత్రం ఉలవలు ,శనగ,కంది ,మినప,పెసర పోట్టుగాని,ప్రత్యేకంగా తయారుచేసిన పిల్లల దాణ గాని 100 – 200 గ్రా.ఇవ్వాలి. ప్రతి రెండు నెలలకు ఒకసారి, 12 నెలల వయసు వచ్చే వరకు నట్టల మందు తాగించినట్టయితే నట్టల కారణంగా సంభవించే మరణాలను పూర్తిగా అరికట్టవచ్చు.
COMMENTS